
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు గతంలో ఇచి్చన తీర్పు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేలా ఉందన్న కేంద్రం వాదనపై తీర్పును సుప్రీం రిజర్వ్‌లో ఉంచింది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దురి్వనియోగం చేస్తున్నారంటూ, అట్రాసిటీ కేసులో డీఎస్పీ స్థాయి అధికారి విచారణను తప్పనిసరి చేస్తూ 2018లో తీర్పు ఇచి్చన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వచ్చే వారానికల్లా ఇరు పారీ్టలు లిఖితపూర్వక నివేదిక ఇవ్వాలని సూచిస్తూ జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎమ్‌ఆర్ షా, జస్టిస్ బీఆర్ గవైల ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం..
తాము చట్టప్రకారమే కొన్ని సూచనలిస్తామని, అవి సమానత్వాన్ని పెంపొందించేలా ఉంటాయని సుప్రీంకోర్టు తెలిపింది. చట్టాన్ని దురి్వనియోగం చేస్తున్నారన్న కారణంతో చట్టాన్ని తీసేయలేమని, అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టంచేసింది. కుల ప్రాతిపదికన ఒక వ్యక్తిని (బాధితుడిని) అనుమానిస్తారా ? ఇతర సామాజిక వర్గాల వారు కూడా తప్పుడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయవచ్చు అని అభిప్రాయపడింది. ఇతర వర్గాలకు చెందిన వ్యక్తులు వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయిస్తే విచారణ అవసరం లేదని, కానీ ఎస్సీ,ఎస్టీ వర్గాల వారు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటే అధికారి విచారణ అవసరం అనడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.