ఆయుష్మాన్ భారత్
న్యూఢిల్లీ : దేశంలోని పేదలకు రూ.5లక్షల ఆరోగ్య బీమాను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఆయుష్మాన్ భారత్ (ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అమలవుతోన్న ఈ పథకం 5 బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో అమలుకావడం లేదు. తెలంగాణ, ఢిల్లీ, ఒడిషా, కేరళ, పంజాబ్ రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయడం లేదని తెలిసింది. ప్రస్తుతం ఈ రాష్ట్రాలు తమ సొంత హెల్త్ స్కీమ్‌ను అనుసరిస్తున్నట్లు తెలిసింది. ఆయుష్మాన్ భారతం కంటే కూడా తమ అమలుచేస్తోన్న హెల్త్ స్కీం ఎంతో బాగున్నట్లు ఆయా రాష్ట్రాలు భావిస్తున్నట్లు సమాచారం.
దీని గురించి తెలంగాణ ప్రభుత్వం కేంద్ర పథకం కన్నా తాము రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ మెరుగ్గా ఉందని, ఆయుష్మాన్ భారత్ నిబంధనలు కఠినంగా ఉన్నందున రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య తగ్గే ప్రమాదముందని వివరించింది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఎంతో పటిష్టంగా అమలవుతోందని, కాబట్టి కేంద్ర పథకంలో చేరబోమని, ఒకవేళ రాష్ట్రానికి అనుగుణంగా మార్పులు చేస్తే పరిశీలిస్తామని తెలిపింది. మిగతా రాష్ట్రాలు కూడా తమ తమ అభ్యంతరాలను తెలిపినట్లు సమాచారం. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని మోదీ పేదల పాలిట సంజీవనిగా వర్ణిస్తుండగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీన్ని ఓ పీఆర్ ఎక్సర్‌సైజ్ కార్యక్రమం అంటూ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment