లక్నో: ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ఊహించని రీతిలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పొగమంచుతో వెలుతురు సరిగాలేని కారణంగా పాదచారులతో పాటు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా గ్రేటర్ నోయిడా దన్‌కౌర్ ప్రాంతంలో గౌతమ్ బుద్ధా నగర్ సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్ వే వద్ద సుమారు పది వాహనాలు వేగంగా వచ్చి ఒకదానికొకటి ఢీ కొనడంతో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే వాహనాల్లో ఉన్న ప్రయాణికులు ..భయంతో బయటకు పరుగులు తీశారు. దట్టమైన పొగమంచు కారణంగా ఏం కనపడక పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం పది గంటలైన పొగమంచు వీడకపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొగమంచు కారణంగా పలు రోడ్డు ప్రమాదాలు కేసులు నమోదవుతున్నాయి. పంజాబ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. ఉత్తరప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో పొగమంచు వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీని పొగమంచు చుట్టుముట్టేసిన విషయం తెలిసిందే. వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరడంతో ఢిల్లీ సర్కార్ పాఠశాలలకు ఆదివారం వరకూ సెలవు ప్రకటించింది. కాగా యమునా ఎక్స్‌ప్రెస్ వేపై 2016 డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో మళ్లీ వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment