ప్రణాళికా సంఘం పరిసమాప్తం | Termination of the Planning Commission | Sakshi
Sakshi News home page

ప్రణాళికా సంఘం పరిసమాప్తం

Published Fri, Jan 2 2015 2:49 AM | Last Updated on Thu, Oct 4 2018 4:40 PM

ప్రణాళికా సంఘం పరిసమాప్తం - Sakshi

ప్రణాళికా సంఘం పరిసమాప్తం

న్యూఢిల్లీ: దేశ స్వాతంత్య్రానంతరం 65 ఏళ్లపాటు కొనసాగిన ప్రణాళికా సంఘం గత చరిత్రగా మారిపోయింది. ఈ కాలంలో రూ. 200 లక్షల కోట్లకు పైగా నిధులతో మొత్తం 12 పంచవర్ష ప్రణాళికలు, ఆరు వార్షిక ప్రణాళికలను అందించిన ఈ సోవియట్ కాలపు సంస్థ గురువారంతో రద్దయిపోయింది. దీని స్థానంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్‌ఫామింగ్ ఇండియా - నీతి ఆయోగ్ (భారత్ పరిణామానికి జాతీయ సంస్థ)ను కేంద్రం నెలకొల్పింది.
 
ప్రభుత్వ లక్ష్యాల సాధనకు ప్రణాళికల కోసం...

భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌నెహ్రూ ప్రణాళికా సంఘాన్ని (యోజనా ఆయోగ్) నెలకొల్పారు. 1950 మార్చి 15న సాధారణ ప్రభుత్వ తీర్మానంతో ఏర్పాటైన ఈ సంఘం అనంతర కాలంలో ఎన్నో రాజకీయ, ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంది. వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రజల జీవన ప్రమాణాలను వేగంగా పెంపొందించటం, ఉత్పత్తిని పెంచటం, ఉపాధి అవకాశాలను అందించటం అనే ప్రభుత్వ ప్రకటిత లక్ష్యాలను సాధించటంలో భాగంగా ఈ సంస్థను నెలకొల్పారు.

దేశంలోని వనరులన్నిటినీ అంచనా వేయటం, లోటు ఉన్న వనరులను పెంపొందించటం, వనరులను అత్యంత సమర్థవంతంగా, సమతౌల్యంగా వినియోగించుకునేందుకు ప్రణాళికలను రూపొందించటం, ప్రాధాన్యాలను నిర్ణయించటం తదితర బాధ్యతలను ఈ సంస్థకు అప్పగించారు. ప్రణాళికాసంఘం ఏర్పాటైనప్పటి నుంచీ అది అనేక విధాలుగా రూపాంతరం చెందింది. ప్రణాళికలు రచించే సాధారణ సంస్థగా మొదలైన ఈ సంఘం ఆ తర్వాత శక్తిమంతమైన నియంత్రణ సంఘంగా, ఆర్థిక వికేంద్రీకరణ సాధనంగా, అధికారిక మేధోమథన బృందంగా రూపాంతరం చెందింది.

నిజానికి.. ప్రణాళికాసంఘాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనపై నెహ్రూ స్వయంగా వ్యతిరేకతను ఎదుర్కొన్నట్లు చెప్తారు. అయినా అనేక ప్రభుత్వాలు ఆర్థిక విధానాలను, ఇతర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి, అమలు చేసేందుకు ఈ సంఘం ప్రధాన సంస్థగా కొనసాగింది. ఈ సంస్థ తొలి పంచవర్ష ప్రణాళికను రూ. 2,000 కోట్ల కేటాయింపులతో 1951లో ప్రారంభించింది. 1965 వరకూ మరో రెండు పంచవర్ష ప్రణాళికలను రూపొందించింది.

1966 నుంచి 1969 మధ్య మూడు వార్షిక ప్రణాళికలను అమలు చేశారు. అనంతరం 1969లో నాలుగో పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారు. 1990లో కేంద్రంలో వేగంగా మారిపోయిన రాజకీయ పరిణామాల కారణంగా ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక ప్రారంభం కాలేదు. 1992లో ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక, 1997లో తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక మొదలయింది. ప్రణాళికా సంఘం మొత్తం 12 పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టింది.
 
స్థాపితమైంది    :    1950 మార్చి 15 కేంద్ర ప్రభుత్వ తీర్మానంతో
ఇప్పటివరకూ     :    12 పంచవర్ష ప్రణాళికలు, 6 వార్షిక ప్రణాళికలు
ఎంత నిధులు    :    200 లక్షల కోట్ల రూపాయలు
లక్ష్యాలు    :    ప్రజల జీవన ప్రమాణాలను, ఉత్పత్తిని, ఉపాధి అవకాశాలను పెంపొందించటం
బాధ్యతలు    :    వనరులను సమర్థవంతంగా వినియోగించుకునే ప్రణాళికల రూపకల్పన, ప్రాధాన్యాల నిర్ణయం
రద్దయింది    :    2015 జనవరి 1న ‘నీతి ఆయోగ్’ ఏర్పాటుతో
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement