
అమేథీలో ఘర్షణలు
పోలీస్ మృతి ఆరుగురికి గాయాలు
అమేథి: ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో కాంగ్రెస్ ఎంపీ సంజయ్‌సింగ్ కుటుంబ సభ్యుల మధ్య ఓ వివాదం ఆదివారం ఘర్షణకు దారి తీసింది. ఈ సందర్భంగా ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసులు 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదనపు బలగాలను రంగంలోకి దింపడంతోపాటు నిషేధాజ్ఞలను జారీ చేశారు. ఎంపీ సంజయ్‌సింగ్‌కు అమేథీలో వారసత్వంగా వచ్చిన ‘భూపతి భవన్’ ఉంది.
సంజయ్‌సింగ్, ఆయన రెండో భార్య అమిత ఈ భవనం వద్దకు రానున్నారనే సమాచారంతో... సంజయ్‌సింగ్ మొదటి భార్య గరిమ, ఆమె కొడుకు అనంత్ విక్రంసింగ్ ఆ భవనాన్ని ఆక్రమించుకున్నారు. బయట వారి మద్దతుదారులు గుమికూడారు. ఎంపీ సంజయ్ సింగ్ తన రెండో భార్యతో కలసి భూపతి భవన్ వద్దకు రావడంతో వివాదానికి దారి తీసింది. విక్రంసింగ్ మద్దతుదారులు, పోలీసుల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. అల్లరి మూకల కాల్పుల్లో కానిస్టేబుల్ విజయ్ మిశ్రా(45) మృతి చెందినట్లు ఏఎస్పీ మున్నాలాల్ తెలిపారు.