- గవర్నర్‌తో కమలనాథుల భేటీ
- మరింత గడువు కావాలని వినతి
జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు ముమ్మర యత్నాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీతో దోస్తీకి తాము విముఖంకాదని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) బుధవారం సూచనప్రాయంగా ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ ప్రతినిధి బృందం గురువారం జమ్మూలో గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రాను కలుసుకుంది. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుపై పార్టీలతో సంప్రదింపులకోసం తమకు మరింత గడువుకావాలని గవర్నర్‌ను కోరింది.
జమ్మూ ప్రాంతానికి చెందిన నేత ముఖ్యమంత్రి కావాలన్న అంశంపై వెనక్కు తగనున్నట్టు కూడా ఆ పార్టీ సూచనప్రాయంగా తెలిపింది. ప్రభుత్వం ఏర్పాటుకు ఈ నెల 19వరకే గవర్నర్ గడువు విధించినా, బీజేపీ ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోబోదని, వివిధ పార్టీలతో తమ చర్చలు సాగుతున్నాయని, ప్రభుత్వం ఏర్పాటుపై త్వరలోనే ప్రజలకు శుభవార్త అందుతుందని గవర్నర్‌తో భేటీ అనంతరం బీజేపీ జమ్మూ కశ్మీర్ విభాగం అధ్యక్షుడు జుగల్ కిశోర్ శర్మ చెప్పారు. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకోసమే బీజేపీ కృషిచేస్తుందని, ఇతర పార్టీలతో చర్చల ఫలితాలు వెల్లడయ్యేందుకు మరింత గడువు కావాలని గవర్నర్‌ను కోరామన్నారు.