ప్రధాని తప్పేం లేదు! | the government's decision is "entirely appropriate" on coal block allocation! | Sakshi
Sakshi News home page

ప్రధాని తప్పేం లేదు!

Published Sun, Oct 20 2013 1:49 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM

ప్రధాని తప్పేం లేదు!

ప్రధాని తప్పేం లేదు!


న్యూఢిల్లీ: బొగ్గు వివాదంపై ప్రధాని కార్యాలయం(పీఎంవో) ఎట్టకేలకు నోరు విప్పింది. ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి మసి అంటలేదని, గనుల కేటాయింపంతా సవ్యంగానే సాగిందని స్పష్టంచేసింది. ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన హిందాల్కో కంపెనీకి ఒడిశాలోని తలాబిరా గనిని కేటాయించడంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ నిజాయితీగా, నిష్పక్షికంగా వ్యవహరించారంది. ఈ మేరకు 2005లో జరిగిన ఈ కేటాయింపు పరిణామాలను వివరిస్తూ శనివారం ప్రకటన విడుదల చేసింది. తలాబిరా గనికి సంబంధించి అధికారులు తన ముందు ఉంచిన వివరాలన్నింటినీ పూర్తిగా పరిశీలించిన తర్వాతే బొగ్గు శాఖ మంత్రి హోదాలో ప్రధాని తుది నిర్ణయం తీసుకున్నారని  తెలిపింది. హిందాల్కోకు గని కట్టబెట్టేందుకు ప్రభుత్వ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌ను పక్కనపెట్టారన్న ఆరోపణలను తోసిపుచ్చింది.  కేటాయింపు పత్రాలు అందుబాటులో ఉన్నందున సీబీఐ స్వేచ్ఛగా దర్యాప్తు చేసుకోవచ్చని పేర్కొంది. తలాబిరా గని కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ ఆదిత్య బిర్లా  చైర్మన్‌పై కుమారమంగళం బిర్లా, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్‌పై సీబీఐ కేసు పెట్టడం తెలిసిందే. తనది తప్పయితే ప్రధానిదీ తప్పే అవుతుందని పరేఖ్ ఇటీవల వ్యాఖ్యానించారు.
 
 నిర్ణయం ఎందుకు మారిందంటే
 
 బొగ్గు గని కేటాయింపుపై నిర్ణయం మారడంపై పీఎంఓ వివరణ ఇచ్చింది. బొగ్గు శాఖ నుంచి పీఎంఓకు  వినతి అందిందని, దీంతో మొదట తీసుకున్న నిర్ణయం మారిందని వివరించింది. ప్రకటనలోని వివరాలు.. తలాబిరా-2, 3 గనులను హిందాల్కోకు కేటాయించాలని కోరుతూ  2005, మేలో కుమారమంగళం బిర్లా నుంచి పీఎంఓకు లేఖ అందింది. దీన్ని పరిశీలించి, నివేదిక పంపాలని బొగ్గు శాఖ అధికారులకు పీఎంఓ సూచించింది. ఆ గనులను కేటాయించాలంటూ బిర్లా నుంచి జూన్‌లో పీఎంవోకు మరో లేఖ వచ్చింది. దీన్నీ పీఎంవో బొగ్గు శాఖకు పంపింది.  తర్వాత తలాబిరా-2  కోసం మూడు సంస్థల నుంచి దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ నైవేలీకి గని కేటాయించాలని నిర్ణయించిందంటూ బొగ్గుశాఖ అధికారులు పీఎంవోకు ఫైలు పంపారు.
 
 అందులో హిందాల్కోకు గని కేటాయించొద్దంటూ బొగ్గు శాఖ మూడు కారణాలను పేర్కొంది. తలాబిరా-2ను హిందాల్కోకే కేటాయించాలని కోరుతూ 2005, ఆగస్టులో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రధానికి లేఖ రాశారు. విద్యుత్ ప్లాంట్ల కంటే అల్యూమినియం ప్రాజెక్టుల వల్లే ఎక్కువ సంపద సృష్టి జరుగుతుందని,  హిందాల్కోకు గని ఇవ్వాలని  పేర్కొన్నారు. ఈ లేఖ నేపథ్యంలో బొగ్గుశాఖ నిర్ణయాన్ని మార్చుకుంది. గనులను నెవైలీ కార్పొరేషన్‌కు కాకుండా హిందాల్కోకు కేటాయించాలనిసహేతుక కారణాలతో పీఎంవోకు చెప్పింది. దీంతో హిందాల్కోకు గనుల కేటాయింపుపై ప్రధాని తుది నిర్ణయం తీసుకున్నారని వివరించింది.
 
 దర్యాప్తును కాంగ్రెస్ నీరుగారుస్తోంది: బీజేపీ
 
 ఈ స్కాంపై  సీబీఐ దర్యాప్తును నీరుగార్చేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని, ప్రధానిపై ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని బీజేపీ నేత వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. గనుల కేటాయింపులో అధికారుల నిర్ణయానికి ప్రధాని ఎలా బాధ్యుడవుతారని కేంద్రమంత్రి మనీష్ తివారీ ప్రశ్నించారు. హిందాల్కోకు గని కేటాయించాలని నవీన్ ప్రధానికి లేఖ రాయడం తప్పు కాదని ఒడిశా ప్రభుత్వం పేర్కొంది.  నవీన్‌పై తప్పుడు ప్రచారానికే కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేస్తోందని విమర్శించింది.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement