జీఎస్టీ నుంచి 1శాతం అదనపు పన్ను తొలగింపు
బిల్లులో కీలక మార్పులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
- రాష్ట్రాలకు పరిహారంపైనా అంగీకారం
- కాంగ్రెస్ మూడు డిమాండ్లలో ఒకదానికి ఆమోదం
న్యూఢిల్లీ : తయారీ పన్ను 1 శాతాన్ని తొలగించటంతోపాటు పరోక్ష పన్నుల విధానంలో నష్టపోయే రాష్ట్రాలకు పరిహారం అందించేలా జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేబినెట్ వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తినపుడు జీఎస్టీ కౌన్సిల్ మధ్యవర్తిత్వం వహించే ప్రతిపాదనలను రాజ్యాంగ సవరణ బిల్లులో చేర్చింది. ఈ జీఎస్టీ కౌన్సిల్‌లో కేంద్రం, రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉంటుంది. గతేడాది మేలో లోక్‌సభ ఆమోదించిన సవరణలను కేబినెట్ ఆమోదించి ఈ బిల్లులో చేర్చింది.
మంగళవారం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ భేటీలో చర్చకు వచ్చిన అంశాలను, ఐదేళ్ల పాటు పరోక్షపన్నుల విధానంతో నష్టపోయే రాష్ట్రాలకు పరిహారం ఇవ్వటాన్ని(చట్టం అమల్లోకి వచ్చిన తొలి ఐదేళ్లవరకు) చర్చించిన కేబినెట్ వీటిని సవరణల బిల్లులో చేర్చేందుకు అంగీకరించింది. దీంతో రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కేంద్రం రాజ్యాంగపరమైన హామీ ఇచ్చినట్లయింది. 1 శాతం అంతర్రాష్ట్ర పన్నును తొలగింపు ద్వారా.. 3 కాంగ్రెస్ కీలక డిమాండ్లలో ఒకదాన్ని ప్రభుత్వం ఆమోదించినట్లయింది.
చట్టంలో జీఎస్టీ రేటు పరిమితి నిర్ధారణ, వివాదాల పరిష్కారానికి సుప్రీం కోర్టు జడ్జి నేతృత్వంలో ఓ వ్యవస్థ ఉండాలన్న మరో రెండు కాంగ్రెస్ డిమాండ్లకు అంగీకరించలేదు. ఈ ఐదేళ్ల తర్వాత జీఎస్టీ రేటు ఎంతుండాలనేది (ప్రస్తుతానికంటే తక్కువే) జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుందని కేంద్రం భరోసా ఇచ్చింది. ఈ మార్పులతో జీఎస్టీ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఆమోదం పొందుతుందని కేంద్రం భావిస్తోంది. ఒక్కసారి రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందితే సవరణల బిల్లు మళ్లీ లోక్‌సభ ఆమోదం పొందాల్సి ఉంటుంది. 2017, ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తేవాలని భావిస్తున్న కేంద్రం ఈ సమావేశాల్లో ఏకాభిప్రాయం కోసం శ్రమిస్తోంది. రాజ్యాంగ సవరణలను పార్లమెంటు ఆమోదించాక రాష్ట్రాలు (కనీసం 50శాతం రాష్ట్రాలు) ఈ చట్టానికి తమ అంగీకారాన్ని పంపాలి.