పునర్విభజన చట్టం అమలుకు నేడు చర్చ
- రాజ్యసభ చైర్మన్ చొరవతో ఫ్లోర్ లీడర్ల సమావేశంలో నిర్ణయం
- చర్చ తర్వాత సమాధానమివ్వనున్న ఆర్థిక మంత్రి జైట్లీ
- ప్రైవేట్ మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగానే తేల్చేసిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ పునర్విభజన చట్టం అమలు తీరుపై గురువారం రాజ్యసభలో కూలంకషంగా చర్చ జరగనుంది. గత రెండురోజులుగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై వివాదం ముదరడంతో సమస్య పరిష్కారం కోసం రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ బుధవారం రాజ్యసభలో వివిధ పక్షాల నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఏపీ విభజన చట్టం అమలుపై స్వల్ప వ్యవధి చర్చ జరగాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఏపీ విభజన చట్టం అమలు, ఏపీకి ఏ విధంగా సాయం అందిస్తున్నామనే విషయంపై చర్చకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశంలో ప్రతిపాదించింది. వాస్తవానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం రాజ్యసభలోనే ఈ మేరకు ప్రతిపాదించారు. అయితే కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగా తేల్చి చెప్పారు. ఈ బిల్లుపై చర్చకు అభ్యంతరం లేదని, అయితే ఓటింగ్‌కు రాజ్యాంగపరంగా అవరోధాలున్నాయని జైట్లీ పేర్కొన్న విషయం విదితమే. బుధవారం సమావేశంలో కేంద్రం ఈ విషయాన్నే పునరుద్ఘాటించింది.
విభజన చట్టం అమలుపై చర్చ జరిగిన తర్వాత ఆర్థిక మంత్రి జైట్లీ జవాబిస్తారని, అందువల్ల ప్రైవేట్ మెంబర్ బిల్లును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఈ సూచనపై కాంగ్రెస్ నాయకత్వం స్పష్టంగా స్పందించలేదని తెలుస్తోంది. జైట్లీ ఇచ్చే జవాబును బట్టి తాము ఒక నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు సమాచారం. అయితే ప్రైవేట్ మెంబర్ బిల్లుతో సంబంధం లేకుండా గురువారం రాజ్యసభలో మధ్యాహ్నం రెండు గంటలకు విభజన చట్టం అమలుపై చర్చ జరగనుంది. ఈ మేరకు స్వల్ప వ్యవధి చర్చ కోసం కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్‌సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి, టీడీపీ నేతలు గురువారం ఉదయం నోటీసులు ఇస్తారు. వాస్తవానికి మంగళవారం రాజ్యసభలో జరిగిన వాగ్వివాదాల్లో జోక్యం చేసుకొంటూ విభజన చట్టం అమలుపై చర్చ జరగాలని, దీనిపై కేంద్ర ఆలోచన తెలియాల్సి ఉందని కేంద్రమంత్రి సుజనా చౌదరి పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, విభజన చట్టం అమలుపై గురువారం చర్చ జరిగిన తర్వాత ఓటింగ్‌కు అవకాశం ఉండేలా నోటీసులు ఇవ్వాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం.