
'వాద్రాకు క్లీన్ చిట్ ఇవ్వలేదు'
స్కైలైట్ హాస్పిటాలిటీ కేసులో సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాకు క్లీన్ చిట్ ఇవ్వలేదని రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ కటారియా తెలిపారు.
జైపూర్: స్కైలైట్ హాస్పిటాలిటీ కేసులో సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాకు క్లీన్ చిట్ ఇవ్వలేదని రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ కటారియా తెలిపారు. వాద్రాకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు నివేదిక లేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని, ఈ సమయంలో తానేమీ చెప్పలేనని అన్నారు. దర్యాప్తు ముగిసిన తర్వాతే మాట్లాడతానని చెప్పారు. వాద్రాకు రాజస్థాన్ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారని వార్తలు వచ్చిన నేపథ్యంలో కటారియా స్పందించారు.
రాబర్ట్ వాద్రా తన స్కైలైట్ హాస్పిటాలిటీ కంపెనీ ద్వారా రూ. 44 కోట్లను అక్రమంగా ఆర్జించారంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయనపై దర్యాప్తు జరుగుతోంది. స్కైలైట్ హాస్పిటాలిటీ కంపెనీ 2005 నుంచి 2006 వరకు నిర్వహించిన ఆర్థిక వ్యవహారాలను, అమ్మకపు ఒప్పందాల వివరాలను అందించాలని ఆదాయపన్ను శాఖ గతేడాది ఆయన నోటీసులు జారీ చేసింది. ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల వివరాలు, కంపెనీ చేసుకున్న ఒప్పందాలు, రుణాల వివరాలివ్వాలని నోటీసుల్లో కోరింది.