జేఎన్‌యూలో సమానత్వం లేదు
⇒ ఫేస్‌బుక్‌లో ముత్తు కృష్ణన్ ఆఖరి పోస్ట్
⇒ అతని మరణంపై సీబీఐ దర్యాప్తు కోరిన కుటుంబ సభ్యులు
న్యూఢిల్లీ, సాక్షి, చెన్నై: జేఎన్‌యూలో సమానత్వానికి చోటులేదని సోమవారం ఆత్మహత్య చేసుకున్న దళిత పరిశోధక విద్యార్థి ముత్తుకృష్ణన్ మార్చి 1న తన చివరి ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఆవేదన చెందాడు. వర్సిటీ పరిపాలనా కార్యాలయం ముందు నిరసనలను నిషేధిస్తూ ఇటీవల జారీచేసిన ఉత్తర్వులను తప్పుపట్టాడు. సమానత్వాన్ని నిరాకరిస్తే ప్రతీదాన్ని నిరాకరించినట్లేనన్నాడు. పీహెచ్‌డీ, ఎంఫిల్ కోర్సుల ప్రవేశాల విధానాల్లో చేసిన సవరణలను విమర్శించాడు.
ముత్తు కృష్ణన్ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయడానికి ఎయిమ్స్ ఐదుగురు సభ్యులతో కూడిన బోర్డును నియమిస్తూ ఆ ప్రక్రియను వీడియో తీయాలని ఆదేశించింది. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడన్న పోలీసుల కథనాలను కుటుంబ సభ్యులు తిరస్కరించారు. తన కుమారుడి మృతికి దారితీసిన కారణాలు తెలుసుకునేందుకు సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆయన తండ్రి జీవానందం డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు అతని మృతదేహాన్ని తీసుకునేది లేదని ముత్తు కృష్ణన్ కుటుంబం స్పష్టం చేసింది. ముత్తు కృష్ణన్ మృతి పట్ల తమిళనాడు సీఎం పళనిస్వామి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి రూ. 3 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.
రగులుతున్న తమిళనాడు: కుల వివక్షకు మరో విద్యార్థి బలయ్యాడన్న ప్రచారం తమిళనాట ఆగ్రహ జ్వాలలు రగుల్చుతోంది. కుల వివక్షతో ఓ ప్రొఫెసర్ పెడుతున్న వేధింపులు తట్టుకోలేకే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడని తమిళాభిమాన సంఘాలు, పార్టీలు ఆరోపించాయి. ముత్తు కృష్ణన్ మృతిపై న్యాయ విచారణ జరపాలని సేలంలో రాత్రి నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాలు టీనగర్‌లోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించాయి.