న్యూఢిల్లీ: కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)పై వచ్చే అవినీతి ఆరోపణల విచారణకు అవసరమైన మార్గదర్శకాలు ఇంకా రూపొందలేదని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది. అందుకే సీవీసీ కేవీ చౌదరిపై గతేడాది అందిన రెండు ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయామని స్పష్టం చేసింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ నివేదిక ఆధారంగా జనవరి 10న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ.. సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజిలెన్స్ కమిషనర్ విషయంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
‘కేంద్ర చీఫ్ విజిలెన్స్ కమిషనర్, ఇతర కమిషర్ల విషయంలో కానీ అవినీతి, చెడు ప్రవర్తన ఆరోపణలు వస్తే దీనిపై చర్యలు తీసుకునేందుకు ప్రస్తుతం ఎలాంటి మార్గదర్శకాలు లేవు’అని సమాచార హక్కు చట్టం కింద ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సంజీవ్ చతుర్వేది అడిగిన ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సమాధానం ఇచ్చింది. ఎయిమ్స్‌లో జరిగిన అవినీతి కేసులను మూసివేయాల్సిందిగా కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరీ కేంద్ర విజిలెన్స్ కమిషన్‌కు అక్రమంగా సిఫారసు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా 2017లో రాష్ట్రపతికి సంజీవ్ లేఖలు రాశారు. ఎయిమ్స్‌లో సీనియర్ అధికారుల ప్రమేయం ఉన్న అవినీతి కేసును అధికారులు మూసేశారని సంజీవ్ ఆరోపించారు. ఈ మేరకు దాదాపు వెయ్యి పేజీల పత్రాలను రాష్ట్రపతి కార్యాలయానికి పంపారు.
Comments
Please login to add a commentAdd a comment