ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: మూత్రపిండాల వ్యాధితో ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో బుధవారం మరణించిన ఆడ పులి ‘కల్పన’ రక్త నమూనాలను కరోనా నిర్ధారిత పరీక్షల కోసం పంపినట్టు అధికారులు వెల్లడించారు. బరేలికి ఈ నమూనాలను పంపించినట్టు తెలిపారు. ‘14 ఏళ్ల కల్పన అనే ఆడపులి మూత్రపిండాలు పనిచేయకపోవడంతో బుధవారం మరణించింది. తర్వాతి రోజే కళేబరాన్ని ఖననం చేశాం. దాని శరీరం నుంచి సేకరించిన రక్త నమూనాలను కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షల కోసం బరేలీకి పంపించామ’ని జూ అధికారి ఒకరు చెప్పారు. కరోనా మార్గదర్శకాలను అనుసరించి కళేబరాన్ని ఖననం చేసేటప్పుడు ఎక్కువ మంది లేకుండా జాగ్రత్త పడినట్టు తెలిపారు.
బరేలీలో ఉన్న ఇండియన్ వెటనరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఐవీఆర్‌ఐ)లోని సెంటర్ ఫర్ యానిమల్ డిసీజ్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్(సీఏడీఆర్‌ఏడీ) నమూనాలను పరీక్షించనుంది. వీటితో పాటు భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యురిటీ యానిమల్ డీసీజ్(ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ), హిసార్‌లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వైన్స్(ఎన్‌ఆర్‌సీఈ)లు జంతువులకు సంబంధించిన పరీక్షలు చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
కాగా, న్యూయార్క్‌లోని బ్రాంక్జ్ జంతు ప్రదర్శన శాలలో నాదియా అనే నాలుగేళ్ల పులి కరోనా వైరస్ బారిన పడిన నేపథ్యంలో మన దేశంలోనూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. డిసెంబరులో చైనాలోని వూహాన్‌లో ముందుగా కనిపించిన కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషుల్లోకి ప్రవేశించినట్టు భావిస్తున్నారు. హాంకాంగ్‌లో ఇప్పటికే రెండు కుక్కలు కూడా కోవిడ్-19 బారిన పడినట్టు సమాచారం.
చదవండి: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి
Comments
Please login to add a commentAdd a comment