delhi zoo
-
కరోనా: ఢిల్లీలో పులి మృతి కలకలం
న్యూఢిల్లీ: మూత్రపిండాల వ్యాధితో ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో బుధవారం మరణించిన ఆడ పులి ‘కల్పన’ రక్త నమూనాలను కరోనా నిర్ధారిత పరీక్షల కోసం పంపినట్టు అధికారులు వెల్లడించారు. బరేలికి ఈ నమూనాలను పంపించినట్టు తెలిపారు. ‘14 ఏళ్ల కల్పన అనే ఆడపులి మూత్రపిండాలు పనిచేయకపోవడంతో బుధవారం మరణించింది. తర్వాతి రోజే కళేబరాన్ని ఖననం చేశాం. దాని శరీరం నుంచి సేకరించిన రక్త నమూనాలను కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షల కోసం బరేలీకి పంపించామ’ని జూ అధికారి ఒకరు చెప్పారు. కరోనా మార్గదర్శకాలను అనుసరించి కళేబరాన్ని ఖననం చేసేటప్పుడు ఎక్కువ మంది లేకుండా జాగ్రత్త పడినట్టు తెలిపారు. బరేలీలో ఉన్న ఇండియన్ వెటనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐవీఆర్ఐ)లోని సెంటర్ ఫర్ యానిమల్ డిసీజ్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్(సీఏడీఆర్‌ఏడీ) నమూనాలను పరీక్షించనుంది. వీటితో పాటు భోపాల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యురిటీ యానిమల్ డీసీజ్(ఎన్ఐహెచ్ఎస్ఏడీ), హిసార్‌లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వైన్స్(ఎన్ఆర్సీఈ)లు జంతువులకు సంబంధించిన పరీక్షలు చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కాగా, న్యూయార్క్‌లోని బ్రాంక్జ్ జంతు ప్రదర్శన శాలలో నాదియా అనే నాలుగేళ్ల పులి కరోనా వైరస్ బారిన పడిన నేపథ్యంలో మన దేశంలోనూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. డిసెంబరులో చైనాలోని వూహాన్లో ముందుగా కనిపించిన కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషుల్లోకి ప్రవేశించినట్టు భావిస్తున్నారు. హాంకాంగ్‌లో ఇప్పటికే రెండు కుక్కలు కూడా కోవిడ్-19 బారిన పడినట్టు సమాచారం. చదవండి: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి -
సింహానికే సవాలు విసిరాడు
-
సింహానికే సవాలు విసిరాడు
న్యూఢిల్లీ : ఢిల్లీ జూలోని సింహం ఎన్‌క్లోజర్‌లోకి ఓ వ్యక్తి వెళ్లిన సంఘటన కలకలం రేపింది. మెటల్ గ్రిల్స్ దాటి ఆ వ్యక్తి సింహం ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. అంతేకాకుండా సింహానికి దగ్గరగా వెళ్లి దాని ముఖంలో ముఖం పెట్టి చూశాడు. నువ్వు నన్ను ఏం చేయలేవంటూ సింహానికే సవాలు విసిరాడు. దీంతో అప్రమత్తమైన జూ సిబ్బంది అతన్ని బయటకు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జరిగినప్పుడు జూ లో ఉన్న సందర్శకులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఎన్‌క్లోజర్‌లోకి దూకిన వ్యక్తిని బిహార్‌కు చెందిన 28 ఏళ్ల రెహన్ ఖాన్‌గా గుర్తించామన్నారు. అతని మానసిక పరిస్థితి బాగోలేకపోవడం వల్లనే ఇలా చేశాడని తెలిపారు. అయితే జూ సిబ్బంది అతనికి ఎలాంటి గాయాలు కాకుండా బయటకు తీసుకోచ్చారని వెల్లడించారు. అయితే అత్యంత పటిష్టంగా ఉండాల్సిన మెటల్ గ్రిల్స్ దాటి ఓ వ్యక్తి లోనికి వెళ్లడంతో.. జూ అధికారులపై విమర్శలు వస్తున్నాయి. -
బయటపడ్డ భద్రతా లోపం
న్యూఢిల్లీ: ఢిల్లీ జంతుప్రదర్శనశాలలో మంగళవారం జరిగిన దుర్ఘటన సందర్శకులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. పొరబాటున తెల్లపులి ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి పడ్డ యువకుడిని పులి బలితీసుకోవడంతో జూలో భద్రత చర్చనీ యాంశమైంది. నిజానికి ఎన్‌క్లోజర్‌లోకి యువకుడు పడిన తర్వాత దాదాపు రెండుమూడు నిమిషాలపాటు పులి అతని జోలికి వెళ్లలేదు. అయితే బయటివారి కేకలు, అరుపులు విన్నా కూడా ఘటనాస్థలానికి సెక్యూరిటీ గార్డులు చేరుకోవడంలో తీవ్రమైన జాప్యం జరిగిందని, చేరుకున్నవారి వద్ద కూడా ట్రాంక్విలైజర్ గన్స్, వాకీటాకీల వంటి పరికరాలేమీ లేవని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరి అలాంటప్పుడు భద్రతా సిబ్బంది ఉండి ఎందుకు? అని సందర్శకులు ప్రశ్నిస్తున్నారు. కూరమృగాలు ఉంటున్న ఎన్‌క్లోజర్ ఎత్తు కూడా చాలా తక్కువగా ఉందని, దీంతోనే యువకుడు అందులోకి పడిపోయాడని చెబుతున్నారు. మరి క్రూరమృగాలు ఉంటున్న ఎన్క్లోజర్ల వద్ద భద్రతను అధికారులు గాలికొదిలేశారా? అని నిలదీస్తున్నారు. నిజానికి ఫోటో తీయడానికి ప్రయత్నిస్తూ యువకుడు ఎన్‌క్లోజర్‌లోకి పడిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అంటే జూకు వచ్చే ప్రతి సందర్శకుడు తనవద్ద ఉన్న కెమెరా, సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీయడానికి ప్రయత్నిస్తాడు. ఈ సమయంలో కూడా సందర్శకులకు ఎటువంటి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం జూ అధికారులపై ఉంది. అయినప్పటికీ ఎన్క్లోజర్ల ఎత్తు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సందర్శకులు ఆరోపిస్తున్నారు. ఎన్‌క్లోజర్ ఎత్తు ఎక్కువగా ఉంటే ప్రమాదం జరిగేది కాదంటున్నారు. బాలుడు అరుపులు విని తాను పులి ఉన్న ఎన్‌క్లోజర్ వైపు పరుగెత్తుకుంటూ వెళ్లానని, కానీ అప్పటికే అతను పులి నోట చిక్కి మెకలికలు తిరిగి పోతున్నాడని హిమాన్షు అనే ప్రత్యక్షసాక్షి చెప్పారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు తాము మొసళ్లను చూస్తుండగా హఠాత్తుగా అరుపులు వినిపించాయని, తాము వెళ్లి చూసేసరికి కొందరు పిల్లలు పులి ఎన్‌క్లోజర్‌లోకి కట్టెపుల్లలు, రాళ్లు విసరడం కనిపించిందని, దగ్గరకు వెళ్లి చూస్తే ఓ యువకుణ్ని పులి నోటకరిచి పట్టుకొని ఉండడం కనిపించిందని హిమాన్షు చెప్పారు. ఆ వ్యక్తి బాధతో మెలికలు తిరుగుతూ దాదాపు పావు గంటసేపు బాధపడడ్డాడని, అయినా అతణ్ని రక్షించే సాహసం ఎవరూ చేయలేదన్నాడు. పులి ఉన్న ఎన్‌క్లోజర్ రెయిలింగ్ ఎక్కువ ఎత్తులో ఉందని, అతడు పొరపాటున లోపలికి పడిఉంటాడని హిమాన్షు చెప్పాడు. ఎన్‌క్లోజర్‌లో పడిన వెంటనే పులి అతని మీదకు దాడి చేయలేదని, పులి సమీపంలో నిలబడినప్పుడు ఆ యువకుడు ముడుచుకుని కూర్చుని రెండు చేతులతో దండం పెట్టడం చూశామని, అయితే పులి దృష్టిని మళ్లించడం కోసం ఎన్‌క్లోజర్ బయటనున్న కొందరు కట్టెపుల్లలు, రాళ్లు ఎన్‌క్లోజర్‌లోకి విసిరారని , రెండు నిమిషాలపాటు చూస్తూ నిలబడిన పులి ఈ చేష్టలతో రెచ్చిపోయి పంజా విసిరి యువకునిపై దాడిచేసిందని, యువకుణ్ని నోట కరచుకుని కాసేపు నిలబడిందని, ఆ తరువాత తలపట్టుకుని ఈడ్చుకుంటూ లోపలికి తీసుకెళ్లిందని ఈ ఘటనను సెల్ఫోన్లో చిత్రీకరించిన బిట్టూ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పాడు.సెక్యూరిటీ గార్డులు ఆలస్యంగా వచ్చారన్నాడు. అకతాయి చేష్టలే కారణం... జూకు వచ్చేవారి ఆకతాయితనం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని జూ అధికారులు చెబుతున్నారు. మంగళవారం జరిగిన ఘటన కూడా యువకుడి ఆకతాయితనం వల్లే జరిగిందని చెబుతున్నారు. పులికి బలైన యువకుడిని మక్సూద్గా గుర్తించామని చెబుతున్నారు. ఎన్‌క్లోజర్ ఎక్కి ఫొటో తీయాలనే అత్యుత్సాహమే అతని ప్రాణాలు తీసిందంటున్నారు. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఎన్‌క్లోజర్‌లోకి పడిన తర్వాత కూడా పులి అతణ్ని ముట్టలేదని, అయితే బయటివారు పులిని తరిమేందుకు కర్రలు, రాళ్లతో కొట్టే ప్రయత్నం చేయడంతో రెచ్చిపోయిన పులి అతనిపై దాడి చేందని, ఈ సమయంలో సందర్శకులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి, అధికారులకు సమాచారం అందించి ఉంటే యువకుడి ప్రాణాలను కాపాడే అవకాశముండేదని చెబుతున్నారు. సింహం కరుణించింది... ఆరేళ్లక్రితం కూడా ఢిల్లీ జూలో ఇటువంటి ఘటనే జరిగింది. తాగిన మత్తులో ఉన్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు సింహం ఉన్న ఎన్‌క్లోజర్‌లోకి పడిపోయాడు. అయితే అతను పడిన విషయాన్ని గమనించిన సింహం అతని వద్దకు వచ్చి.. ఏమీ చేయకుండానే వెళ్లిపోయింది. ఇప్పుడు కూడా పులి వదిలి పెడుతుందని భావించినా బయటివారు దానిని రెచ్చగొట్టడంతో యువకుడు బలికాక తప్పలేదని జూ అధికారులు చెప్పారు. -
'విజయ్' ఆహారం 10 కేజీల మాంసం!
న్యూఢిల్లీ: ఢిల్లీ జంతు ప్రదర్శన శాలలో ఓ విద్యార్ధిని పొట్టన పెట్టుకున్న తెల్ల పులి ప్రతి రోజు సుమారు 12 కేజీల మాంసం తింటుందని జూ అధికారులు వెల్లడించారు. తెల్లపులి పేరు విజయ్ అని, ప్రతి మూడు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని మీడియాకు తెలిపారు. 2007లో లక్ష్మణ్, యమున అనే పులి దంపతులకు జన్మించిన విజయ్ బరువు 200 కిలో గ్రాములు ఉందని ఓ ప్రశ్నకు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం తన ఎన్ క్లోజర్ లోకి దూకిన ఓ 20 ఏళ్ల వ్యక్తి విజయ్ చేతిలో ప్రాణాలు వదిలాడు. ఈ ఎన్ క్లోజర్ లో మరో రెండు పులులు కూడా ఉన్నాయని తెలిపారు. -
ఆరేళ్ల క్రితం కూడా ఢిల్లీ జూలో అలాంటి ఘటన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ జూ దుర్ఘటన లాంటిదే గత ఆరు సంవత్సరాల క్రితం కూడా చోటు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. మంగళవారం పులుల ఎన్ క్లోజర్ లో పడిన ఓవ్యక్తి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఆరు సంవత్సరాల క్రితం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒక రకమైన మైకంలో ఉన్న ఓ వ్యక్తి సింహాల ముందు పడిపోయాడు. అయితే అతడ్ని సింహాలు ఎలాంటి హాని చేయకుండా వదలివేశాయి అని జాతీయ జూలాజికల్ పార్క్ అధికారులు తెలిపారు. ఎన్ క్లోజర్ లో పడిన వ్యక్తిని సింహాలు గమనించాయి. అయితే చంపవద్దని వేడుకోవడంతో సింహాలు వదిలివేశాయని అధికారుల తెలిపారు. -
సంతానం ఇస్తుందనుకుంటే... చంపేసింది!!
సంతాన భాగ్యం కల్పిస్తుందని ఎక్కడినుంచో తీసుకొచ్చిన ఓ మగపులి.. ఢిల్లీ జూలోని ఓ ఆడపులిని చంపేసింది. మైసూరు జూ నుంచి ఢిల్లీ జూలో ఉన్న ఆడ పులుల కోసం తీసుకొచ్చిన మగపులి ఈ దారుణానికి పాల్పడింది. జిన్జిన్ అనే పదేళ్ల వయసున్న రాయల్ బెంగాల్ పులిని ఇది చంపేసింది. ఈ రెండింటినీ కలిపి అధికారులు ఒక ఎన్‌క్లోజర్‌లోకి పంపారు. తీరా అక్కడికెళ్లిన తర్వాత ఈ మగపులి సరసానికి బదులు పోరాటానికి దిగింది. జూ సిబ్బంది ఈ విషయాన్ని గమనించి, ఈ రెండింటి మధ్య పోరాటాన్ని ఆపేందుకు ప్రయత్నించారు గానీ ఫలితం లేకపోయింది. ఎలాగోలా జిన్జిన్ను దొరకపట్టుకుని చంపేసింది. దీంతో ఇక ఢిల్లీ జూలో ఐదు పులులు మాత్రమే మిగిలాయని జిమ్ క్యూరేటర్ రియాజ్ ఖాన్ తెలిపారు. అడవుల్లో ఇలాంటి సంఘటనలు మామూలేనని, పులుల మధ్య పోరాటాలు జరుగుతాయని, కానీ జూలలో మాత్రం ఇలా జరగడం ఇదే మొదలని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ జూలో రెండు ఆడ, మూడు మగ రాయల్ బెంగాల్ పులులున్నాయి. ఇవి కాక మరో ఆరు తెల్ల పులులు ఉన్నాయి. ఇటీవలే జూల మధ్య జంతువుల బదిలీ కార్యక్రమంలో భాగంగా ఓ ఆడ తెల్ల పులిని, మరికొన్ని జంతువులను తిరువనంతపురం జూకు పంపారు.