
న్యూఢిల్లీ:
టెక్నాలజీ మనుషుల ఎన్నో అవసరాలను తీరుస్తోంది. స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులోకి వచ్చాక సామాన్యుడికి సంబంధించిన ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించింది. అదే స్మార్ట్‌ఫోన్ మరో కీలకమైన సమస్యను పరిష్కరించనుంది. అదేం టంటే... టాయిలెట్ల అడ్రస్ చెప్పడం. నిజమే... మహానగరంలో ‘అత్యవసర’ పరిస్థితి ఏర్పడితే ఎక్కడికెళ్లాలో తెలియక నానా అవస్థలు పడేవారు ఎందరో. దీంతో ఈ సమస్యకు పరిష్కారం చూపేలా.. హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ మహానగర పాలక సంస్థ కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలను మొదలుపెట్టింది.
పబ్లిక్ టాయిలెట్లను జియోట్యాగింగ్ చేయడం ద్వారా నగరవాసులు తమకు సమీపంలోనే ఉన్న మరుగుదొడ్లను సులభంగా గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్, న్యాయమూర్తి హరి శంకర్‌లతో కూడిన ధర్మాసనం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన స్వచ్ఛభారత్ కల సాకారం కావడానికి కూడా ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఎం తో అవసరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.