
సీఎం ఆఫీసులో సీసీటీవీలు మాయం
తిరువనంతపురం: అవినీతికి పాల్పడిన ఏస్థాయి వ్యక్తినైనా, సంస్థనైనా విడిచిపెట్టబోమని కేరళ సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ నేత, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న పినరాయ్ విజయన్ హెచ్చరించిన నేపథ్యంలో అక్కడి సీఎంవో ఆఫీసులోని సీసీటీవీ కెమెరాలన్నింటిని తొలగించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పూర్తిగా తొలగించారు.
2011లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల వద్ద తానేమీ దాచబోనని ప్రకటిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉమెన్ చాందీ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసి వాటిని ప్రత్యేక వెబ్సైట్కు లైవ్ టెలికాస్ట్ గా అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అధికారం మారిన నేపథ్యంలో సీఎం కార్యాలయాన్ని చాందీ ఖాళీ చేశారు. ఈ క్రమంలోనే అందులోని సీసీటీవీ కెమెరాలు కూడా తొలగించినట్లు తెలుస్తోంది. 'మొత్తం సీఎం కార్యాలయాన్ని ఖాళీ అయింది. మేం సోమవారం వెళ్లి చూడగా అక్కడి సీసీటీవీ కెమెరాలు కూడా కనిపించలేదు' అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక అధికారి చెప్పారు.