సాక్షి, ముంబయి : ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు అవసరమైన భూ సేకరణపై అధికారులు తలపట్టుకుంటున్నారు. బుల్లెట్ ట్రైన్‌కు ఎంతకాలమైనా వేచిచూస్తామని, ముందుగా వైద్యులు, మందులు వంటి మౌలిక వసతులను కల్పించాలని అభిప్రాయసేకరణకు గ్రామాలకు వెళ్లిన అధికారులకు స్ధానికుల నుంచి పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బుల్లెట్ ట్రైన్‌కు నోడల్ సంస్థగా వ్యవహరిస్తున్న నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్) ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను చేపడుతోంది. వైద్య సేవలతో పాటు చెరువులు, సోలార్ విద్యుత్ దీపాలు, అంబులెన్స్‌ల వంటి పలు డిమాండ్లను పాల్ఘార్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు అధికారులు ముందుంచుతున్నారు. ఆయా గ్రామ కూడళ్లలో గ్రామసభలు నిర్వహించి ప్రాజెక్టుపై అవగాహన కల్పిస్తున్న అధికారులకు స్ధానికులు తమ డిమాండ్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్ రూటు మార్చింది.
గ్రామసభలకు బదులు నేరుగా భూయజమానులను కలిసి పరిహారంతో పాటు వారి డిమాండ్లను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. 2022 నాటికి బుల్లెట్ ట్రైన్‌ను పట్టాలెక్కించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. 508 కిమీ ట్రైన్ కారిడార్‌లో అత్యధిక భాగం 110 కిమీ మేర పాల్ఘార్ జిల్లా మీదుగానే సాగుతుంది. జిల్లాలోని 73 గ్రామాలకు చెందిన 300 హెక్టార్ల భూమి ఈ ప్రాజెక్టుకు అవసరం.
అయితే ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు భూసేకరణను జిల్లాలోని గిరిజనులు, పండ్ల పెంపకందారులు తీవ్రంగా వ్యతిరేకిస్తునా్నరు. మరోవైపు గ్రామస్థుల నిర్ధిష్ట డిమాండ్లను నెరవేర్చడం ద్వారా భూసేకరణ సాఫీగా సాగేలా ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్ వ్యవహరిస్తోంది. గ్రామస్థులు వ్యక్తిగత సమస్యలు కాకుండా సామాజిక సమస్యలనే తెరపైకి తెస్తుండటంతో వాటి పరిష్కారానికి అధికారులు చొరవ చూపుతున్నారు. భూసేకరణను వ్యతిరేకిస్తున్న సపోటా, మామిడి పెంపకందార్లను కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్ అధికారులు ఊరడిస్తున్నారు. మెరుగైన ప్యాకేజ్‌తో పాటు బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కితే స్ధానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment