సీపీఎంవాళ్ల గొంతులు కోయండి!
తృణమూల్ ఎంపీ తపస్ పాల్
మరో వివాదాస్పద వ్యాఖ్య
‘రేప్’ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన రోజే మరో వీడియో బహిర్గతం
అరెస్టుకు సీపీఎం, బీజేపీ డిమాండ్
కోల్‌కతా: తమ పార్టీ కార్యకర్తల జోలికొస్తే సీపీఎం కార్యకర్తలను హత్య చేయిస్తానని...వారి మహిళలపై అత్యాచారాలు చే యిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, నటుడు తపస్ పాల్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయన ‘రేప్’ వ్యాఖ్యలపై ఓవైపు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగడం, దీనిపై ఆయన మంగళవారం బేషరతు క్షమాపణ చెప్పిన కొంతసేపటికే ఆయన చేసిన మరో వివాదాస్పద వ్యాఖ్యల వీడియో బహిర్గతమైంది. ప్రతిపక్ష సీపీఎం కార్యకర్తల గొంతులు కోయాలంటూ నాదియా జిల్లాలోని ఓ గ్రామంలో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోను బెంగాలీ చానళ్లు మంగళవారం ప్రసారం చేశాయి. ‘‘ప్రజలను చంపేవారు మనుషులే కాదు. నేను మీతో ఉన్నంత వరకూ ఏ సీపీఎం కార్యకర్తను వదిలిపెట్టొద్దు. ఇదే విషయాన్ని మహిళలకూ చెబుతున్నా. ఇంట్లో కూరలు కోసే కత్తులతో వారి గొంతులు కోయండి’’ అంటూ ఆ వీడియోలో ఆయన వ్యాఖ్యానించారు. రేప్ వ్యాఖ్యలు చేసిన రోజే తపస్ ఈ వ్యాఖ్యలు కూడా చేసినట్లు చానళ్లు పేర్కొన్నాయి. అంతకుముందు తపస్ పాల్ తన ‘రేప్’ వ్యాఖ్యలపై బేషరతు క్షమాపణ చెప్పారు. తపస్ వ్యాఖ్యలపై కలత చెందిన పార్టీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ ఆయన్ను బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందిగా ఆదేశించడంతో పాల్ ఈ మేరకు పార్టీకి, మీడియాకు లేఖ రాశారు. ఎన్నికల ప్రచార వేడిలో చేసిన వ్యాఖ్యల ద్వారా బెంగాల్‌వాసులను, నియోజకవర్గ ప్రజలను, కుటుంబాన్ని తీవ్ర అసంతృప్తికి గురిచేశానన్నారు. ఇందుకుగానూ సమాజంలోని ప్రతిఒక్కరికీ ప్రత్యేకించి మహిళలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. కాగా, ఈ వివాదంపై భర్త తరఫున క్షమాపణ చెబుతున్నట్లు తపస్ భార్య అంతకుముందు పేర్కొన్నారు.
కఠిన చర్యలు తీసుకోవాలి.. సీపీఎం: తమ పార్టీ కార్యకర్తలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తపస్ పాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరింది. ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ తెలిపారు. మరోవైపు తపస్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేయడంతోపాటు దీనిపై సీఎం మమత వివరణ ఇవ్వాలంటూ తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ బెంగాల్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం వాకౌట్ చేశారు. తపస్‌ను అరెస్టు చేయాలంటూ బీజేపీ మహిళా మోర్చా నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం కోల్‌కతాలో తపస్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.
ఇంట్లోకి చొరబడితే నరికేయండి.. పేట్రేగిన మరో తృణమూల్ నేత
తపస్ వ్యవహారం సద్దుమణగక ముందే మరో తృణమూల్ నేత సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంట్లోకి అపరిచితులు చొరబడితే నరికి చంపి బలి ఇవ్వాలంటూ బంకూరా జిల్లా తృణమూల్ చీఫ్ అరూప్ చక్రవర్తి పార్టీ కార్యకర్తలకు మంగళవారం సూచించారు. ‘‘మీ ఇంట్లోకి ఒకవేళ బయటి వ్యక్తులు చొరబడితే నరికి పారేయండి. బలివ్వండి. దీనిపై మీరు ఆందోళన చెందనక్కర్లేదు. ఆ సంగతి నేను చూసుకుంటా’’ అంటూ బంకూరాలో పేర్కొన్నారు.
ఇంకేం చేయమంటారు.. చంపనా?: మమత
తపస్ పాల్ అనుచిత వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పెద్ద తప్పిదంగా అభివర్ణించారు. ఇందుకుగానూ ఆయన్ను పార్టీ మందలించిందని మంగళవారం కోల్‌కతాలో విలేకరుల సమావేశంలో చెప్పారు. పాల్ పంపిన క్షమాపణ లేఖ సరిపోదని...ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. అయితే ఆయనపై పార్టీ చర్యలు తీసుకుంటుందా? అని విలేకరులు ప్రశ్నించిగా మమత మండిపడ్డారు. ‘‘నన్ను ఇంకేం చేయమంటారు..ఆయన్ను చంపమంటారా?’’ అని ఆవేశంగా వ్యాఖ్యానించారు.