
సాక్షి, బెంగళూరు : పర్యావరణ సంరక్షణలో భాగస్వాములవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెబుతారు కర్ణాటకలోని ఉడిపి జిల్లా కలెక్టర్ హెబ్సిబా రాణి. పరిసరాల సంరక్షణపై శ్రద్ధ చూపించే ఆమె.. కాలుష్య నివారణకై తన వంతుగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా వాయు కాలుష్యాన్ని తగ్గించడానికై ప్రభుత్వ ఉద్యోగులు అందరూ.. ఇకపై ప్రతి గురువారం బస్సుల్లో కార్యాలయాలకు రావాలని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు తాను కూడా అందరు ఉద్యోగుల్లాగే బస్సులో కలెక్టరేట్‌కు వస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
కిటకిటలాడుతున్న బస్టాండ్లు!
నగరాల్లో వాయు కాలుష్యం, వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్న సంగతి తెలిసిందే. కాబట్టి పరిసరాల పరిరక్షణపై అత్యంత శ్రద్ధను చూపే కలెక్టర్ హెబ్సిబా రాణి తన వంతుగా ఈ ప్రయత్నానికి అడుగులు వేశారు. ఉద్యోగులతో పాటు జిల్లా ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఉడిపి జిల్లా కేంద్రంలోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కచ్చితంగా గురువారం సొంత వాహనాలను వీడి బస్సుల్లోనే వారి వారి కార్యాలయాలకు చేరుకోవాలని ఆదేశించారు. దీంతో మొదటి గురువారం బస్టాండ్లు ప్రభుత్వ ఉద్యోగులతో కిటకిటలాడాయి. మొదట తమ డిసి కార్యాలయం నుంచే మొదలు పెట్టి ప్రస్తుతం ఉడిపి నగరంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు ఆందరూ ప్రస్తుతం మొదటి గురువారం విధులకు బస్సుల్లో బయలుదేరారు. దీంతో నగరంలోని ప్రముఖ సర్కిళ్లు, బస్టాండ్లు వద్ద ఉద్యోగులు బస్సుల కోసం ఎదురు చూస్తుండటం కనిపించింది.
ఈ విషయం గురించి ఉడిపి కలెక్టర్ హెబ్సిబా మాట్లాడుతూ... ‘ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగి వాయు కాలుష్యం, ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఇటువంటి సమస్యకు కొంతవరకైనా పరిష్కారం తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ప్రతి గురువారం ప్రభుత్వ ఉద్యోగులు బస్సుల్లో విధులకు రావాలని ఆదేశాలు జారీ చేశాను’ అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం కలెక్టర్ హెబ్సిబా రాణి ప్రతి గురువారం వార్త శాఖకు చెందిన బస్సులో ఉద్యోగులతో కలిసి విధులకు వస్తున్నారు. పర్యావరణ హితం కోసం పాటుపడుతున్న కలెక్టర్ చర్యలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment