
ఎన్‌ఐటీలో స్థానికేతరుల ర్యాలీ
అడ్డుకున్న భద్రతా బలగాలు
శ్రీనగర్: తమ డిమాండ్లను పరిష్కరించాలని శ్రీనగర్ ఎన్‌ఐటీలోని స్థానికేతర విద్యార్థులు వరుసగా నాలుగో రోజూ ఆందోళనలను కొనసాగించారు. శుక్రవారం విద్యార్థులు చేపట్టిన ఆందోళన క్యాంపస్‌ను కుదిపేసింది. వారు క్యాంపస్‌లో ప్రధాన ద్వారం వద్దకు ర్యాలీగా బయలుదేరగా భద్రతా బలగాలు అడ్డుకున్నాయి.
క్యాంపస్ బయటున్న మీడియాతో మాట్లాడనివ్వాలని విద్యార్థులు కోరినట్లు అధికారులు చెప్పారు. జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఎన్‌ఐటీ అధికారులపై, లాఠీచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, క్యాంపస్‌ను కశ్మీర్ నుంచి తరలించాలని నినాదాలు చేశారన్నారు. స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య ఘర్షణలతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొనడం తెలిసిందే. స్థానికేతరుల డిమాండ్లను స్థానిక విద్యార్థులు వ్యతిరేకించారు. క్యాంపస్‌లో బలగాలను శాశ్వతంగా ఉంచితే చదువుకు ఇబ్బంది అవుతుందన్నారు. తాము జాతి వ్యతిరేకులమంటూ వస్తున్న ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు.