
లక్నో: పెళ్లి కోసం మంత్రగాడి దగ్గరికి వెళ్తే.. ప్రాణాల మీదకే వచ్చింది. అయితే వైద్యులు సకాలంలో స్పందించటంతో ప్రాణాలు దక్కాయి. వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజయ్ ద్వివేది(42)కి వివాహం కాలేదు. పైగా కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ తరుణంలో బంధువుల సలహామేరకు ఓ మాంత్రికుడిని ఆశ్రయించాడు. తాను చెప్పినట్లు వింటే సమస్యలన్నీ దూరమైపోతాయని మాంత్రికుడు అజయ్‌ను నమ్మబలికాడు.
సెల్ ఫోన్ బ్యాటరీ, పదునైన ఇనుప ముక్కలు, గాజు ముక్కల తినాలంటూ అజయ్‌కు మాంత్రికుడు సూచించాడు. అజయ్ కూడా గుడ్డిగా ఆ వస్తువులన్ని తినేశాడు. ఆపై కడుపు నొప్పితో బాధపడుతున్న అతన్ని బంధువులు ఆస్పత్రిలో చేర్పించారు. స్కానింగ్‌లో కడుపులో ఇనుప ముక్కలు కనిపించటంతో వైద్యులు నిర్ఘాంత పోయారు. వెంటనే అతనికి ఆపరేషన్ చేసి ఆ చెత్తనంతా తొలగించారు. అజయ్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని.. దయచేసి ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్మొద్దంటూ వైద్యులు సూచిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సదరు మాంత్రికుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితుడి పొట్ట నుంచి బయటపడ్డ వస్తువులు.. అజయ్(ఇన్‌సెట్‌లో)