పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా వీ నారాయణస్వామి పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది.
పుదుచ్చేరి: పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా వీ నారాయణస్వామి పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. దీంతో సీఎం పగ్గాలు ఎవరు చేపడతారన్న ఉత్కంఠకు పార్టీ అధిష్టానం తెర దించింది. శనివారమిక్కడ షీలా దీక్షిత్, ముకుల్ వాస్నిక్ ల పర్యవేక్షనలో జరిగిన సమావేశంలో పార్టీ నారాయణ స్వామిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. నారాయణస్వామి 2009 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న యూనైటెడ్ ప్రోగ్రసీవ్ అలయన్స్(యూపీఏ) ప్రభుత్వంలో ప్రధాన మంత్రి కార్యాలయంలో మినిస్టర్ ఆఫ్ స్టేట్ గానూ, 2004 నుంచి 2009 వరకు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పార్లమెంటరీ అఫైర్స్ గా విధులను నిర్వర్తించారు.
మే 16న జరిగిన ఎన్నికల్లో పోటీ చేయని నారాయణ స్వామి చట్టసభకు ఎన్నిక కావడానికి ఉప ఎన్నికలో పోటీ చేయనున్నారు. కాగా సీఎం సీటు కోసం ప్రయత్నించిన వారిలో పుదుచ్చేరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నమఃశివాయం, మాజీ ముఖ్యమంత్రి వీ వైతిలింగం ఉన్నారు. మాజీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎమ్ కందస్వామి కూడా ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేందుకు పోటీ పడినా చివరకు అధిష్టానం నారాయణస్వామి వైపే మొగ్గు చూపింది.