జమ్మూలోని పుణ్యక్షేత్రమైన వైష్ణో దేవి ఆలయ గర్భగుడి వద్ద ఓ మహిళ గుండెపోటుతో మృతిచెందిన ఘటన ఆదివారం వెలుగుచూసింది.
కశ్మీర్: జమ్మూలోని పుణ్యక్షేత్రమైన వైష్ణో దేవి ఆలయ గర్భగుడి వద్ద ఓ మహిళ గుండెపోటుతో మృతిచెందిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన 45 ఏళ్ల మహిళా యాత్రికురాలు త్రికుటా భవన్‌కు వెళుతూ లంబికేరి ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దాంతో అదే దారిలో వెళ్లే కొందరు యాత్రికులు ఆ మహిళను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అయితే అప్పటికే ఆ మహిళ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మహిళ మృతికి కారణం గుండెపోటు లక్షణాలు కనపడుతున్నాయని వైద్యులు తెలిపారు. అనంతరం యాత్రికురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి వివరాలు తెలియరాలేదు.