
కురుక్షేత్ర : విదేశీయుల పాలన కారణంగానే భారతదేశంలో ప్రస్తుతం మహిళలకు గౌరవం దక్కడం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. దేశంలో 50% జనాభా ఉన్న మహిళల్ని కచ్చితంగా గౌరవించాలన్నారు. హరియాణాలోని కురుక్షేత్ర విశ్వవిద్యాలయం గురువారం నిర్వహించిన 30వ స్నాతకోత్సవానికి ఆయన హాజరై ప్రసంగించారు. ఎన్ని సంప్రదాయాలు ఉన్నా విదేశీయుల పాలన ప్రభావంతోనే దేశంలో మహిళలకు గౌరవం దక్కడం లేదని వెంకయ్య స్పష్టం చేశారు. దేశాన్ని భారత మాతగా, చదువును సరస్వతిగా పూజించే దేశంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం సిగ్గుచేటన్నారు. విద్యార్థులు తమ హక్కుల సాధన కోసం హింసను ఆశ్రయించకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. దేశంలోని వేరే ప్రాంతాలకు సంబంధించి కనీసం ఓ భాషను నేర్చుకోవాలని వెంకయ్య విద్యార్థులకు సూచించారు.