
విధులకు ఆలస్యంగా వస్తే చర్యలు
విధులకు ఆలస్యంగా వచ్చే సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అధికారులను ఆదేశించారు. స్
నిర్మాణ్ భవన్‌లో వెంకయ్య ఆకస్మిక తనిఖీ
న్యూఢిల్లీ: విధులకు ఆలస్యంగా వచ్చే సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అధికారులను ఆదేశించారు. స్థానిక నిర్మాణ్‌భవన్‌లోని కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ కార్యాలయంలో వెంకయ్య సోమవారం ఉదయం గంట పాటు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో చాలా చోట్ల సీట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. హాజరు రిజిస్టర్లను మంత్రి పరిశీలించగా.. సిబ్బంది సంతకాలు కనిపించలేదు.
సిబ్బంది నిర్వాకాన్ని తీవ్రంగా పరిగణించిన వెంకయ్య 80 మందికి సంజాయిషీ నోటీసులు ఇవ్వాలని సీనియర్ అధికారులను ఆదేశించారు. విధులకు ఆలస్యంగా వచ్చే సిబ్బందికి గైర్హాజరు పెట్టాలని, వేతనాల్లో కోతలు విధించాలని మంత్రి ఆదేశించారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని త్వరగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ్‌భవన్‌లో పారిశుద్ధ్యంపై వెంకయ్య సంతృప్తి వ్యక్తం చేశారు. గత నెలలో తనిఖీలతో పోలిస్తే ఇప్పుడు పారిశుద్ధ్యం మెరుగు పడిందన్నారు.