వాట్సాప్‌తో జాగ్రత్త | Vulnerability detected in WhatsApp | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌తో జాగ్రత్త

Published Thu, Nov 21 2019 3:50 AM | Last Updated on Thu, Nov 21 2019 3:50 AM

Vulnerability detected in WhatsApp - Sakshi

న్యూఢిల్లీ: వాట్సాప్‌లో అపరిచితులు పంపే వీడియో ఫైళ్లను తెరుస్తున్నారా? అయితే కొంచెం జాగ్రత్త అంటోంది కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యురిటీ సంస్థ ‘ద కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌’ (సీఈఆర్‌టీ). ఎంపీ4 ఫైళ్ల సాయంతో సాఫ్ట్‌వేర్‌లోని లోపాల ఆధారంగా హ్యాకర్లు మీ ఫోన్లలోకి చొరబడవచ్చునని ఈ సంస్థ మూడు రోజుల క్రితం ఓ హెచ్చరిక జారీ చేసింది. మీ అనుమతులను కోరకుండానే సమాచారాన్ని సేకరించడంతోపాటు మీ ఫోన్‌ను పనిచేయకుండా చేయొచ్చని తెలిపింది.

అయితే సాఫ్ట్‌వేర్‌ లోపంతో కలిగే ప్రభావం వినియోగదారులపై పడలేదని వాట్సాప్‌ చెబుతోంది. వందలాది మంది భారతీయ వినియోగదారులపై ఇజ్రాయెల్‌కు చెందిన  ‘పెగాసస్‌’ నిఘా సాఫ్ట్‌వేర్‌ సాయంతో గుర్తుతెలియని సంస్థలు నిఘా పెట్టాయని వాట్సాప్‌ ఇటీవల భారతసర్కారుకు తెలిపిన నేపథ్యంలో ఈ ఘటనకు ప్రాధాన్యం ఏర్పడింది. హ్యాకింగ్, ఫిషింగ్‌ తదితర సైబర్‌ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం సీఈఆర్‌టీని నోడల్‌ సంస్థగా ఏర్పాటు చేయడం తెల్సిందే. సమస్యను అధిగమించేందుకు వాట్సాప్‌ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకోవడం మేలని సీఈఆర్‌టీ సూచించింది.   

విచారం వ్యక్తంచేసిన వాట్సాప్‌
పెగాసస్‌ నిఘా అంశంపై విచారం వ్యక్తంచేస్తూ భారత సర్కార్‌కు వాట్సాప్‌ లేఖ రాసింది. నిఘా వ్యవహారంపై అప్రమత్తంగా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటామని హామీనిస్తున్న లేఖలో పేర్కొంది. వాట్సాప్‌ సాఫ్ట్‌వేర్‌లో భద్రతా వ్యవస్థలను మరింత పటిష్టంచేయాలని, మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే సహించేదిలేదని ప్రభుత్వం వాట్సాప్‌ను మందలించిందని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు.

పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలో చర్చ
నిఘా అంశాన్ని చర్చించాలా వద్దా అన్న దానిపైనా పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలొచ్చాయి. రెండు గంటలపాటు చర్చించినా దీనిపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని విశ్వసనీయవర్గాల సమాచారం. చర్చ అవసరంలేదని బీజేపీ సభ్యులు అభిప్రాయపడగా, లోక్‌జనశక్తి, వైఎస్సార్‌సీపీలు చర్చవైపునకు మొగ్గుచూపాయి. దీంతో ఓటింగ్‌కు వెళ్లారు. చర్చకు సరేనంటూ, కాదంటూ సరిసమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో  కమిటీకి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌.. చర్చించేందుకే ఓటేయడంతో సభ్యులు ఈ అంశాన్ని చర్చకు స్వీకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement