ఏపీ ప్రత్యేక హోదాపై బిల్లు పెట్టలేం: వెంకయ్య
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై మీ వాదనలను సమర్థిస్తున్నాననీ, కానీ ఇప్పుడు హోదాపై బిల్లు పెట్టలేమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం గురువారం రాజ్యసభలో ప్రైవేటు బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీ ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో డిమాండ్లు ఉన్నాయని అన్నారు. ఎందరో సీఎంలు ఎన్నో అడుగుతున్నారన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తున్నట్టు వెంకయ్య పేర్కొన్నారు. సీపీఎం తప్ప అన్ని పార్టీలు రాష్ట్ర విభజన కోరుకున్నాయనీ అన్నారు.
రెండేళ్లైన ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఏపీ నుంచి తాను ఎన్నిక కాకున్నా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నానని వెంకయ్య తెలిపారు. వెనకబడ్డ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నామని తెలిపారు. కేంద్రంలో ఆర్థిక పరిస్థితిని బట్టి నిధుల కేటాయింపు జరుగుతుందన్నారు. చట్టంలో ఇచ్చిన హామీలన్నంటీనీ నేరవేరుస్తామని చెప్పారు. ప్రత్యేక హోదాతో కొంత సహాయపడుతుంది అంతేనని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అన్ని సమస్యలకు పరిష్కారం కాదన్నారు.