‘మాకు సగం సీట్లు రిజర్వు చేయండి’
Published Wed, Mar 8 2017 6:38 PM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM
పట్నా(బిహార్): చట్టసభల్లో తమకు యాబై శాతం సీట్లు కేటాయించాలంటూ బిహార్ మహిళా శాసనసభ్యులు పట్టుబట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం శాసనసభ సమావేశమైంది. పాల్గొన్న మహిళా ఎమ్మెల్యేలు పార్టీలకతీతంగా సభలో లేచి నిలబడి ఈ మేరకు నినాదాలు చేశారు. దేశ జనాభాలో సగం మంది మహిళలు ఉన్నారని, అందుకే పార్లమెంట్, రాష్ట్ర చట్టసభల్లో సగం సీట్లు రిజర్వు చేయాలని డిమాండ్ చేశారు.
బిహార్ సీఎం నితీశ్‌కుమార్ రాష్ట్ర స్థానిక సంస్థలు, పంచాయతీల్లోని సగం సీట్లను మహిళలకే రిజర్వు చేస్తూ ఇటీవల చట్టం కూడా చేశారు. ఈ విషయాన్ని పలువురు మహిళా సభ్యులు ప్రస్తావిస్తూ రాష్ట్ర, కేంద్ర చట్ట సభల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ విషయమై స్పీకర్ విజయ్‌కుమార్ చౌధురి మాట్లాడుతూ.. మహిళా ఎమ్మెల్యేల డిమాండ్‌కు మద్దతు పలికారు. దీనిపై ముందుగా పార్లమెంట్‌లో చట్టం చేయాల్సి ఉందని తెలిపారు. తమ నియోజకవర్గాల్లో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కూడా కొందరు ఎమ్మెల్యేలు సూచించారు.
Advertisement