
క్యూల్లోనే వారాంతం!
- మూడోరోజూ బారులు తీరిన ప్రజలు... పలుచోట్ల బ్యాంకు అధికారులతో వాగ్వాదం
- మరో 8-10 రోజులు ఇదే పరిస్థితంటున్న బ్యాంకర్లు
- గుజరాత్, కర్ణాటకల్లో లైన్లోనే కుప్పకూలిన ఇద్దరు వృద్ధులు
న్యూఢిల్లీ: పాతనోట్లను మార్చుకునేందుకు వరుసగా మూడోరోజూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల ముందు ప్రజలు బారులు తీరారు. వారాంతం కావటం, బ్యాంకులు అదనపు గంటలు పనిచేస్తుండటంతో శనివారం రద్దీ కాస్త ఎక్కువగా కనిపించింది. దీంతో గంటల తరబడి ప్రజలు డిపాజిట్లు, విత్‌డ్రాల కోసం వేచిచూశారు. కేరళ, గుజరాత్‌లలో క్యూలైన్లో వేచి ఉన్నవారికి బ్యాంకు ఉద్యోగులకు మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. చాలా బ్యాంకుల వద్ద పోలీసులతో బందోబస్తు పెట్టుకోవాల్సి వచ్చింది. ఢిల్లీలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద బందోబస్తు కోసం 3,400 మంది పారామిలటరీ బలగాలు, 200 క్విక్ రెస్పాన్‌స టీమ్స్‌ను రంగంలోకి దించారు.
అటు మధ్యప్రదేశ్‌లో చిల్లరలేక నిత్యావసర వస్తువులు అందకపోవటంతో ఆగ్రహించిన ప్రజలు ఓ రేషన్ షాపును కొల్లగొట్టినట్లు తెలిసింది. ముంబైలో పలు బ్యాంకులు ముఖ్యమైన కూడళ్లలో మొబైల్ ఏటీఎంలు అందుబాటులో ఉంచారు. కాగా, బ్యాంకులకు వస్తున్న రద్దీని, నోట్లు మార్చుకునేందుకు ప్రజల్లో ఉన్న ఆతృతను చూస్తుంటే.. మరో 8-10 రోజుల పాటు ఇదే పరిస్థితి తప్పదని బ్యాంకర్లు అంటున్నారు. బ్యాంకుల వద్ద సరైన డబ్బుల్లేవని ప్రజలు అపోహపడుతున్నారన్నారు.కాగా, పింఛనుదారులు రూ. 10వేలకన్నా ఎక్కువ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చని ఆర్బీఐ (భువనేశ్వర్) స్పష్టం చేసింది.
ఏటీఎంలు ఖాళీ
వారాంతం వేడి ఏటీఎం వద్ద కూడా కనిపించింది. చాలా ఏటీఎంలను అర్దరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు డబ్బులతో నింపారు. అరుుతే తెల్లారిన కాసేపటికే ఇవన్నీ ఖాళీ అరుుపోయారుు. అసలే డబ్బుల్లేక ఇబ్బందులు పడుతుంటే సాంకేతిక కారణాలతో ఏటీఎంలు పనిచేయకపోవటం జనాగ్రహానికి కారణమైంది. దేశవ్యాప్తంగా 2 లక్షల ఏటీఎంలుండగా.. అందులో సగానికి పైగా పనిచేయటం లేదని తెలిసింది. కాగా, గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండటం వల్లచాలా చోట్ల కొందరు లైన్లలోనే కుప్పకూలిపోయారు. శుక్రవారం మహారాష్ట్రలో ముగ్గురు, కేరళలో ఇద్దరు చనిపోగా.. శనివారం గుజరాత్‌లో బర్కాత్ షేక్ అనే వృద్ధుడు లైన్లోనే గుండెపోటుతో కుప్పకూలాడు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఓ 93 ఏళ్ల వృద్ధుడు కూడా క్యూలోనే గుండెపోటుతో మృతిచెందాడు. ఆదివారం కూడా బ్యాంకులు తెరిచి ఉండటంతో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
తిరగబడ్డ జనం
బ్యాంకుల్లో పాతనోట్లు మార్చుకునేందుకు వస్తున్న వారి సంఖ్య పెరిగిపోవటంతో.. కేరళలోని కొల్లాం జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ బ్రాంచ్ ఉద్యోగులు షెటర్లు మూసేసేందుకు ప్రయత్నిం చారు. దీంతో బ్యాంకు ఆవరణలో ఉన్న 200 మంది కోపంతో బ్యాంకు అద్దాలను పగులగొట్టారు. దీంతో బ్యాంకు ఉద్యోగులకు, ప్రజలకు వాగ్వాదం ముదిరింది. పోలీసులు జోక్యం చేసుకోవటంతో పరిస్థితి సద్దుమణిగింది. గుజరాత్‌లోనూ పలుచోట్ల బ్యాంకు అధికారులు, ప్రజలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బాణస్కంఠ, కచ్ జిల్లాల్లో అధికారులు నోట్ల మార్పిడికి తిరస్కరించటంతో ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌లో చిల్లర నోట్లు లేక ఎదురవుతున్న సమస్యలతో ప్రజల్లో ఆగ్రహజ్వాలలు పెరిగిపోయారుు. బర్దాహా అనే గ్రామంలో స్థానికులు పౌరసరఫరాల దుకాణాన్ని కొల్లగొట్టి తమకు కావాల్సిన వస్తువులు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది.