న్యూఢిల్లీ : పాకిస్తాన్ భూభాగంలో పొరపాటున పడి ఆ దేశ సైన్యం చేతుల్లో చిక్కుకున్న భారత వాయుసేన(ఐఏఎఫ్) పైలట్, వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేస్తామని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ సహా అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడికి తలొగ్గిన దాయాది దేశం.. శాంతిస్థాపనలో తొలి అడుగుగా భారత పైలట్ వర్ధమాన్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేస్తున్నామని స్పష్టం చేసింది. ఇది భారత్–పాకిస్తాన్‌ల మధ్య శాంతి చర్చలకు మొదటిమెట్టుగా భావిస్తున్నట్లు ప్రకటించింది.
ఇక సోషల్ మీడియా వేదికగా భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ ధైర్యసాహసాలను భారతం ముక్తకంఠంతో అభినందిస్తోంది. పాకిస్తాన్ విమానాలను తిప్పికొడుతూ.. ఆ ప్రయత్నంలో ప్రత్యర్థి భూభాగంలో కూలిన మిగ్–21 బైసన్ విమాన పైలట్‌గా ఆ దేశ సైనికుల చేతికి చిక్కిన హీరోపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. పాక్ సైన్యం ఎన్ని చిత్రహింసలు పెట్టినా బాధను పంటిబిగువన దిగమింగుతూ ప్రశాంత చిత్తంతో కనిపించిన వీరుడు.. విక్రమ్ అభినందన్ చూపించిన తెగువ, సాహసానికి యావద్భారతం సెల్యూట్ చేస్తోంది. తమ హీరోను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన పాక్ నిర్ణయంపై యావత్ భారతావని హర్షం వ్యక్తం చేస్తోంది. కొందరైతే పాక్ ప్రధాని ఇమ్రాన్‌ను అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అయితే ఇమ్రాన్‌ను కొనియాడటం అంటే పుల్వామా దాడిలో మరణించిన 40 మంది భారత హీరోలను మరిచినట్లేనని ఓ నెటిజన్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. తప్పని పరిస్థితిల్లో పాక్ ఈ నిర్ణయం తీసుకుంది తప్పా.. శాంతి కోసం కాదని స్పష్టం చేశాడు. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకుందని, ఇమ్రాన్ శాంతి అంటూ మొసలి కన్నీరు కార్చుతున్నారని మరో యూజర్ పేర్కొన్నాడు. అసలు ఇమ్రాన్‌ను నమ్మవద్దని ఘాటుగా కామెంట్ చేశాడు. అభినందన్ విడుదల ప్రకటనతో #WelcomeHomeAbhinandan యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment