
న్యూఢిల్లీ : నకిలీ ప్రకటనలకు తను కూడా మోసపోయినట్లు భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు శుక్రవారం రాజ్యసభలో తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ నకిలీ ప్రకటనలపై లేవనెత్తిన చర్చలో భాగంగా వెంకయ్యనాయుడు తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.
సులువుగా బరువు తగ్గడానికి వచ్చిన ఓ ప్రకటనను చూసి మోసపోయానన్నారు. వెయ్యి రూపాయల మందులతో బరువు తగ్గొచ్చన్న ప్రకటనకు డబ్బులు చెల్లించి ఆర్డర్ బుక్ చేశానన్నారు. ట్యాబ్లెట్లు అందిన తర్వాత మెయిల్ వచ్చిందని, అందులో మరో వెయ్యి రూపాయలు చెల్లిస్తే మీకు అవసరమైన ఒరిజనల్ ట్యాబ్లెట్లు పంపిస్తామని ఉందని ఆయన పేర్కొన్నారు. దీంతో మోసపోయానని గ్రహించి వినియోగదారుల సంబంధిత మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశానన్నారు. అయితే విచారణలో ఈ ప్రకటనలు అమెరికా కేంద్రంగా వచ్చాయని తేలిందన్నారు. ఇలాంటి ప్రకటనలు రాకుండా అడ్డుకట్ట వేయడానికి ఎదో ఒకటి చేయాలని ఆయన సంబంధిత మంత్రిత్వ శాఖను కోరారు.