
న్యూఢిల్లీ: బీజేపీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. సాధారణంగా ముక్కుసూటిగా మాట్లాడతారని గడ్కరీకి పేరుంది. సోమవారం ఇక్కడ జరిగిన నిఘా విభాగం ఉన్నతాధికారుల భేటీలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు, ఎంపీల వైఫల్యానికి పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని గడ్కరీ వ్యాఖ్యానించారు. ‘నేను పార్టీ అధ్యక్షుడిగా ఉండగా.. ఎంపీలు, ఎమ్మెల్యేలు సరిగా పనిచేయకపోతే ఆ బాధ్యత ఎవరిది? నాదే కదా!’ అన్నారు.
అంతకుముందు.. మరో సందర్భంలో ‘విజయానికి చాలా మంది తండ్రులుంటారు. పరాజయం మాత్రం అనాథ. గెలుపు లభించినప్పుడు అది తమ ఘనతేనని ప్రకటించుకునేందుకు చాలామంది ముందుకు వస్తారు. అదే ఓటమి ఎదురైతే ఎదుటి వారే కారణమన్నట్లు ఒకరినొకరు వేలెత్తి చూపుతారు’ అని పేర్కొన్నారు. ఇటీవల మూడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం అనంతరం గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యాఖ్యలు ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాపై ఆయన ప్రత్యక్ష దాడేనని పలువురు భావిస్తున్నారు. అయితే తన మాటలను వక్రీకరించారని తర్వాత గడ్కరీ వివరణ ఇచ్చారు.