ఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు ముమ్మరం చేస్తోంది. ఆగస్టు 19న అమర్‌నాథ్ యాత్ర ముగిసిన వెంటనే ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం. అలాగే జమ్ముతో పాటు దేశంలో అసెంబ్లీ పదవీ కాలం ముగియనున్న మరో మూడు రాష్ట్రాలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉంది.
గురువారం బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా జమ్ములో పర్యటించారు. జమ్ము బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలు.. జితేంద్ర సింగ్, జుగల్ కిషోర్ శర్మ, ఇతర నేతలతో రెండు గంటలపాటు సమావేశం అయ్యారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా ఢిల్లీ పెద్దలు అక్కడి నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అంతేకాదు.. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు వాళ్లు. దీంతో జమ్ములోని మొత్తం 90 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని స్పష్టత వచ్చింది.
ఎన్నికలకు హడావిడి మొదలవుతుండడంతో.. రాబోయే రోజుల్లో బీజేపీ అగ్రనేతలంతా జమ్ముకు క్యూ కట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి సీఎం అభ్యర్థి ఎవరనేది బీజేపీ ప్రకటించలేదు. కానీ, రవీందర్ రైనా నేతృత్వంలోని రాష్ట్ర బీజేపీ నాయకత్వం కొనసాగుతుందని సంకేతాలు మాత్రం ఇచ్చింది.
జమ్ము కశ్మీర్ శాసనసభ నవంబర్ 2018లో రద్దు అయ్యింది. ఆగస్టు 2019లో రాష్ట్ర ప్రత్యేక హోదాను రద్దు చేసింది కేంద్రం. ఆపై రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా (జమ్మూ కశ్మీర్, లఢక్) విడిపోయింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించి జమ్ముకు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని కేంద్రం చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment