ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ కేసులో అఫిడవిట్ మార్చాల్సిన అవసరం ఏంటని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సూటిగా ప్రశ్నించారు.
న్యూఢిల్లీ : ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ కేసులో అఫిడవిట్ మార్చాల్సిన అవసరం ఏంటని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సూటిగా ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా దిగజారుతుందని ఆయన బుధవారమిక్కడ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగా ఇష్రత్ జహాన్ కేసులో తనను పక్కన పెట్టి, చిదంబరమే రెండో అఫిడవిట్‌ను తిరిగిరాశారని అప్పటి హోంశాఖ కార్యదర్శి జి.కె.పిళ్లై పేర్కొన్నారు. అంతేకాకుండా ఐబీ అధికారులపై ఒత్తిడి తేవాలని తనను ఇబ్బంది పెట్టారంటూ నాటి హోంశాఖ కార్యాలయ అధికారి ఆర్వీఎస్ మణి చిదంబరంపై ఆరోపణలు చేశారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి ఇరకాటంలో పడినట్లు అయింది.
మరోవైపు హెచ్‌సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనకు సంబంధించి సభకు తప్పుడుసమాచారం అందించారంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై విపక్షాలు హక్కుల ఉల్లంఘన తీర్మానమిచ్చి, చర్చకు పట్టుబట్టగా... దీనికి ప్రతిగా కాంగ్రెస్ చీఫ్ విప్ జ్యోతిరాదిత్య సింధియా గత నెల 24న సభకు అవాస్తవాలు వెల్లడించారంటూ బీజేపీ హక్కుల నోటీసు ఇచ్చిన విషయం విదితమే.