సాధ్వీకి బెయిల్‌ ఎవరిచ్చారు ? | Why blame judiciary for granting Pragya Thakur bail when investigative agencies show no spine? | Sakshi
Sakshi News home page

సాధ్వీకి బెయిల్‌ ఎవరిచ్చారు ?

Published Fri, Apr 28 2017 3:52 PM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM

సాధ్వీకి బెయిల్‌ ఎవరిచ్చారు ?

సాధ్వీకి బెయిల్‌ ఎవరిచ్చారు ?

న్యూఢిల్లీ: ‘రిప్‌ ఇండియన్‌ జస్టిస్‌’ అనే నినాదం ఇటీవల సోషల్‌ మీడియాలో విస్తృతంగా చక్కెర్లు కొడుతోంది. 2008లో జరిగిన మాలేగావ్‌ పేలుళ్ల కేసుల్లో ప్రధాన నిందితురాలైన సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌కు ముంబై హైకోర్టు బెయిల్‌ ఇవ్వడాన్ని తప్పుపడుతూ ఈ నినాదం ఊపందుకుంది. ‘రిప్‌ ఇండియన్‌ జస్టిస్‌’ అంటే ఇక్కడ న్యాయవ్యవస్థను చించి వేయండి లేదా రద్దు చేయండి అని అర్థం. ఇలాంటి నినాదాన్ని ప్రచారంలోకి తీసుకరావడానికి ముందు నిజంగా న్యాయవ్యవస్థ తప్పుచేసిందా లేదా కేసును దర్యాప్తు చేసిన సంస్థ తప్పు చేసిందా ? అన్న అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అసలు కేసు ఏమిటీ?
మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008లో సంభవించిన పేలుళ్లలో ఆరుగురు ముస్లింలు మరణించారు. ముస్లిం టెర్రరిస్టు దాడులకు ప్రతీకారంగా హిందూ మత ఛాందసవాదులు పాల్పడిన తొలి పేలుళ్లగా కూడా నాడు ఈ కేసు ప్రచారమైంది. అప్పటి నుంచే ‘కాషాయం టెర్రర్‌’ అనే పదం కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ పేలుళ్లకు సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ సమక్షంలో కుట్ర జరిగిందని భావించిన మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ పోలీసులు అదే సంవత్సరంలో ఆమెను అరెస్టు చేశారు. ఆమె సాధారణ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే కోర్టు తిరస్కరించింది.

బెయిల్‌ పిటిషన్ల కొట్టివేత
ఆ తర్వాత ఈ కేసును మహారాష్ట్ర వ్యవస్థ్రీకత నేరాల నిరోధక చట్టం కిందకు మార్చారు. ఈ చట్టం పరిధిలో నిందితులకు బెయిల్‌ దొరకడం కష్టం. అయినా సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ బెయిల్‌ కోసం నిరంతరంగా ప్రయత్నిస్తూనే వచ్చారు. 2012, 2014 సంవత్సరాల్లో ట్రయల్‌ కోర్టు రెండు సార్లు, హైకోర్టు రెండుసార్లు ఆమె బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసింది. 2015, నవంబర్‌లో  ఆమె బెయిల్‌ పిటీషన్లను కోర్టులు చివరిసారి కొట్టివేశాయి.

సాధ్వీ సమక్షంలో కుట్ర జరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయని, అందుకు ఆ కుట్రలో పాల్గొన్న నిందితుల్లో ఇద్దరు ఇచ్చిన వాంగ్మూలాలు అందుకు సరిపోతాయని, అలాగే బాంబులు అమర్చిన మోటార్‌ సైకిల్‌ సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌కు చెందినది కావడం కూడా ఆమెపై ప్రాథమిక విచారణ జరిపేందుకు ప్రాతిపదిక అవుతుందని కోర్టులు అభిప్రాయపడ్డాయి. అందుకే బెయిల్‌ పిటిషన్లను నిరాకరిస్తున్నట్లు ప్రకటించాయి.

హఠాత్తుగా మారిపోయిన సాక్ష్యాధారాలు
గతేడాది మే నెలలో సాధ్వీపై ఈ ప్రాథమిక ఆధారాలన్నీ మారిపోయాయి. సాధ్వీకి వ్యతిరేకంగా సాక్షమిచ్చిన ఇద్దరు నిందితులు ప్లేటు ఫిరాయించారు. వీరు కాకుండా ఆమెకు వ్యతిరేకంగా సాక్షమిచ్చిన ముగ్గురు సాక్షుల్లో ఒకరు ముందే తన వాంగ్మూలాన్ని మార్చుకోగా, మరొకరు చనిపోయారు. మూడో వ్యక్తి అదశ్యమయ్యారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ నుంచి ఈ కేసును 2011లో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) టేకప్‌ చేసింది.

(అప్పటి యూపీఏ ప్రభుత్వం హయాంలో ఈ ఏజెన్సీ ఆవిర్భవించింది) 2014 నాటికల్లా కేసు విచారణను ముగించి చార్జిషీటును దాఖలు చేయడానికి సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో లోక్‌సభ ఎన్నికలు రావడం, పార్టీ అఖండ విజయంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈలోగా ఏం జరిగిందో ఏమో, చార్జిషీటు దాఖలు చేయాల్సిన ఎన్‌ఐఏ సంస్థ మనసు మార్చుకొని 2015 సంవత్సరం, చివరలో సాక్షులను పునర్విచారించాలని నిర్ణయించింది. విచారించింది. పునర్‌ విచారణలో సాక్షులు ప్లేటు ఫిరాయించారు.

అనుబంధ చార్జిషీటు ఎందుకొచ్చింది?
ఆ తర్వాత గతేడాది మే నెలలో ఎన్‌ఐఏ సాధ్వీ కేసులో అనుబంధ చార్జిషీటును దాఖలు చేసింది. సాధ్వీకి, ఆరెస్సెస్‌కు చెందిన ఐదుగురు నిందితులకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని తేల్చి చెప్పింది. ఆ మరుసటి నెలలోనే సాధ్వీతోపాటు ఇతర నిందితులకు బెయిల్‌ మంజూరు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టుకు దర్యాప్తు స్పష్టం చేసింది. నేరం చేసినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నట్లు జడ్జీలు భావించినా సరే దర్యాప్తు సంస్థలకు అభ్యంతరం లేకపోతే సాధరణంగా కోర్టులు బెయిల్‌ మంజూరు చేస్తాయి. ముంబై మాజీ పోలీసు కమిషనర్‌ రామ్‌దేవ్‌ త్యాగి కేసు విషయంలో 2001లో కోర్టు ఇలాగే వ్యవహరించింది. 1992–93 ముంబై అల్లర్లకు సంబంధించిన సులేమాన్‌ ఉస్మాన్‌ బేకరీ కేసులో రామ్‌దేవ్‌ త్యాగి ప్రధాన నిందితుడు. ఆయన నేరం చేశారనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని జడ్జీలు బలంగా విశ్వసించినప్పటికీ దర్యాప్తు సంస్థకు అభ్యంతరం లేకపోవడం వల్లన బెయిల్‌ మంజూరైంది. ఇప్పుడు సాధ్వీ కేసులో కూడా ముంబై హైకోర్టు అదే ప్రాతిపదికన బెయిల్‌ మంజూరు చేసింది.

ఎవరు బాధ్యులు...?
సాధ్వీ కేసులో మందగమనంతో వ్యవహిరించాల్సిందిగా తనపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని ఎన్‌ఐఏ స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రోహిణి సాలియన్‌ 2015లో బహిరంగంగా ప్రకటించడం, సాధ్వీకి బెయిల్‌ రావడం పట్ల విశ్వహిందూ పరిషద్‌ నాయకుడు ప్రవీణ్‌ తొగాడియా మాట్లాడుతూ ఇలాంటి కేసుల్లో జైల్లో ఉన్న హిందువులందరిని విడుదల చేసి, వారిపై కేసు కొట్టివేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కూడా ఇక్కడ గమనార్హమే.

ఎవరిని నిందించాలి?
సాధ్వీ కేసులో మొదటి నుంచి బెయిల్‌ను వ్యతిరేకిస్తున్న ఎన్‌ఐఏ సంస్థ ఎందుకు తన మనసు మార్చుకొని నిందితలుకు బెయిల్‌ ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది? నిందితులపై తుది చార్జిషీటును దాఖలు చేయాల్సిన ఎన్‌ఐఏ కేసు విచారణ చేపట్టిన ఐదేళ్లకు సాక్షులను పునర్విచారించాలని ఎందుకు నిర్ణయానికి వచ్చింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేవంటూ ఎందుకు అనుబంధ ఛార్జీషీటు దాఖలు చేసింది? ఈ ప్రశ్నలకు అర్థాలు వెతుక్కుంటే ఎవరిని దూషించాలో అర్థం అవుతుంది.

సిబీఐ నుంచి మొదలుకొని యాంటీ టెరరిస్ట్‌ స్క్వాడ్, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ వరకు ఏ దర్యాప్తు సంస్థ పనితీరును పరిశీలించినా కేంద్రం పాలకపక్షం కనుసన్నల్లో దర్యాప్తు అధికారులు మెసలుకుంటున్నారన్నది కూడా అర్థం అవుతుంది. కనుక ‘రిప్‌ ఇండియన్‌ జస్టిస్‌’ అనే బదులు ‘రిప్‌ ఇండియన్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీస్‌’ అనే ప్రచారం బాగుంటుందేమో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement