
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని వివిధ ప్రాంతాల్లో లాక్‌డౌన్ కారణంగా ఇరుక్కుపోయిన వలస కార్మికులను తమ స్వగ్రామాలకు తరలించేందుకు ప్రత్యేక శ్రామిక రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ వేలాది మంది వలస కార్మికులు తమ ప్రాణాలకు తెగించి గమ్యస్థానాలకు వందల కిలోమీటర్లు ఇప్పటికీ నడుస్తూనే ఉన్నారు. అలా ఎంత మంది వెనక్కి బయల్దేరారు? ఎందుకు? దేశ చారిత్రక గమనంలో అసలు వలసలు ఎందుకు చోటు చేసుకున్నాయి?
భారత దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధి అంతా వలసలపైనే ఆధారపడి ఉందని నిపుణలు చెప్పారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక దేశంలో అంతర్గత పారిశ్రామిక వలసలు ప్రారంభమయ్యాయి. 1960లో గ్రీన్ రెవెల్యూషన్, 1991లో స్వేచ్ఛా వాణిజ్యం కోసం తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, అందులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆర్థిక జోన్లతో వలసలు ఎక్కువగా పెరిగాయి. ఎక్కువ సంపాదన కోసం వలసలు జరగలేదు. ఉన్న ప్రాంతంలో ఉపాధి అస్సలు లేకపోవడం వల్లనే నూటికి 90 శాతం వలసలు జరిగాయి. దేశంలో ఎక్కువగా తూర్పు ప్రాంతాల నుంచి పశ్చిమ ప్రాంతాలకు వలసలు కొనసాగాయి. పారిశ్రామికాభివృద్ధికి ముందు వ్యవసాయాధార వలసలు కొనసాగాయి. ఉత్తరప్రదేశ్, బిహార్ ఉత్తర ప్రాంతాల నుంచి పచ్చిమ ప్రాంతాలకు తొలుత వ్యవసాయాధార కార్మిక వలసలే కొనసాగాయి. ఆ తర్వాత పారిశ్రామీకరణతో ఆ వలసలు మొదలయ్యాయి.
ఒడిశా నుంచి ప్లంబర్లు ఢిల్లీకి వలస పోవడం, తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా నుంచి ముంబైకి భవన నిర్మాణ కార్మికులు పట్టణీకరణ, పారిశ్రామీకరణలో భాగంగా వలసలు వెళ్లారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి వెశ్లిన వారిని పాలమూరు కార్మికులని వ్యవహరిస్తారు. 1980లో మహారాష్ట్రలో చెక్కర పరిశ్రమ బాగా విస్తరించి బ్రెజిల్ లాంటి విదేశాలను చక్కెరను ఎగుమతి చేయడం ప్రారంభించినప్పుడు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కార్మికుల వలసలు పెరిగాయి ఆ తర్వాత 2001లో పూర్తయిన ‘ముంబై–పుణే ఎక్స్‌ప్రెస్ కారిడార్’ ప్రాంతాలకు వలసలు పెరిగాయి. (లాక్‌డౌన్‌తో సాధించిన ఫలితాలేమిటి?)
దేశంలో అభివృద్ధి చెందని ప్రాంతాల నుంచి అభివృద్ధి చెందిన ప్రాంతాలకే వలసలు జరిగాయని, దేశంలో అన్ని ప్రాంతాల్లో కాకుండా కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం, కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందక పోవడమే వలసలకు ప్రధాన కారణమని అధ్యయన నిపుణలు తేల్చారు. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోని అన్నిరకాల పరిశ్రమలు ‘చీప్ లేబర్’ కోసమే వలసలను ప్రోత్సహించాయి. ఒక్క కార్మిక రంగాన్నే తీసుకుంటే దేశంలో ఐదారు కోట్ల మంది వలసకార్మికులు ఉన్నారు. వారిలో తట్టాబుట్ట సర్దుకొని కాలి నడకన ఊళ్లకు బయల్దేరిన కార్మికులంతా దినసరి వేతనం మీద బతికే కూలీలేనని నిపుణులు చెబుతున్నారు. రైలు చార్జీలు భరించే స్థోమత లేకనే వారు కాళ్లను నమ్ముకున్నారు. అలాంటి దాదాపు పది లక్షల మంది కార్మికులు తినడానికి తిండి, ఉండడానికి గూడు కరువై సొంతూళ్లకు బయల్దేరారు. వారిలో ఎక్కువ మంది దళిత వర్గాల వారే ఉన్నట్లు పలు సర్వేలు తెలియజేస్తున్నాయి. (కార్మికులు లేక ‘పరిశ్రమల లాక్‌డౌన్’)
Comments
Please login to add a commentAdd a comment