
లక్నో : తన భర్తను చంపిన వారికీ అదే గతిపడితేనే తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందని యూపీలోని బులంద్‌షహర్‌లో సోమవారం జరిగిన అల్లర్లలో మరణించిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ భార్య అన్నారు. విధి నిర్వహణలో తన భర్త నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండేవారని మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.
విధి నిర్వహణలో తన భర్తపై దాడులు జరగడం ఇదే తొలిసారి కాదన్నారు. గతంలో ఆయనకు రెండు సార్లు బుల్లెట్ గాయాలయ్యాయన్నారు. ఇప్పుడు ఆయనకు ఎవరూ న్యాయం చేయలేరని, తన భర్తను చంపిన వారిని హతమార్చితేనే న్యాయం జరుగుతుందని సింగ్ భార్య అన్నారు. దాద్రిలో మహ్మద్ అఖ్లాక్ మూక హత్య కేసును విచారిస్తున్న పోలీస్ అధికారుల్లో ఒకరైన సింగ్ మరణం పట్ల ఆయన సోదరి సైతం విచారం వ్యక్తం చేశారు.
గోవధ కేసును విచారిస్తున్నక్రమంలో తన సోదరుడిని హత్యచేయడం కుట్రపూరితమేనని ఆమె పేర్కొన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన తన సోదరుడికి అమరవీరుడి హోదా ఇవ్వాలని, తమ స్వస్ధలంలో స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బులంద్‌షహర్‌లోని అక్రమ కబేళాలో గోవధ జరుగుతుందనే ఆరోపణలతో ఆందోళనకారులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారడంతో పోలీస్ అధికారి సుబోధ్ కుమార్ సింగ్ సహా ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment