కర్ణాటకః అడవి జంతువులు తమ పంటపొలాలను నాశనం చేస్తున్నాయని, తమ ఖరీదైన పశువులను పులి చంపేసిందని, చెరకు పంటను ఏనుగుల గుంపు తొక్కేసిందంటూ ఆందోళన చెందే మారుమూల గ్రామాల ప్రజలను ఆదుకునేందుకు వైల్డ్ సేవా కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చారు. బాధితులకు ప్రభుత్వ పరిహారం వెంటనే అందేట్లుగా గ్రామసస్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల్లో కొందరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, సమస్యలను వెంటనే తెలిపేందుకు టోల్ ఫ్రీ నెంబర్ అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు.
లబ్ధిదారులకోసం 'వైల్డ్ సేవ' ను కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో అందుబాటులోకి తెచ్చారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల్లో అవగాహన కల్పించేందుకు స్థానికులు కొందరికి 'ఫీల్డ్ ఏజెంట్ల పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తాము నష్టపోయామంటూ రైతులు దరఖాస్తులు చేసుకొని కార్యాలయాలచుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా.. లబ్ధిదారులకు వెంటనే పరిహారం అందేలా 'వైల్డ్ సేవ' కార్యక్రమం చేపట్టారు. నష్టపోయిన రైతులకు కేవలం నాలుగు రోజుల్లోనే పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వైల్డ్ లైఫ్ కంజర్వేషన్ సొసైటీ (డబ్ల్యూసీఎస్) ఆధ్వర్యంలో ఓ లాభాపేక్ష లేని స్వచ్ఛంద సేవకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ అటవీ శాఖతో కలసి కర్ణాటక, తమిళనాడుల్లోని సుమారు 284 గ్రామాల్లో వన్యప్రాణులనుంచి జనజీవనాన్ని రక్షించడంతోపాటు... వైల్డ్ సేవ కార్యక్రమంతో అంతరించిపోతున్న అడవి జంతువులను కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా జనాభా కలిగిన అటవీ ప్రాంతాలమీత దృష్టి సారించి.. అక్కడి ప్రజలకు, వన్యప్రాణులకు నష్టం కలగకుండా ప్రయత్సిస్తున్నారు.
సుమారు 20 వేల రూపాయల ఖరీదు చేసే అవును పులి చంపేయడంతో పరిహారంకోసం దరఖాస్తు చేసుకున్నఓ రైతు.. వైల్డ్ సర్వీస్ తో 9 వేల రూపాయలు పొందాడు. అయితే పరిహారం తక్కువ వచ్చినా.. తనకు సంతృప్తిగానే ఉందన్న అతడు... గతంలో పరిహారంకోసం అధికారులచుట్టూ, కార్యాలయాలచుట్టూ తిరగడంతోపాటు పరిహారం పొందేందుకు డబ్బు ఎదురు చెల్లించాల్సి వచ్చేదని తెలిపాడు. అదీకాక ముందుగా పంటదాడులు, చనిపోయిన పశువుల ఫొటోలు తీసుకొని, గంటలకొద్దీ ప్రయాణం చేసి అటవీశాఖ కార్యాలయాలకు వెళ్ళాల్సి వచ్చేదని, సమయానికి అధికారులు లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని చెప్తున్నాడు. 'వైల్డ్ సేవ' కార్యక్రమం ప్రారంభమైన తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన ఏజెంట్ల ద్వారా సేవలు అందించడంతో వెంటనే పరిహారం పొందగల్గుతున్నట్లు స్థానిక రైతులు చెప్తున్నారు. అంతేకాదు 'వైల్డ్ సేవ' ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ తో తమకు జంతువులనుంచీ రక్షణతోపాటు, సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలను అడవిజంతువులు నాశనం చేశాయనో, పశువులను చంపేశాయనో గ్రామస్థులు, రైతులనుంచీ తమకు రోజుకు ఒక్క ఫోన్ కాల్ అయినా వస్తుంటుందని, ఒక్కో ఏజెంట్ కు సుమారు 20 కిలోమీటర్ల పరిథిలో ఉన్న 70 గ్రామాలనుంచీ ఫోన్లు వస్తాయని, వచ్చిన ఎనిమిది గంటల్లోపు అక్కడికి వెళ్ళి సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తామని ఫీల్డ్ ఏజెంట్లు చెప్తున్నారు. ఏడుగురు ఫీల్డ్ ఏజెంట్లతో గత సంవత్సరం ప్రారంభించిన వైల్డ్ సేవా కార్యక్రమంలో భాగంగా పంటలు, ఆస్తుల నష్టం కేసుల్లో ఇప్పటిదాకా సుమారు 3,261 పరిష్కరించినట్లు 'వైల్డ్ సేవ' తెలిపింది. దీంతోపాటు.. 148 వరకూ పులులు, అడవికుక్కలద్వారా నష్టపోయిన పశుసంపద, తీవ్ర గాయాలైన 11 మంది, ఇద్దరు చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన కేసులను పరిష్కరించినట్లు 'వైల్డ్ సేవ' నివేదించింది.
వన్యప్రాణులనుంచీ రక్షణకు టోల్ ఫ్రీ నెంబర్..
Published Tue, Jul 26 2016 4:01 PM | Last Updated on Thu, Jul 25 2019 5:24 PM
Advertisement