చైనాతో బంధాలు బలోపేతం
జిన్‌పింగ్ పర్యటనపై మోడీ ఆశాభావం
న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ చేపట్టనున్న భారత పర్యటన ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ నెల 17న అహ్మదాబాద్‌లో ఆయనకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నానని సోమవారం ట్విట్టర్‌లో తెలిపారు. బౌద్ధమతంతో గట్టి అనుబంధమున్న ఉభయ దేశాల బంధాలు జిన్‌పింగ్ పర్యటనతో పటిష్టమవుతాయన్నారు.
గుజరాత్‌లోని బౌద్ధక్షేత్రాల చిత్రాలను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వీటిలో ఆయన స్వస్థలమైన వాద్‌నగర్‌లో జరిపిన తవ్వకాల చిత్రాలూ ఉన్నాయి. ‘నేను జన్మించిన వాద్‌నగర్ కూడా బౌద్ధమత ప్రభావం గల ప్రాంతమే. గుజరాత్‌లో చాలా బౌద్ధమఠాలు, సన్యాసులు ఉన్నట్లు చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ చెప్పారు’ అని తెలిపారు. కాగా, మోడీ అహ్మదాబాద్‌లో ఈ నెల 17న సబర్మతి నది ఒడ్డున జిన్‌పింగ్‌కు వ్యక్తిగత విందు ఇవ్వనున్నారు. 50 ఏళ్ల కిందట అప్పటి చైనా ప్రధాని చౌ ఎన్‌లైకి కూడా నాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పంజాబ్‌లోని నంగల్‌లో సట్లేజ్ ఒడ్డున విందు ఇచ్చారు.
పర్యటనలో సరిహద్దు వివాదంపై చర్చ
జిన్‌పింగ్ పర్యటన సందర్భంగా సరిహద్దు వివాదంపై చర్చించనున్నట్లు భారత్ తెలిపింది. ఇరు దేశాల ఆందోళనలకు పరిష్కారం లభిస్తుందని, సరిహద్దు వివాదం వంటివాటిపై చ ర్చ జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. కాగా, భారత రైల్వే ఆధునీకరణ, పారిశ్రామిక రంగాల్లో 10 వేల కోట్ల డాలర్ల నుంచి 30 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు చైనా సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు.
లడఖ్‌లో చొరబాట్లు
లేహ్: ఓ పక్క చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ పర్యటనకు సిద్ధమవుతుండగా, మరోపక్క ైచె నా పౌరులు పెద్ద సంఖ్యలో భారత్‌లోకి చొరబడ్డారు. జమ్మూకాశ్మీర్ లడఖ్ ప్రాంతంలోని డెమ్‌చోక్‌లోకి చైనా పౌరులు తమ ప్రభుత్వ వాహనాల్లో అక్రమంగా ప్రవేశించారు. అక్కడ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఉన్న స్థానికులు అడ్డుకున్నారు. వీరిని వాస్తవాధీన రేఖ అవతలి తోషిగాంగ్ గ్రామం నుంచి వాహనాల్లో తీసుకొచ్చారని, వారం నుంచి చైనా ఈ ప్రాజెక్టు పనులకు అభ్యంతరం చెబుతోందని లేహ్ డిప్యూటీ కమిషనర్ సిమ్రాన్‌దీప్ సింగ్ చెప్పారు. చైనా ఆర్మీ ఈ ప్రాజెక్టు పనులను అడ్డుకున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. అయితే ఈ ఉదంతాన్ని భారత విదే శాంగ శాఖ తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించింది. సరిహద్దు వివాదంపై చైనాతో చర్చిస్తామని పేర్కొంది.