![ఢిల్లీకి వరద ముప్పు!?](/styles/webp/s3/article_images/2017/09/4/71468934354_625x300.jpg.webp?itok=STWCh9tv)
ఢిల్లీకి వరద ముప్పు!?
న్యూఢిల్లీః యమునా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. హర్యానాలోని హతిన్ కుంద్ బ్యారేజీ వద్ద భారీ మొత్తంలో నీటిని ఒక్కసారిగా కిందికి వదలడంతో ఢిల్లీ ప్రాంతంలో యమునా నది ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో రాజధాని ఢిల్లీకి వరద ముప్పు ఏర్పడటంతో నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనేక మోటార్ బోట్లను రంగంలోకి దింపింది.
ఉత్తర భారతంలో కురిసిన వర్షాల కారణంగా యమునానది పొంగి ప్రవహిస్తోంది. సాధారణ నీటిమట్టం 204.22 మీటర్లను దాటి ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో దేశరాజధాని ఢిల్లీకి వరద ముప్పు ఏర్పడింది. ముప్పును ఎదుర్కొనేందుకు అంతా అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యమునా నది నీటిమట్టం సాధారణ స్థాయి 204 మీటర్లు. 204.83 మీటర్లు ప్రమాద స్థాయిగా గుర్తిస్తారు. 1978 సంవత్సరంలో రికార్డు స్థాయిలో యమునానది నీటిమట్టం 207.49 మీటర్లకు చేరింది. ప్రస్తుతం నీటిమట్టం మొదట్లో భారీగా పెరిగినప్పటికీ వర్షాలు అంతగా లేకపోవడంతో క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం హతిన్ కుంద్ బ్యారేజీనుంచి 1,60,000 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేసినట్లు వారు వెల్లడించారు.
నదీ ప్రవాహంతో హస్తినలో వదర ముప్పు ఉండటంతో గతవారం నగర ఇరిగేషన్ మరియు వరద నియంత్రణ విభాగం బాదర్ పూర్, బురారీ, సోనియా విహార్, జగత్ పూర్, సుర్ ఘర్ వజీర్పుర్, బోట్ క్లబ్, గీతా కాలనీ, షంషాన్ ఘాట్, హైతీ ఘాట్, చిల్లా విలేజ్, మయూర్ విహార్, బట్లా హౌస్, కలింది కుంజ్, బవానా నెహర్ ప్రాంతాల్లో 18 మోటార్ పడవలను మొహరించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ బోట్లను అక్కడినుంచీ తరలించవద్దని హెచ్చరించింది.