బడ్జెట్‌లో ప్రత్యేక హోదా ప్రస్తావనేదీ?
లోక్‌సభలో వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్న
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికంగా ఎంతో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని ప్రజలు ఎంతగానో ఎదురుచూశారని, అయితే కేంద్ర బడ్జెట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం నిరాశకు గురిచేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ లోటును పూడ్చేం దుకు కేవలం రూ.1.40 కోట్లే కేటాయించారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణం కనీసం రూ.5వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా గురువారం మధ్యాహ్నం ఆయన లోక్‌సభలో మాట్లాడారు.
‘‘ఆంధ్రప్రదేశ్‌లోని కేజీ బేసిన్ ద్వారా గ్యాస్ ఉత్పత్తి జరుగుతున్నా రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకుగ్యాస్ కేటాయింపుల్లో అన్యాయమే జరుగుతోంది. దీంతో రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొంటోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ ఉత్పత్తికి సరిపడా గ్యాస్ విడుదల చేయాలని కేంద్రాన్ని కోరుతున్నా’’ అని విన్నవించారు. ఢిల్లీ వంటి రాజధానిని నిర్మించి ఇస్తామని తిరుపతి ఎన్నికల సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. ఆ మేరకు అవసరమైన నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని కోరారు.