
ఎట్టం ప్రమీల (సంజీవులు తల్లి)ఎట్టం సంజీవులు
కామారెడ్డి: ‘నాలుగు పైసలు సంపాదిస్తానని దేశంగాని దేశం బోయిన కొడుకు చెయ్యని నేరానికి జైలు పాలైండు. జైలులో ఎట్లున్నడో ఏమో’ అంటూ కొడుకు కోసం ఆ తల్లి తపిస్తోంది. కొడుకును విడిపించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను వేడు కుంటోంది.
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం నల్లమడుగు గ్రామానికి చెందిన ఎట్టం సంజీవులు (26) అనే యువకుడు రెండున్నరేళ్ల క్రితం బతుకుదెరువు కోసం ఒమన్ దేశానికి వెళ్లాడు. మస్కట్‌లో ఒమన్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు సంబందించిన హోటల్‌లో వెయిటర్‌గా పనికి కుదిరాడు.
ఆరు నెలల పాటు బాగానే ఉందని తల్లితో ఫోన్ చేసి మాట్లాడాడు. ఇంటికి డబ్బులు పంపించాడు. కాగా, సంజీవులు పనిచేసే హోటల్‌లో ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ మహిళ హత్యకు గురైంది. ఆ కేసులో సంజీవులును పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలిసిన తల్లి కన్నీరుమున్నీరైంది. ఏడాది పాటు కోర్టు కేసు విచారణ కొనసాగింది.
గత యేడాది అక్టోబర్‌లో సంజీవులుకు 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ అక్కడి కోర్టు తీర్పుచెప్పింది. కొడుకుకు జైలు శిక్ష పడినప్పటి నుంచి తల్లి మనోవేదనకు గురవుతోంది. సంజీవులు తండ్రి సాయన్న చనిపోయినప్పటి నుంచి తల్లే సంజీవులును పెద్ద చేసింది. కొడుకు కోసం ఎంతో కష్టపడింది.
జైలులో ఉన్న సంజీవులును విడిపించ డానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ అప్పట్లోనే బంధువులు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను కలిసి విన్నవించారు. అయినా లాభం లేకుండాపోయింది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని తెలిసిన బంధువులు ఇటీవల బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డిని కలిసి సాయం అందించాలని వేడుకున్నారు. కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళతానని ఆయన హామీ ఇచ్చారని సంజీవులు బంధువులు తెలిపారు.