
డాలస్ : అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలను ఈ ఏడాది మేలో డాలస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో కీలక పాత్ర పోషించిన వారిని నాట్స్ అభినందన సభ నిర్వహించి ఘనంగా సత్కరించింది. తెలుసు సంబరాలను డాలస్ నాట్స్ నాయకత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అద్భుతంగా నిర్వహించిందని బోర్డ్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ ప్రశంసించారు. చక్కటి ప్రణాళిక, సమర్థ నాయకత్వం, సమన్వయం ఉంటే ఎలాంటి కార్యక్రమమైనా ఘన విజయం అవుతుందనే దానికి తెలుగు సంబరాలే ప్రత్యక్ష సాక్ష్యమని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి అన్నారు.
డాలస్ నాట్స్ తెలుగు సంబరాల సమన్వయకర్త సంబరాల సమన్వయకర్త కంచర్ల కిషోర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. సంబరాలను విజయవంతం చేయడంలో తోడ్పడిన పలు కమిటీల సభ్యులు, దాతలు, స్వచ్ఛంద కార్యకర్తలను ఈ కార్యక్రమంలో జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఆహార, వాణిజ్య, సావనీర్, సాంస్కృతిక, సాహిత్య, మహిళ, ఆధ్యాత్మిక, మీడియా, రవాణ, ఆతిథ్య తదితర విభాగాలకు చెందిన వందల మంది కార్యకర్తలను నాట్స్ కార్యవర్గం గుర్తించి, సత్కరించి, ఘనంగా గౌరవించింది. ఈ కార్యక్రమంలో అన్నే విజయశేఖర్, మాదాల రాజేంద్ర, ఆది గెల్లి, నూతి బాపు, బిందు కంచర్ల, ప్రేమ్ కలిదిండి, ఫణి యలమంచిలి, గోవాడ అజయ్, అమర్ అన్నే, వీరగంధం కిషోర్, సుబ్బు జొన్నలగడ్డ, మాడ దయాకర్, రాయవరం విజయభాస్కర్, అనంత్ మల్లవరపు, వీర లెనిన్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరయిన పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను గుత్తికొండ శ్రీనివాస్, మంచికలపూడిలు సత్కరించి జ్ఞాపికను అందజేశారు.


