భావస్వేచ్ఛకు రక్షణ ‘ఫుల్‌బెంచ్’ | ABK Prasad writes on Criminal Defamation and the Supreme Court’s verdict | Sakshi
Sakshi News home page

భావస్వేచ్ఛకు రక్షణ ‘ఫుల్‌బెంచ్’

Published Tue, May 17 2016 4:50 AM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

భావస్వేచ్ఛకు రక్షణ ‘ఫుల్‌బెంచ్’ - Sakshi

భావస్వేచ్ఛకు రక్షణ ‘ఫుల్‌బెంచ్’

రెండో మాట
 
విద్వత్ సంపన్నులైన పతంజలి శాస్త్రి, వివన్ బోస్, ఎస్.ఆర్.దాస్, హిదయతుల్లా, కృష్ణయ్యర్, పి.ఎన్. భగవతి లాంటి హేమాహేమీలు గొప్ప న్యాయమూర్తులుగా ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన కాలంతో పోల్చుకుంటే మన ప్రస్తుత దశ మరింత ప్రగతిశీలం కావాలని కోరుకోవడం తప్పుకాదు! ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ ఇటీవల కొన్ని కేసుల విచారణ సందర్భంగా వేస్తున్న విజ్ఞానదాయకమైన ప్రశ్నలు గమనిస్తుంటే జమ్ము-కశ్మీర్‌లో ఆయన నెలకొల్పిన కీర్తిప్రతిష్టలు గుర్తుకురాక మానవు!
 
‘పరువు నష్టం కేసులలో సత్యం/వాస్తవం అనేది డిఫెన్స్ కాజాలదు’
 (ఇండియన్ పీనల్ కోడ్ 499-500 సెక్షన్ల ప్రకారం)
‘పరువు నష్టం కేసులలో సత్యం లేదా వాస్తవం అనేది డిఫెన్స్ కాకపోతే మరేదీ డిఫెన్స్?’
 (ఈ వ్యాసకర్త ఒక దినపత్రిక సంపాదకునిగా ఉన్నకాలంలో, వేరొక
పత్రిక యాజమాన్యం కళాఖండాల తరలింపు వివాదం మీద సుప్రీంకోర్టులో వేసిన రిట్‌పిటిషన్‌ను అనుమతించిన సందర్భంగా-ఎస్‌ఎల్‌పి సివిల్ సూట్ 13568 /2003- గౌరవ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్య
)
 
ఈ రిట్‌ను ఈ వ్యాసకర్త తరఫున దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది 499 సెక్షన్ భాషను గౌరవ న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. కేసులో ‘సత్యం’ (ట్రూత్ ఈజ్ నాట్ డిఫెన్స్) డిఫెన్స్ కాకుంటే, మరేదట? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అప్పుడు సీనియర్ న్యాయవాది న్యాయమూర్తి ఆసనం మీద ముద్రించి ఉన్న ‘సత్యమేవ జయతే’ అన్న సూక్తిని గురించి గుర్తు చేశారు. వెంటనే రిట్‌ను స్వీకరించారు. కానీ ఆ రిట్‌ను దాఖలు చేసిన 13 ఏళ్ల తరు వాత కూడా ఇప్పటికీ అది విచారణకు రాకపోవడం ఆశ్చర్యకరం.

కానీ ఐదేళ్ల తరువాత ఇదే పరువు నష్టం వివాదంలో ‘ది హిందూ’ దినపత్రిక కేసు సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది. కేసు కొట్టివే శారు కూడా. ఏది ఏమైనా కేసుల విచారణలో అసాధారణ జాప్యం ఒక వాస్తవం. ఇందుకు కారణాలను ప్రధాని మోదీ హాజరైన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో ప్రస్తుత గౌరవ ప్రధాన న్యాయమూర్తి ఆవేదనతో ప్రస్తావించారు. పెద్ద సంఖ్యలో న్యాయమూర్తుల నియామకాలు జరగాలని సూచించారు.

వలసవాదుల ఉచ్ఛిష్టమే పరువునష్టం
ఈ ప్రస్తావన ఇక్కడ తేవడానికి కారణం ఉంది. రాజకీయ, పత్రికారంగాలలో వ్యక్తమయ్యే భావ ప్రకటనా స్వేచ్ఛలో, భిన్నాభిప్రాయాల ప్రకటనలను అదుపు చేసే పరువు నష్టం కేసులలో క్రిమినల్ డిఫమేషన్ చట్టాన్ని సమర్ధిస్తూ ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బెంచ్ తీర్పు చెప్పింది. వలసపాలనా వశేషంగా సంక్రమించిన శిక్షా స్మృతిలోని ఈ క్రిమినల్ సెక్షన్‌ను రద్దు చేయా లని కోరుతూ పలువురు ప్రసిద్ధులు (ఒక బీజేపీ నేత సహా) దాఖలు చేసిన పిటిషన్ల మీద ఆ ఇద్దరు సభ్యుల బెంచ్ తీర్పు చెప్పింది.

అవినీతి, ప్రజా వ్యతిరేకత వంటి అంశాల మీద పత్రికలు, విలేకరులు, సంపాదకులు ఎవరూ వార్తలు వంటివి ప్రచురించకుండా, ఉద్యమాలు చేపట్టకుండా బ్రిటిష్ పాల కులు క్రిమినల్ డిఫమేషన్ క్లాజులను చేర్చుకున్నారు. ఆ ఉచ్చిష్టాన్నే స్వతంత్ర భారత పాలకులు అందిపుచ్చుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి, ఈ రోజు దాకా చేసిన చట్టాలు 5000 అని అంచనా. వీటి మూలాలన్నీ వలస పాలన నుంచి సంక్రమించిన చట్టాలలోనివే. వాటి చాటునే కాంగ్రెస్, బీజేపీ పాలకులు తమ ప్రయోజనాలకు అనుకూలంగా కాలక్షేపం చేస్తున్నారు. ఇలాంటి వాస్తవాలను ప్రజలు గ్రహించకుండా, గ్రహించినా నిరసనకు అవ కాశం లేకుండా చేసేందుకు పత్రికలను, ఇతర ప్రసార మాధ్యమాలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

భావ ప్రకటనా స్వేచ్ఛను, భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణను పాలకులు ఎప్పుడైతే ‘సెడిషన్’పేరుతో ప్రకటించడానికి సాహసించారో, అప్పుడే సుప్రీంకోర్టు, ఇతర కోర్టులు, కొందరు న్యాయ మూర్తులు కూడా ఒత్తిళ్లను ఎదుర్కొనక తప్పని పరిస్థితి వచ్చింది. గూఢచారి సంస్థలు, ఆర్థిక సంస్థలు ఏలికల ప్రయోజనాల కోసం రాజ్యాంగం నిర్దేశించిన తమ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోలేని దురదృష్టకర పరిణామం ఎమర్జెన్సీ కాలం నుంచే ప్రారంభమైంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి హెచ్‌ఆర్ ఖన్నా, మరో ఇద్దరు ముగ్గురు న్యాయమూర్తులు మినహా మిగిలిన ధర్మాసన శాఖలు నిరంకుశ పాలనా వ్యవస్థకు లొంగి తీర్పులు ఇవ్వడం ప్రారం భించాయి. అన్ని ప్రాథమిక హక్కులు కుప్పకూలి, హెబియస్ కార్పస్ రిట్‌ను సయితం సమర్పించడానికీ, కోర్టులు స్వీకరించడానికీ వీలులేని ‘ఎమ ర్జెన్సీ’లో సాహసించి రిట్‌ను స్వీకరించి వందలాది మంది డిటెన్యూలను విడు దల చేస్తూ చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోగల చర్య తీసుకున్నవారు జస్టిస్ ఖన్నా.
 
చట్టంలోని క్రిమినల్ డిఫమేషన్ సెక్షన్‌ను ఇద్దరు సభ్యుల బెంచ్ సమర్థిస్తూనే, మరో వైపున ‘భిన్నాభిప్రాయ ప్రకటన ఉండరాద’ని తీర్పు ఉద్దేశం కాదని, ఎదుటి వ్యక్తి గౌరవానికి భంగం లేకుండా సౌభ్రాతృత్వ భావాన్ని పెంపొందించాలన్నదే తీర్పు భావన అనీ ప్రకటించింది. కానీ ఆ లక్ష్యాన్ని రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుల పరిధిలో సాధించి పెట్టే లక్ష్యంతో ఆర్థిక దోపిడీని అరికట్టేందుకు దేశ సంపదను ప్రజా బాహుళ్యం అనుభవించకుండా చేసే కొలది మంది దగాకోరుల చర్యలను, భూబకా సురుల చర్యలను కార్పొరేట్ వర్గాల దుశ్చర్యలను మీడియా బహిర్గతం చేయడాన్ని ఏమని పిలుద్దాం? రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల రక్షణ అధ్యాయానికి ఇచ్చినంత ప్రాధాన్యాన్ని సామాన్యుల జీవితాలను సుఖ మయం చేయడానికి దోహదం చేసే ఆదేశిక సూత్రాల(డెరైక్టివ్ ప్రిన్సిపుల్స్) అధ్యాయానికి పాలకులు ఎందుకు ఇవ్వడంలేదో చెప్పాలి.

అలాగే ఒక అధ్యా యాన్ని (ప్రాథమిక హక్కు - ఆస్తి హక్కులను) కోర్టులను ఆశ్రయించి అమలు చేయించుకోడానికి అవకాశం కల్పించి, మరో రాజ్యాంగ ఆదేశాల అధ్యాయాన్ని ఎందుకు తొక్కిపెడుతున్నారో కూడా న్యాయస్థానాలు సమా దానం చెప్పాల్సి ఉంటుంది! ‘2-జి’ స్కాముల తర్వాత, న్యాయ వ్యవస్థలో జడ్జీల నియామకాల నిర్ధారణకు జ్యుడీషియరీ స్థానే జాతీయ స్థాయి జ్యుడీషియల్ కమిషన్ ఏర్పరచాలన్న (అనుకూలుర నియామకాల కోసం) మోదీ పట్టుబట్టినప్పుడు సుప్రీం నిరాకరించినప్పటి నుంచీ రాజ్యాంగ సంస్థల మధ్య ఘర్షణ వస్తూనే ఉంది. బొమ్మైకేసులో సుప్రీంకోర్టు కర్ణాటకలో రాష్ట్రపతి పాలన వేధింపును ప్రశ్నించి, పార్టీల బలాబలాల నిరూపణకు శాసనసభ మాత్రమే వేదికని జస్టిస్ జీవన్‌రెడ్డి ప్రభృతులతో కూడిన రాజ్యాంగ విస్తృత ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

అయినా మోదీ ప్రభుత్వం కూడా ఉత్తరాఖండ్‌లో, అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పాలనను కూల్చడానికి రాష్ట్రపతిని చాటు చేసుకుంది. సుప్రీం జోక్యంతో ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన రద్దయింది. ఈ పరిణామం మోదీ ప్రభుత్వానికి చుక్కెదురే. ఇక ఊరట ఎక్కడ లభించిందంటే - భావ ప్రకటనా స్వేచ్ఛను ‘దేశద్రో హం’గా భావిస్తున్న బీజీపీ పాలకులకు తాజాగా సుప్రీం ద్విసభ్య ధర్మాసనం పత్రికా స్వేచ్ఛకు విధించిన షరతులు ‘వ్యక్తి పరువునష్టం సమాజం మీదనే ఎక్కుపెట్టిన నేరం’గా ప్రకటించింది. అది కూడా ఏ సమయంలో? సివిల్ డిఫమేషన్‌ను ఉంచి, చట్టంలోని ‘క్రిమినల్ డిఫమేషన్’ సెక్షన్‌ను రద్దు చేయా లని ప్రపంచ వ్యాప్తంగా కోరుతున్న దశలో ఈ ప్రకటన వచ్చింది.  

ఇటీవల కాలంలో ఎన్నో విషయాలలో ధర్మాసన చైతన్యాన్ని ఆచరణలో చూపగలుగు తున్న సుప్రీంకోర్టు ఈ విషయంలోనూ ముందంజ వేయాలి. ద్విసభ్య ధర్మాసనం ధృవపరచిన క్రిమినల్ డిఫమేషన్ సెక్షన్‌ను సుప్రీం ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనం తక్షణం సమావేశమై కొట్టివేయాలి. ఎందుకంటే, ‘న్యాయ వ్యవస్థ ఒక్కో అడుగు చొప్పున ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ శాసన వ్యవస్థనే ఆక్రమిస్తోంద’ని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ (11-5-2016) హెచ్చరికగానే ప్రకటించారు. ‘మా మంత్రి పదవులను కోరుకునే పక్షంలో జడ్జీలు తమ హోదాలను వదులుకుని వచ్చి ఎన్నికల్లో పోటీ చేసుకోవచ్చు’నని అదే రోజున మరో కేంద్రమంత్రి గడ్కారీ సవాలు విసిరాడు!

అమెరికాలో పెట్టు బడి దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రగతి భావాల వ్యాప్తి ఉధృతంగా సాగు తున్న రోజుల్లో కొందరు అమెరికన్ జడ్జీలు మార్క్సిజం లేదా కమ్యూనిజం, సోషలిజం అన్న పదాలు వినడానికి, వాడడానికి భీతిల్లి పోతున్న ఘడియలలో జస్టిస్ బ్రాండీస్, హోమ్స్ లాంటి ఉద్దండులైన అమెరికన్ న్యాయమూర్తులు (విట్నీ ఁ కాలిఫోర్నియా కేసు) ఎలాంటి చైత న్యంతో స్పందించారో వినడం ఒక సుకృతం:

‘‘అమెరికా విమోచనోద్యమకారుల, స్వాతంత్య్రప్రదాతల, ప్రజల సంతోషానికి, ధైర్య సాహసాలకి వెనకనున్న రహస్యం వారు స్వేచ్ఛ, స్వాతం త్య్రాలని విశ్వసించారు. వ్యక్తి స్థాయిలో ఎవరో పిడుగులా వచ్చి తన వ్యక్తి త్వాన్ని భంగపరుస్తారన్న భయం, భీతి వ్యక్తి భావప్రకటనా స్వేచ్ఛనూ, సమావేశ స్వేచ్ఛనూ అణచి వేయడానికి సాకు కారాదు. చేతబడులు చేసే మంత్రగత్తెలున్నారన్న భయంకొద్దీ మనుషులు స్త్రీలను వెంటాడి తగలబెట్టే వారు. ఇలాంటి హేతు విరుద్ధమైన భయాల బంధనాల బానిసత్వం నుంచి మనుషుల్ని బయట పడవేయడమే భావస్వేచ్ఛ బాధ్యత, కార్యాచరణం. భావ స్వేచ్ఛను, భావ ప్రకటననూ అణచివేయాలంటే, భావ స్వేచ్ఛను అనుమతించడంవల్ల ఏదో తీవ్రమైన చెడు వాటిల్లబోతుందన్న భయానికి హేతుబద్ధమైన పునాది ఉండితీరాలి’’! ఈ భావ స్వేచ్ఛ గురించిన చర్చ వాదోపవాదాలు జరిగిన తర్వాతనే మన సుప్రీంకోర్టు అనేక కేసులలో రాజ్యాంగంలోని 19(2) అధికరణలో భావప్రకటనా స్వేచ్ఛ పూర్వరంగంలో ‘హేతుబద్ధమైన అదుపాజ్ఞలు’ అన్న క్లాజును చొప్పించింది.

సత్యవార్త నుంచి రక్షణ లేకుంటే...
సుప్రీం ద్విసభ్య ధర్మాసనం చెప్పిన తీర్పు ప్రకారం పత్రికలుగానీ, ఇతర మాధ్యమాలుగానీ ఒక దురన్యాయాన్ని లేదా దుర్మార్గాన్ని వార్తలుగా రాయకూడని పరిస్థితిని రుద్దినట్టవుతోంది. ఎందుకని? పీనల్ కోడ్ 499 సెక్షన్ కింద ‘సత్యవార్త’ అనేది వార్త రాసిన వాడికి రక్షణ (డిఫెన్స్) కాకుండా పోతుంది కదా! ఈ సెక్షన్ కిందనే బ్రిటిష్ వలస పాలకులు మనల్ని నానా కోర్టులకూ తిప్పి వేధించిన విషయం న్యాయమూర్తులు సహా మనందరికి ‘పరగడుపు’ అయిపోతే ఎలా?! పైగా ‘‘నక్కీరన్’’ పత్రికపై నడిచిన కేసులో సీనియర్ న్యాయమూర్తి జీవన్‌రెడ్డి ఫుల్‌బెంచ్ తీర్పు చెబుతూ సమాచార సాంకేతిక వ్యవస్థ శరవేగాన దూసుకువచ్చి వార్తా మాధ్యమాల రంగాన్ని భారీస్థాయిలో రోజుకొక తీరున ప్రభావితం చేస్తున్న ఈ దశలో ‘‘క్రిమినల్ డిఫమేషన్’’ సెక్షన్‌ను ఎత్తివేసి సివిల్ డిఫమేషన్ కింద వాదోపవాదాలు జరిగి తీర్పులు వెలువరించడం శ్రేయస్కరమని (1994 - రాజగోపాలన్ ఁ తమిళ నాడు కేసు) తీర్పు చెప్పారని గుర్తించాలి!

విద్వత్ సంపన్నులైన పతంజలి శాస్త్రి, వివన్ బోస్, ఎస్.ఆర్.దాస్, హిదయతుల్లా, కృష్ణయ్యర్, పి.ఎన్. భగవతి లాంటి హేమాహేమీలు గొప్ప న్యాయమూర్తులుగా ప్రధాన న్యాయ మూర్తులుగా పనిచేసిన కాలంతో పోల్చుకుంటే మన ప్రస్తుత దశ మరింత ప్రగతిశీలం కావాలని కోరుకోవడం తప్పుకాదు! ప్రస్తుత ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఠాకూర్ ఇటీవల కొన్ని కేసుల విచారణ సందర్భంగా వేస్తున్న విజ్ఞానదాయకమైన ప్రశ్నలు గమనిస్తుంటే జమ్ము-కశ్మీర్‌లో ఆయన నెల కొల్పిన కీర్తి ప్రతిష్టలు గుర్తుకురాక మానవు! ‘సత్యాన్ని’ వధించేది ధర్మమూ కాదు, న్యాయమూ కాదు, మరోసారి జడ్జిగారి సీటుపై ధర్మాసన ముద్రను - ‘సత్యమేవజయతే’ ను తలచుకుంటూ, సెలవు! సెలవు!

- ఏబీకే ప్రసాద్
 సీనియర్ సంపాదకులు
 abkprasad2006@yahoo.co.in

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement