
హోదాపై కేంద్రం కుప్పిగంతులు!
రాజ్యసభలో ఇచ్చిన వాగ్దానం మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలనే ప్రతిపాదనకు మార్చి 2014లోనే కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసి, ప్రణాళికా సంఘానికి కూడా పంపింది. మోదీ అధికార పగ్గాలు చేపట్టి ప్రణాళికా సంఘాన్నే రద్దు చేసి, నీతి ఆయోగ్ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రణాళికా సంఘం, నీతి ఆయోగ్, ఆర్థిక సంఘానికి, ప్రత్యేక తరగతి హోదా కల్పించే అంశానికి లంకె పెట్టడం అసంబద్ధం. అలాగే పునర్విభజన చట్టంలో పేర్కొనలేదని బుకాయించడం అర్థరహితమైనది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి హోదాతో ఒరిగేదేమీ లేదని, అదే సంజీవని కాదని ఎన్నో డొంక తిరుగుడు మాటలు కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అధికార పక్షాల నాయకులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. హోదా కంటే మెరు గైనప్యాకేజీ ఇచ్చే ఆలోచనలో కేంద్రం ఉన్నదని, హోదాకు 14వ ఆర్థిక సం ఘం సిఫారసులు అడ్డంకిగా మారాయని అంటున్నారు. తెలుగుజాతిని రెండు ముక్కలు చేసి, పదమూడు జిల్లాలతో ఏర్పరచిన నేటి ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన రాజకీయ పార్టీలకు రాష్ర్ట ప్రజల భవిష్యత్తుతో ఆట లాడుకొనే హక్కు ఎవరిచ్చారు? ఇది ప్రజాస్వామ్యమేనా?
ఈ విభజన ఐదు కోట్ల ప్రజలపైరుద్దిన చర్య. లోక్‌సభలో విపక్షాల నోళ్లు నొక్కి విభజన బిల్లుకు ఆమోదముద్ర వేశారు. బిల్లు రాజ్యసభకు వెళ్లినపుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి హోదా (స్పెషల్ కేటగిరి స్టేటస్) కల్పిస్తామని నాటి ప్రధాని డా॥మన్మోహన్‌సింగ్ వాగ్దానం చేశారు. నాటి ప్రతిపక్షం బీజేపీయేనేటి పాలకపక్షం. నాటి అధికారపక్షం కాంగ్రెస్ నేటి విపక్షం. ఈ రెండు పార్టీలే రాష్ట్రాన్ని ముక్కలు చేశాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకో వలసిన నైతిక బాధ్యత విభజన పాపంలో పాలు పంచుకొన్న రాజకీయ పక్షా లన్నింటి మీదా ఉన్నది. ఈ పూర్వరంగంలో చిత్తశుద్ధి, అంకితభావం, రాజ కీయ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి హోదాను హక్కుగా సాధించుకోవడానికి రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలి.
ఐదేళ్లు కాదు, పదేళ్లపాటు హోదా ఇస్తే తప్ప పారిశ్రామిక వర్గాలు ముం దుకొచ్చి పారిశ్రామికాభివృద్ధికి చర్యలు చేపట్టలేవని వెంకయ్యనాయుడు నాడు అన్నారు. ఆయన అవగాహనారాహిత్యంతో మాట్లాడారా? ప్రత్యేక హోదాకు, ప్రత్యేక తరగతి హోదాకు తేడా ఉన్నది. పార్లమెంటులో 3/4 వంతు మెజారిటీతో ఆమోదించి ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్‌కు ప్రసా దించినది ‘ప్రత్యేక హోదా’. ఆ రాష్ర్ట స్వయం ప్రతిపత్తి దాని ఫలితమే. జాతీయ అభివృద్ధి మండలి నిర్ణయం మేరకు కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక తర గతి హోదా ఇచ్చారు. గాడ్గిల్ సూత్రం ప్రకారం కేంద్ర ప్రణాళికా నిధులను రాష్ట్రాలకు పంపిణీ చేసే విధానంలో భాగంగా కొన్ని కొలబద్దల ప్రాతిపదికన 1969లో మూడు రాష్ట్రాలకు ప్రత్యేక తరగతి హోదా కల్పించారు. ఆ సౌక ర్యాన్ని దశల వారీగా 11 రాష్ట్రాలకు విస్తరించారు.
సమాఖ్య వ్యవస్థ క్రియాశీలతను పరిగణనలోకి తీసుకొని ఈ విధానాన్ని పునర్నిర్వచించాలని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన మాట వాస్తవం. ఆ సిఫారసులకు పార్లమెంటు ఆమోదముద్ర వేసినా, ప్రత్యేక తరగతి హోదాను కొన్ని రాష్ట్రాలకు కల్పించే విధానాన్ని కొనసాగించాలా! లేదా పునర్ వ్యవస్థీకరించాలా! ఒకవేళ పునర్ వ్యవస్థీకరించాలనే నిర్ణయానికి వస్తే ఏ రూపంలో చేయాలి అన్న అంశాలపై కేంద్రం మొదట తేల్చుకోవాలి. అంత వరకు నేడు ఉన్న విధానమే కొనసాగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి హోదా కల్పించడానికి అడ్డంకులేమిటి? బీజేపీ, మిత్రపక్షాలు, ప్రతి పక్ష కాంగ్రెస్ అంగీకరించిన తరువాత జాతీయ అభివృద్ధి మండలి ఆమోదం పొందడం ఎంత పని? కాబట్టి హోదాపై దాటవేత వైఖరితో చెప్పే మాటలన్నీ ప్రజలను వంచించడానికే. రాజ్యసభలో ఇచ్చిన వాగ్దానం మేరకు ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలనే ప్రతిపాదనకు మార్చి 2014లోనే కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసి, ప్రణాళికా సంఘానికి కూడా పంపింది. మోదీ అధికార పగ్గాలు చేపట్టి ప్రణాళికా సంఘాన్నే రద్దు చేసి, నీతి ఆయోగ్ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రణాళికా సంఘం, నీతి ఆయోగ్, ఆర్థిక సంఘా నికి, ప్రత్యేక తరగతి హోదా కల్పించే అంశానికి లంకె పెట్టడం అసంబద్ధం. అలాగే పునర్విభజన చట్టంలో పేర్కొనలేదని బుకాయించడం అర్థరహిత మైనది.
హోదా వల్ల ప్రయోజనాలు
ప్రత్యేక తరగతి హోదా ఇచ్చిన రాష్ట్రాలకు వివిధ రూపాలలో లబ్ధి చేకూరు తుంది. గాడ్గిల్- ముఖర్జీ నియమావళి ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా నిధులలో 30% ప్రత్యేక తరగతి హోదా ఉన్న రాష్ట్రాలకు, 70% మిగిలిన రాష్ట్రాలకు మంజూరు చేయాలి. కేంద్రం చేసే ఆర్థిక సహాయంలో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు సాధారణ కేంద్ర సహాయం(యన్.సి.ఎ.) పద్దు కింద మంజూరు చేసే నిధులలో 90% గ్రాంటు, 10% రుణంగా (మిగిలిన రాష్ట్రా లకు 30% గ్రాంటు, 70% రుణం) అందుతుంది.
కేంద్ర ప్రాయోజిత పథ కాలు (సి.యస్.యస్.) ఉదా: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం, ఆహార భద్రతా చట్టం, విద్యా హక్కు చట్టం, వైగరా పథకాల అమ లుకు, ప్రత్యేక ప్రణాళికా సాయం(యస్.పి.ఎ.-ప్రాజెక్టుల కోసం) 90% గ్రాంటు, 10% రుణంగాను నిధులు అందుతాయి. ప్రత్యేక కేంద్ర సాయం (ప్రాజెక్టులతో ముడిపడని) 100% గ్రాంటు కింద నిధులు లభిస్తాయి. విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టే పథకాలకు (ఉదా: కృష్ణా డెల్టా, సాగర్ కుడి కాలువ, పెన్నార్ డెల్టా వైగైరా ఆధునీకరణ పథకాలు) కేంద్రం అదనపు సహా యం(ఎ.సి.ఉ.-ఇ.ఎ.పి.) పద్దు కింద 90% గ్రాంటు, 10% రుణంగా అం దుతుంది. మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టే పథకాలకు మొత్తం రుణంగానే అందుతుంది. ప్రత్యేక హోదా కల్పించిన రాష్ట్రాల ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి దోహదపడడానికి కేంద్ర పన్నులలో (ఎక్సైజ్ డ్యూటీ, ఆదాయపు పన్ను) రాయితీలు ఇవ్వాలి.
అర్హతలేమిటి?
1. పర్వత ప్రాంతం, సంక్లిష్ట భూభాగం. 2. జనసాంద్రత తక్కువగా ఉండ డం, జనాభాలో గిరిజనులు గణనీయంగా ఉండడం. 3. సరిహద్దుల వెంబడి వ్యూహాత్మక ప్రదేశంగా ఉండడం. 4. ఆర్థికంగా, మౌలిక సదుపాయాల పరంగా వెనుకబడి ఉండడం. 5. తలసరి ఆదాయం కాస్తా ఎక్కువగా ఉన్నా అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చగలిగిన స్థితిలో లేక పోవడం. వీటిలో చాలా అర్హతలు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నాయి. 960 కి.మీ. సముద్ర తీరం ఉన్నది. హిందూ మహాసముద్రంలోని డిగోగార్షియాను అమె రికా సైనిక స్థావరంగా మార్చివేసింది. బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమానికి భారత్ మద్దతు పలికిందని, దాడి చేయాలనే తలంపుతో అమెరికా సప్తమ నౌకాదళం హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించలేదా? అంతర్జాతీయ ఉగ్ర వాద శక్తులు దేశంలో ప్రవేశించడానికి సముద్ర జలమార్గాలను ఎంచుకొన్న తాజా అనుభవాలు ఉన్నాయి. వీటన్నింటికీ మించి రాజధాని కూడా లేదు. ప్రత్యేక తరగతి హోదాకు ఇంతకంటే అర్హత కావాలా?
ఏడాది అనుభవం ఏం చెబుతున్నది?
విభజన జరిగి ఏడాది గడిచింది. మోదీ ప్రభుత్వం రెండు వార్షిక బడ్జెట్లను ప్రవేశపెట్టింది. మొదటిది పూర్తిస్థాయి బడ్జెట్ కాదని సరిపుచ్చుకొన్నా, 2015-16 వార్షిక బడ్జెట్‌లో కేటాయింపులు చూశాక ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకొనే విషయంలో కేంద్ర నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్త్తున్నదన్న భావన నెలకొన్నది. ‘అపాయింటెడ్ డేట్’ తరువాత, మొదటి రాష్ర్ట వార్షిక బడ్జెట్ రెవెన్యూ లోటును పూర్తిగా కేంద్రమే భర్తీ చేస్తుందని చట్టంలోనే పేర్కొన్నారు. దాదాపు రూ.14,500 కోట్ల రెవెన్యూ లోటు ఉన్నదని కాగ్ నివేదిక ఇస్తే, కేంద్రం ఇచ్చింది ముష్టి రూ.2,300 కోట్లని అంటున్నారు.
పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని చట్టంలో పేర్కొన్నారు. ఆ మేరకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, ముంపు ప్రాంతాలను ఆంధ్రప్ర దేశ్‌లో అంతర్భాగం చేయడం వరకు బాధ్యతగానే వ్యవహరించారు. కానీ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2018 నాటికి పూర్తి చేస్తామని శుష్క ప్రకటనలు చేస్తు న్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారమే రూ.16,500 కోట్లకు పైగా వ్యయ మయ్యే ఆ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకు ఖర్చు చేసిన రూ.4,000 కోట్లు పోగా, ఇంకా రూ.12,500 కోట్లు అవసరం. కానీ ఇందుకు బడ్జెట్లో కేటాయిం చింది రూ.100 కోట్లు. నిరసన వెల్లువెత్తడంతో కేటాయింపును రూ.250 కోట్లకు పెంచారు. ఇలా అయితే ఆ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో కేం ద్రమే సెలవియ్యాలి.
అత్యంత వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి బుందేల్‌ఖండ్, కోరాపుట్- బోలాంగిర్-కాలహండి (కె.బి.కె.) తరహాలో అభివృద్ధి ప్యాకేజీలు అమలు చేస్త్తామని చట్టంలో పేర్కొన్నారు.
ఆచరణలో చేసిం దేమిటి? ఈ ప్రాంతాలలో కొత్తగా పరిశ్రమలను నెలకొల్పే సంస్థలు పెట్టే పెట్టుబడుల మీద 15%, నూతన యంత్రాల తరుగుదలకు అదనంగా 15% రాయితీ కల్పిస్తున్నట్టు, ఈ రెండు ప్రాంతాలలో ఉన్న ఏడు జిల్లాలలో అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం జిల్లాకు రూ.50 కోట్ల వంతున, మొత్తం రూ.350 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసి, చేతులు దులుపుకుంది. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నెలకొలుపుతామని పేర్కొ న్నారు. ఎలాంటి కదలికా లేదు. ఇదేనా అభివృద్ధి ప్యాకేజీ? ఈ అంశాలతో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి ప్యాకేజీని రూపొందించి, అమలుచేసి, సమగ్రాభి వృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలి.
వ్యాసకర్త: నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం
పూర్వ సంచాలకులు, మొబైల్: 9490952221