వెలుగులకీ విభజన?
‘మతం, వర్ణం, కులం, స్త్రీ-పురుష విభేదం, స్థలం (స్థానికత) కారణంగా ఎలాంటి వివక్షకూ దేశపౌరులను గురి చేయరాదు’ అని ఆ అధికరణం శాసించింది. అలాగే భారత పౌరుల కు దేశంలో ఏ ప్రాంతంలో అయినా స్వేచ్ఛగా సంచరించే అవకాశం, ఏ భూభాగంలో అయినా నివాసం ఏర్పరుచుకునే అవకాశం ఉందనీ 19వ అధికరణం కూడా స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ కృత్రిమ విభజన ఏ సమస్యనూ పరిష్కరించలేకపోతున్నదని తెలిసివస్తోంది. అన్ని వర్గాలు - ఉద్యోగులు, విద్యార్థులు, విద్యాసంస్థలు, నదీజలాల సమస్య, విద్యుత్ వ్యవస్థ అడుగడుగునా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి ఇప్పుడిప్పుడే వెల్లడవుతోంది. వీటిలో అతి ప్రధానమైనది - ‘స్థానికత’పేరిట విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినది. అది ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం పరీక్షల నిర్వహణకు సంబంధించినది.
‘స్థానికత’ బెడద
ఉద్యోగుల పంపిణీని స్థానికత అంశం క్లిష్టతరం చేసేసింది. అతీ గతీ తెలియని స్థితిలో ఎంసెట్ కౌన్సెలింగ్ ఉంది. రెండు ప్రాంతాలలోను ఒకే సమయంలో కౌన్సెలింగ్ నిర్వహించినపుడే అడ్మిషన్ల సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కౌన్సెలింగ్‌ను అక్టోబర్ వరకు వాయిదా వేయాలని కోరుతూ ఒక ప్రాంతం కోర్టుకు వెళ్లింది. దానివల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని మరొ క ప్రాంతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కానీ ఈ సమస్య వెనుక అసలు అంశం- ముందు విద్యార్థుల, ఉద్యోగుల ‘స్థానికత’ సమస్య పరిష్కారం కావాలన్న ఒక ప్రాంతం వాదన. 1956కు ముందు వచ్చిన వారి స్థానికత ఆధారంగా విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందిగాని, ఆ తరువాత వలస వచ్చిన వారి కుటుంబాలలోని విద్యార్థులకు ఈ సౌకర్యం ఉండదని ప్రకటించడం పెద్ద తలనొప్పిగా పరిణమించింది. అరవై ఏళ్లు కలిసి ఉన్న రాష్ర్టంలో కొత్తగా స్థానికతను కృత్రిమ పద్ధతిలో అమలులోకి తేవాలని చూడడం ప్రజాస్వామ్య వ్యతిరేక, రాజ్యాంగ విరుద్ధ చర్య.
ముందే చెప్పిన సుప్రీంకోర్టు
రాజ్యాంగాన్ని చదువుకున్నవారు ఎవరూ కూడా అది పౌర జీవితానికి ఇస్తున్న రక్షణను, పాలకులను శాసిస్తూ అందులో పొందుపరిచిన అధికరణలను, నిబంధనలను ఉల్లంఘించలేరు. ఏ ప్రాంతానికి చెందిన పౌరులకైనా ‘సమానమైన రక్షణ’ కల్పించి, వారి హక్కులను కాపాడి తీరాలన్న రాజ్యాంగ నిబంధనలు అతిక్రమించలేనివి. సమైక్య ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత అందులోని అన్ని ప్రాంతాల(కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ) వారి ఎదుగుదలకు ‘సమానావకాశాలు’ కల్పించడం కోసమే మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ, 1973-75 మధ్య రాజ్యాంగ సవరణ ద్వారా 371 (డి)అధికరణను చేర్చారు. ఈ ప్రత్యేక ప్రతిపత్తిని ఎందుకు కల్పించవలసి వచ్చింది? స్వార్థ ప్రయోజనాల కోసం నాయకులు ప్రజల మధ్య ఐక్యతకు గండికొట్టి సమస్యలు సృష్టించకుండా ఉండడానికే. పరిస్థితులను బట్టి మూడు ప్రాంతాలలోని విభాగాల పురోభివృద్ధికి అవసరమైన మార్పులూ చేర్పులూ చేసుకోవచ్చునని కూడా ఆ ప్రత్యేక అధికరణ (371 డి) వెసులుబాటు కూడా కల్పించింది. ఈ ప్రత్యేక అధికరణ రాజ్యాంగ మౌలిక స్వభావానికి అనుకూలమైనదేగానీ, వ్యతిరేకం కాదనీ గతంలోనే సుప్రీంకోర్టు ప్రకటించవలసి వచ్చింది. ఈ అధికరణను సవాలు చేస్తూ వచ్చిన దరఖాస్తులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడుతూ గతంలోనే తీర్పు (డాక్టర్ సి. సురేఖ - యూనియన్ ఆఫ్ ఇండియా 1998/1989) చెప్పవలసి వచ్చింది. రాజ్యాంగానికి పొందుపరిచిన ప్రత్యేక ఉపోద్ఘాతం కూడా పౌరుల మధ్య వివక్ష చూపరాదని ఆదేశిస్తున్నది.
‘సమాన’పునాది లోతైనది
చట్టం ముందు పౌరులంతా సమానమేననీ, రక్షణలు పొందడం వారి హక్కు అనీ రాజ్యాంగంలోని 14వ అధికరణ చాటుతోంది. విస్పష్టమైన ఈ అధికరణల వెనుక భారత స్వాతంత్య్ర సమర స్ఫూర్తీ, దీప్తీ ఉన్నాయని మరచిపోరాదు. స్వాతంత్య్ర సమరం తెచ్చిన చైతన్యం పుణ్యమా అని 1925లోనే కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లు పేరుతో ఈ సమానతా సూత్రాన్ని అమలు చేయడం బ్రిటిష్ ప్రభుత్వానికి సైతం తప్పలేదు. తరువాత కరాచీ కాంగ్రెస్ (1931) తీర్మానం స్థానికత పేరిట పౌర వివక్షను వ్యతిరేకిస్తూ సమానత్వ సూత్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లింది. 1940 నాటి కాంగ్రెస్ మరో తీర్మానం, సప్రూ నివేదిక ఈ సమానత్వ ప్రమాణానికే కట్టుబడవలసి వచ్చిం ది. స్వాతంత్య్రం తెచ్చుకున్న తరువాత నిర్మించుకున్న రాజ్యాంగ చట్టంలో15వ అధికరణ ఇదే అంశాన్ని మరింత కరాఖండిగా చెప్పింది. ‘మతం, వర్ణం, కులం, స్త్రీ-పురుష విభేదం, స్థలం (స్థానికత) కారణంగా ఎలాంటి వివక్షకూ దేశపౌరులను గురి చేయరాదు’ అని ఆ అధికరణ శాసించింది. అలాగే భారత పౌరులకు దేశంలో ఏ ప్రాంతంలో అయినా స్వేచ్ఛగా సంచరించే అవకాశం (క్లాజ్ డి), ఏ భూభాగంలో అయినా నివాసం, స్థిర నివాసం ఏర్పరుచుకునే అవకాశం ఉందనీ 19వ అధికరణం కూడా స్పష్టం చేసింది.
స్వవచన వ్యాఘాతంతోనే!
తెలుగుజాతి మధ్య వారు నివసిస్తున్న తెలుగునేలలో విద్య, ఉపాధి రంగాలలో తలెత్తే సమస్యల పరిష్కారం కోసమే 371 (డి), 371(ఇ) అధికరణల ద్వారా ప్రత్యేక ప్రతిపత్తిని రాజ్యాంగం కల్పించింది. దాని ప్రకారమే రూపొం ది, పరస్పర అంగీకారంతో అమలులోకి వచ్చిందే ఆరు సూత్రాల పథకం. అయితే ఈ పథకమే కాక, దీనితో పాటు జోనల్ పద్ధతి కూడా రద్దు కావాలని 18 ఏళ్ల నాడే (18-7-1996) పిలుపునిచ్చినది నేడు ఒక ప్రాంతపు అత్యున్నత పదవిలో ఉన్న నాయకుడే. అదేమిటో ఆ నాయకుడి మాటల్లోనే, ‘సమాజంలో ప్రగతిశీల భావాలు వస్తూ ఉంటే కొన్ని నష్టాలూ వస్తూంటాయి. ఏ కార్యక్రమాన్నైనా నూటికి నూరు పాళ్లు అమలు చేయడం కష్టం. సమాజంలో నైతిక పరివర్తన జరుగుతోంది. ఉద్యోగులకు సంబంధించి ఆరు సూత్రాల పథకం, జోనల్ విధానం ఈ పరివర్తనను దెబ్బతీస్తున్నాయి. అదనపు సిబ్బందిని రాష్ట్రంలో ఏ మూలనైనా ఉపయోగించుకునే వీలు ఉండాలి. కానీ, ఆ విధానం లేదు. ఇది మనకు మనం విధించుకున్న ఆటంకం, ఆరు సూత్రాల జోనల్ విధానం. దీనిని తొలగించడానికి ప్రయత్నం చేయాలి’. కానీ నాయకులు ఆ ‘ప్రయత్నం’ నుంచి జారుకుని అవకాశవాద పదవీ రాజకీయాలను ఆశ్రయించడం వల్లనే ఈ సమస్యలు జటిలమైనాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి రాజ్యాంగ సవరణ ద్వారా 371 డి ద్వారా ప్రత్యేక ప్రతిపత్తి అవసరమైంది. దాని ప్రకారం ‘ప్రభుత్వ ఉద్యోగ, విద్యా విషయాలలోను ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ప్రజలకు సమాన అవకాశాలను, సౌకర్యాలను, రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రపతి ఉత్తర్వులూ లేదా వేర్వేరు ప్రాంతాలకు వేర్వేరుగా గానీ నిబంధనలనూ జారీ చేయవచ్చు’. ఆ మేరకే తెలుగు జాతి ఉమ్మడి ప్రయోజనాల కోసం 371 (ఇ) అధికరణతోనే కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పారు.
వికృత వాదనలు
చిత్రం ఏమిటంటే, సంస్థానాలు భారత యూనియన్‌లో విలీనం కావడానికి మొరాయిస్తున్న సమయంలో వాటిని దారిలో పెట్టడానికి రాజ్యాంగంలో పొందుపరిచినదే అధికరణ - 3. రాష్ట్రాల విభజనకూ, విలీనానికీ అవకాశం కల్పిస్తున్నందున ఒకప్పుడు ఆ అధికరణను గౌరవించి, తీరా రాష్ట్రాల సరిహద్దులను మార్చేందుకు అదే అధికరణ కేంద్రానికి హక్కును కల్పించింది. ఇప్పుడు దానిని వ్యతిరేకించడం అందుకే. అంతకు మించి జమ్మూ-కాశ్మీర్‌కు రాజ్యాంగం ద్వారా కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని 370 అధికరణ ఒక ప్రత్యేక విలీనపత్రం. దానిని మార్చాలంటే కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్ అనుమతి కావాలి. ఇవేమీ పరిగణించకుండా తమ ప్రాంతానికి కూడా అలాంటి ప్రతిపత్తి కావాలంటూ, తమ ప్రాంతానికి కూడా భారత్ యూనియన్ నుంచి విడిపోయే హక్కు ఎందుకు ఉండరాదో చెప్పాలంటూ విచిత్ర వాదనలు కూడా తలెత్తుతున్నాయి. తెలుగేతరులంటే ప్రేమ, తెలుగు జాతి అంటే ద్వేషం అయితే ఎలా? స్థానికత తెలుగువాడికి కాదు, తెలుగేతరులకు వర్తిస్తుంది. అది కూడా రాజ్యాంగ విరుద్ధమే.
(వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) - ఏబీకే ప్రసాద్