దాతల భూములకూ శఠగోపం
డేట్‌లైన్ హైదరాబాద్
కొన్ని వందల గజాల ప్రభుత్వ భూమిని ఎవరికయినా ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటే కూడా మంత్రివర్గం ఆమోదం పొందడం సాధారణంగా అనుసరించే పద్ధతి. మరి సదావర్తి సత్రం భూముల వ్యవహారం ఎందుకు ఏపీ మంత్రివర్గ సమావేశం ముందుకు పోలేదు? ఈ భూములను అమ్మదల్చుకున్నట్టు బహిరంగంగా ఎందుకు ప్రకటించలేదు?
వెనుకటికి ఒక పెద్ద మనిషిని పాండవులు ఎవరో తెలుసా అని అడిగితే పంచ పాండవులు నాకు ఎందుకు తెలియదు మంచం కోళ్ళ వలె అని సుద్ద ముక్కతో నల్లబల్ల మీద మూడు అంకె వేసి చేతి వేళ్ళు రెండు చూపి నోటితో ఒక్కరు అన్నాడట. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా సాగుతున్న సదావర్తి సత్రం భూముల అమ్మకం వ్యవహారంలో అక్కడి అధికార పార్టీ పెద్దలు ప్రభుత్వ ముఖ్యులూ మాట్లాడు తున్న మాటలు ఈ పంచ పాండవుల కథనే గుర్తు చేస్తున్నాయి. ధార్మిక కార్యక్రమాల కోసం ఎవరో దానం చేసిన భూములను ప్రభుత్వాలు అమ్ము కోవచ్చా అన్న చర్చ తర్వాత చేద్దాం.
సదావర్తి సత్రానికి దాతలు ఇచ్చిన భూమి చెన్నైనగరంలో ఉంది. సత్రంలో రాసి ఉన్న శాసనం ప్రకారం అక్కడికి వచ్చి బస చేసే వారికి అవసరమయిన భోజనం తదితర సదుపాయాలూ సమకూర్చడానికి నిధుల కొరత లేకుండా ఉండేందుకు దాతలు ఆ భూములు దానం చేసారు. చెన్నైలో ఈ సత్రానికి సంబంధించి మొత్తం 554 ఎకరాల భూమి ఉండాలి. అందులో 471 ఎకరాల భూమి ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం వేర్వేరు సంస్థలకు ధారాదత్తం చేసినట్లు రికార్డ్‌లు చెపుతున్నాయి. పోయినవి పోగా 83 ఎకరాల భూమి మిగిలింది. అది దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకు వస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిని సరయిన ఉపయోగంలో పెట్టి ఆ భూమి మీద వచ్చే ఆదాయాన్ని దాతలు ఏ ప్రయోజనం కోసం కేటాయించారో అందుకు ఖర్చు చెయ్యాలి. అక్కడెక్కడో చెన్నపట్నంలో ఉంది మనం దాన్ని అజమాయిషీ చెయ్యలేం అనుకుంటే నిబంధనలను అనుసరించి ఆ భూములు అమ్మి, వచ్చిన డబ్బుతో దాతల మనోభీష్టం నెరవేర్చవచ్చు. అసలు ఈ 83 ఎకరాలను ఏం చెయ్యాలో ఆలోచించే ముందు తమిళనాడు ప్రభుత్వం అమ్ముకున్న లేదా వితరణగా ఎవరికో ఇచ్చేసిన 471 ఎకరాల భూమిని తిరిగి ఎలా సాధించుకోవడం, సాధ్యం కాక పోతే బదులుగా ఆ రాష్ర్ట ప్రభుత్వం నుంచి ఎంత మొత్తం పరిహారం సాధిం చుకోవడం అన్న ఆలోచన చెయ్యాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్‌కు ఉంది.
కానీ ప్రభుత్వం ఆ భూమి గురించి ఆలోచన కూడా చేసినట్లు లేదు. ఈ మిగిలిన 83 ఎకరాలను ఎప్పుడెప్పుడు అమ్మేద్దామా అన్న ఆలోచనే చేసింది. సదావర్తి సత్రం భూముల్ని ఎంతో కొంత మొత్తానికి ఇప్పుడు వెంటనే అమ్మేసి ఆ డబ్బు తెచ్చుకోకపోతే కొత్త రాజధాని కట్టడానికి నిధులు ఉండవేమో అన్నంత హడావుడిగా ఆ భూములను అమ్మకానికి పెట్టింది. ఇక ఈ అమ్మకం వ్యవహారం ఎట్లా సాగిందో చూడండి. ఇదంతా దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందికి వచ్చే వ్యవహారం. ఆ శాఖకు మంత్రిగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు మాణిక్యాలరావుకు చెన్నైలోని సదావర్తి సత్రం భూముల అమ్మకం గురించిన సమాచారం ఏమీ లేనట్టుంది. ఈ భూముల అమ్మకం వ్యవహారంలో ఎంత చర్చ జరుగుతున్నా ముఖ్యమంత్రి, ఆయన కుమా రుడు ఇద్దరి మీదా ఆరోపణలు వస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకున్నారు కాబట్టి మాణిక్యాల రావుగారికి ఈ వ్యవహారం గురించి ఏమీ తెలిసినట్టు లేదు అనుకోవాల్సి వస్తున్నది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం సరిగానే వ్యవహరిం చిందని సమర్థించచూసే బీజేపీ నాయకులు కూడా నీళ్ళు నమలడం చూస్తుంటే.. ఈ వ్యవహారం అంతా గుట్టు చప్పుడు కాకుండా సాగిందనే అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తున్నది.
కొన్ని వందల గజాలు ప్రభుత్వ భూమి ఎవరికయినా ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటే కూడా మంత్రివర్గం ఆమోదం పొందడం సాధారణంగా అనుసరించే పద్ధతి. మొన్న ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం అయినప్పుడు కొన్ని సంస్థలకు భూముల కేటాయింపు నిర్ణయం తీసుకున్నారు. మరి సదావర్తి సత్రం భూముల వ్యవహారం ఎందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముందుకు పోలేదు? ఈ భూములను ప్రభుత్వం అమ్మదల్చుకున్నట్టు బహిరం గంగా ఎందుకు ప్రకటించలేదు? ఆ భూములను వేలం వెయ్యాలని అనుకున్న ప్పుడు అక్కడ తమిళనాడులో ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో పత్రికలలో ప్రకటనలు ఇచ్చి అందరికీ తెలిసేట్టు చెయ్యకుండా ఎందుకు అధికార పక్షానికి చెందిన కాపు కార్పొరేషన్ అధ్యక్షుడి కుమారుడికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు?
ఇక్కడి నుంచి, బయటకు తెలిసిన సమాచారం దగ్గరికి వద్దాం. సదావర్తి సత్రం భూములు చెన్నైలో ఉన్నాయని, వీటిని అమ్మితే ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుందనీ 2014 లోనే ఒక శాసన సభ్యుడు ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియపరిచారు. దేవాదాయశాఖ అధికారి ఒకరు స్వయంగా వెళ్లి ఆ భూముల విలువ తెలుసుకుని వచ్చాక అసలు కథ ప్రారంభం అయిన ట్టు స్పష్టంగా అర్థం అవుతుంది కథంతా వింటే. ఎంతో ఖరీదయిన సదావర్తి సత్రం భూములను రాష్ర్ట ప్రభుత్వం కారు చవకగా స్వపక్షం వారికే అప్పచెప్పుతోందన్న సమా చారంతో ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నాయకత్వంలో చెన్నై వెళ్లి వివరాలు సేకరించిన నిజ నిర్ధారణ బృందం వెల్లడించిన వాస్తవాలు ఎవరినయినా దిగ్భ్రాంతికి గురి చేస్తాయి.
చెన్నైలోని ఆ భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో 16 కోట్ల రూపాయలకు ఎకరం ఉంటుందని స్థానికులను విచారించినప్పుడు తెలిసింది. పోనీ అంత లేదనుకుందాం. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అధికారి ఒకరు వెళ్లి నిర్ధారించిన విలువ చూసినా ఎకరానికి ఆరున్నర కోట్ల రూపాయలు పలుకుతోంది. ప్రభుత్వానికి నిధులకొరత ఉంది కాబట్టి ఆ భూములు అమ్మాల్సిందే అని ప్రభుత్వం నిర్ణయించుకుంటే వేలం వేసేటప్పుడు ప్రభుత్వం కనీస ధర ఆ అధికారి సూచించినట్టు ఎకరానికి ఆరున్నర కోట్లు ఉండాలి. మరి ప్రభుత్వం ఎకరానికి 50 లక్షల రూపాయలు ఏ విధంగా నిర్ణయించి వేలానికి వెళ్ళింది. పోనీ ఆ 50 లక్షల రూపాయలకయినా కట్టుబ డిందా? లేదు కదా.
ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ అధ్యక్షుని కుమారుడికి 27 లక్షలకు ఎకరం చొప్పున అమ్మేయడానికి ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంది? తాను నిర్ణయించిన రూ. 50 లక్షల ధర పలకక పోతే వేలం రద్దు చేసుకుని మళ్ళీ ఒకసారి అందరికీ తెలిసే విధంగా ప్రచారం కల్పించి రెండోసారి వేలానికి వెళ్ళిన సందర్భాలు ప్రభుత్వాల్లో ఎన్నో ఉంటాయి. ఏలినవారు ఆ పని ఎందుకు చెయ్యలేదు. ఎకరానికి 16 కోట్లు విలువ చేసే భూమికి ఆరున్నర కోట్లు ధర నిర్ణయించి వేలానికి వెళ్ళేసరికి 50 లక్షలకు కుదించి చివరికి 27 లక్షలతో సరిపుచ్చి బయానా తీసుకున్న ప్రభుత్వాన్ని.. ప్రారంభంలో ప్రస్తా వించిన పంచ పాండవుల కథ చెప్పిన పెద్ద మనిషితో పోలిస్తే తప్పేలా అవుతుంది?
తమిళనాడు ప్రభుత్వం ఇతరులకు కేటాయించినట్టు చెబుతున్న 471 ఎక రాల భూమిని తిరిగి తీసుకో గలిగినా, దాని విలువ మొత్తం ఆ రాష్ర్ట ప్రభుత్వం నుంచి తీసుకోగలిగినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకు ఏడున్నర వేల కోట్ల రూపాయలు వచ్చి ఉండేది. పొరుగునే ఉన్న చెన్నై వెళ్లి అక్కడి సీఎం జయలలితతో మాట్లాడి పని సాధించుకొచ్చే సమయం మా ముఖ్యమంత్రికి లేదు, ఆయనకు నిధుల వేటలో విదేశాలు తిరగడానికే సరిపోవడం లేదు అని తెలుగు దేశం పెద్దలు ఎవరయినా అనొచ్చు. సరే ఆ 471 ఎకరాలు ఇక మనవి కావు అనుకుంటే కనీసం మిగిలిన ఈ 83 ఎకరాలయినా సరయిన పద్ధతిలో అమ్మితే దాదాపు రూ.1,400 కోట్ల ఆదాయం వచ్చి ఉండేది.
అమరావతి రాజధాని నిర్మాణం అనే బృహత్తర కార్యం నెత్తి మీదేసుకుని తిరుగుతున్న ముఖ్యమంత్రి సీడ్ కాపిటల్ నిర్మాణానికి సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు కట్టబెట్టిన భూములకు బదులు ఆ విదేశీ కంపెనీలు ఇస్తున్నది 300 కోట్లు మాత్రమే. మూడు పంటలు, నాలుగు పంటలు పండే రైతుల భూములు తీసుకుని వాటిని విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టాల్సిన అవసరం లేకుండా, మిగిలి ఉన్న 83 ఎకరాల సదావర్తి సత్రం భూములను సక్రమ పద్ధతిలో అమ్మితే వచ్చే అయిదురెట్ల డబ్బును సీడ్ కాపిటల్ నిర్మాణానికి వెచ్చించి ఉంటే రైతుల భూములు మిగిలిపోయేవి, రేపు భవిష్యత్తులో లండన్ కోర్టుల చుట్టూ తిరిగే బాధలు తప్పేవి. ప్రభుత్వం ఆ పని చెయ్యలేదు.
ఇప్పటికే సదావర్తి భూములు వేలంలో కొనుక్కున్న కాపు కార్పొరేషన్ అధ్యక్షుడు ఈ వ్యవహారంలో తెలియక ఇరుక్కున్నామని ప్రకటించేశారు. సదావర్తి సత్రం భూముల అమ్మకం ప్రక్రియను మొత్తం రద్దు చేసి ఆ భూములను సక్రమంగా విక్రయించి దాతలు నిర్దేశించిన లక్ష్యానికి వాటిని ఖర్చు చెయ్యాల్సిన బాధ్యతా ప్రభుత్వానిదే. ధర్మాదాయ భూములను ఇష్టారాజ్యంగా అమ్ముకో వచ్చని ప్రజలు ప్రభుత్వానికి అధికారం ఇవ్వలేదు.
దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com