
చెన్నై గుణపాఠం అమరావతికి వద్దా?
వరదలు, తుపానులతో నేడు చెన్నై ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులు మనకు ఇస్తున్న సంకేతాలు.. చేస్తున్న హెచ్చరికలు ఏమిటి? ఈ ప్రశ్న సామాజిక కార్యకర్తలను నిద్రపోనివ్వడంలేదు. అలాంటి ముప్పునకు మన ప్రాంతం ఎంతో దూరంలో లేదు. చెన్నై తుపాను గురించి అమెరికాలోని వాతావరణ కేంద్రాలు ముందుగానే హెచ్చరించినప్ప టికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న దాఖలాలు ఏమీ లేవు. సైన్యాన్నీ, జాతీయ విపత్తు నివారణ సహాయక సంస్థలను సంసిద్ధం చేసి, తగిన సదుపాయాలు కల్పించడంలో జరిగిన వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. హుద్‌హుద్ తుపానుకు ముందు ఒడిశా ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలను గురించి ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. దప్పిక అయినప్పుడు బావులు తవ్వినట్లు, విపత్తు తరువాత తీసుకొనే చర్యలకన్నా, ముందు జాగ్రత్త చర్యల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
మన రాష్ట్రంలో నాయుడుపేట నుంచి ఇచ్ఛాపురం వరకు ఉన్న సముద్ర తీర ప్రాంతం నిరంతర వరదలకు, తుపానులకు ఆలవాలమని గుర్తించారు. తరచూ భూకంపాలు ఎదుర్కొనే ప్రాం తంగా కూడా కేంద్ర వాతావరణ శాఖ ఒక నివేదికలో పేర్కొంది. గత 40 సంవత్సరాలుగా ప్రకంపనాలు రికార్డవుతున్నాయి. ఆ ప్రాంతంలోనే ప్రస్తుతం రాజధాని అమరావతి నిర్మాణానికి మన రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి చంద్రబాబు పూనుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం గురించి కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిషన్ 13 జిల్లాలలో శీతోష్ణస్థితి సామాజిక రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధికి సంబంధించిన అసమానతలు అధ్యయనం చేసిన తరువాత కృష్ణా, గుంటూరు జిల్లాలలోని ప్రాంతాలు రాజధానికి అనువైనవి కాదని నివేదిక ఇచ్చిన సంగతిని గుర్తుంచుకోవాలి. నాయుడుపేట నుంచి ఇచ్ఛా పురం వరకూ ఉన్న తీరప్రాంతాన్ని భూకంప ప్రభావిత ప్రాంతమని ఆ నివేదిక కూడా గుర్తుచేసింది.
సముద్ర తీరానికి దూరంగా ఉన్న ఎత్తయిన ప్రాంతం రాజధానికి అనువైనదని కూడా కమిషన్ సూచించింది. ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతం లేదా రాయలసీమ జిల్లాలలో ఏ ప్రాంతంలోనైనా రాజధాని నిర్మించుకో వచ్చునని సిఫారసు చేసింది. అభివృద్ధి అంతటిని ఒకేచోట కేంద్రీ కరించవద్దనీ సూచించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం శివరామకృష్ణ్ణన్ కమిషన్ ఇచ్చిన అమూల్యమైన సూచనలను, సలహాలను పక్కన పెట్టి ఏకపక్షంగా అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేపట్టింది.
నూతన రాజధాని నిర్మాణంలో భాగంగా పెద్ద పెద్ద భవనాలను తుళ్లూరు ప్రాంతంలో నిర్మించడం ప్రమాదకరం. తుళ్లూరు ప్రాంతంలో నల్లరేగడి భూములు ప్రత్యేకించి దిగువ పరీవాహక ప్రాంతం కావడం, పది అడుగుల లోతులోనే నీటి నిల్వలు ఉండడం, ఆ ప్రాంతంలో 50 శాతం భూమికి కొండవీటి వాగు ప్రాంతంలో అత్యధికంగా కురిసే వర్షం వల్ల ప్రమాదం పొంచి ఉండడం పరిగణనలోనికి తీసుకోవలసిన అంశాలే.
ఇంతకీ చంద్రబాబునాయుడు చెన్నై తుపాను ఘటనల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారా? ఇసుక తవ్వకాల మీద ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు చేసిన హెచ్చరికలనైనా గమనంలోకి తీసుకుంటారా? ఇదే గ్రీన్ ట్రిబ్యునల్ అమరావతి ప్రాంతంలో శాశ్వతమైన కట్టడాలు చేపట్టరాదని ప్రధాని మోదీ రాజధాని శంకుస్థాపనకు రావడానికి ముందే ఇచ్చిన ఆదేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు పరిగణనలోనికి తీసుకుంటారా? ఇంతకీ అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ఆ శాఖ కేంద్ర కార్యాలయం నుండి లభించాయా? పర్యావరణ శాఖ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ శాఖ అను మతుల కోసం గ్రామసభలు జరిపి, రైతుల ఆమోదం, అంగీకారం తీసుకోవడానికి తగిన చర్యలు తీసుకున్నదా? ఇవన్నీ చర్చ నీయాంశాలే.
అంతేకాదు చెన్నై నగరంలో విపరీతమైన ఆక్రమణలు జరిగిన ఫలితంగా ఏర్పడ్డ పరిస్థితుల నుంచి కూడా మనం గుణపాఠాలు నేర్చుకోవాలి. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల వరకు చెన్నై తుపాను ప్రభావం ఏ మేరకు ఉన్నదో, పొరుగున ఉన్న మన రాష్ట్రం మీద ఎంత తీవ్రంగా ప్రతికూల పరిస్థితులను రుద్దగలదో గుర్తించాలి. అలాగే హుద్‌హుద్ తుపాను విశాఖ నగ రాన్ని కుదిపేసినప్పుడే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో జరిగిన అపారమైన పంటనష్టం, ఇతర పరిణామాలను కూడా మనం గుర్తుంచుకోవాలి.
ఈ అంశాలన్నింటినీ అధ్యయనం చేస్తూ అమరావతి నిర్మాణం గురించి పునరాలోచన చేయడం మంచిది. రైతుల నుంచి లక్షల ఎకరాలు బలవంతంగా సేకరించి రాజధాని నిర్మాణం, పారిశ్రామిక వ్యవస్థల నిర్మాణం సముద్రతీర ప్రాంతాల్లో చేపట్టడం, అక్కడే కేంద్రీకరించడం మానవద్రోహం, జాతిద్రోహం. ఈ విషయాన్ని చంద్రబాబు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.
-ఇమామ్
వ్యాసకర్త కదలిక సంపాదకులు. మొబైల్: 99899 04389