ఆత్మహత్యల్ని ఆపని రుణమాఫీలు
విశ్లేషణ
సాధారణంగా రుణమాఫీ ప్రకటించిన తర్వాత రైతు ఆత్మహత్యల సంఖ్య తగ్గుముఖం పట్టాలి. రైతులందరికీ కాకున్నా, రుణ మాఫీ వల్ల సన్నకారు, చిన్నకారు రైతుల్లో ఒక సెక్షన్‌కు లభ్ది చేకూరుతుంది. కానీ రుణ మాఫీ ప్రకటించిన తర్వాత కూడా రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయంటే.. వ్యవసాయ సంక్షోభం గురించిన మన అవగాహనలో ఘోరమైన తప్పు ఏదో ఉందనే చెప్పాలి. బహుశా కొనసాగుతున్న వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించడంలో రుణ మాఫీ సరైన మార్గం కాకపోవచ్చు.
తన ప్రభుత్వం రూ. 2 లక్షల వరకు సన్నకారు రైతుల రుణాలను రద్దు చేస్తుందని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పదే పదే నొక్కి చెబుతున్నారు. 10.25 లక్షల మంది రైతులకు మేలు చేకూర్చే ఈ రుణ మాఫీ వల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 9,500 కోట్లు ఖర్చు అవుతుంది. మహారాష్ట్రలో తమ ప్రభుత్వం ప్రకటించిన రూ.34,000 కోట్ల రైతు రుణమాఫీ వల్ల 89 లక్షలమంది రైతులు లభ్ధి పొందుతారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. అయినప్పటికీ రుణమాఫీ ప్రకటిం చిన రాష్ట్రాల్లోనూ రైతుల ఆత్మహత్యలు పెరుగుతూనే ఉన్నాయి.
గత 20 రోజుల్లో పంజాబ్‌లో 21మంది రైతులు ఆత్మహత్యల పాలబడ్డారు. తాను రుణ మాఫీ ప్రకటించినప్పటినుంచి రైతుల ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయో అర్థం కావడం లేదని ముఖ్యమంత్రి వాపోయారు. మహారాష్ట్రలో అయితే గత రెండు వారాల్లో 42మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క మరట్వాడా ప్రాంతంలోనే జూన్ 19 నుంచి జూన్ 25వరకు వారంరోజుల వ్యవధిలో 19మంది రైతులు తమ జీవితాలను ముగించుకున్నారు. మధ్యప్రదేశ్‌లో పోలీసు కాల్పుల్లో 5గురు రైతులు చనిపోయిన నాటి నుంచి ఇప్పటివరకూ 38 మంది రైతులు ఆత్మహత్యల బారినపడ్డారు.
రుణమాఫీల తర్వాత పెరుగుతున్న ఆత్మహత్యలు
సాధారణంగా రుణమాఫీ ప్రకటించిన తర్వాత రైతు ఆత్మహత్యల సంఖ్య తగ్గుముఖం పట్టాలి. రైతులందరికీ కాకున్నా, రుణ మాఫీ వల్ల సన్నకారు, చిన్నకారు రైతుల్లో ఒక సెక్షన్‌కు లభ్ది చేకూరుతుంది. కానీ రుణ మాఫీ ప్రకటిం చిన తర్వాత రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయంటే.. వ్యవసాయ సంక్షోభం గురించి మన అవగాహనలో ఘోరమైన తప్పు ఏదో ఉందనే చెప్పాలి. బహుశా కొనసాగుతున్న వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించడంలో రుణ మాఫీ సరైన మార్గం కాకపోవచ్చు లేదా రుణ మాఫీలు రూపొందించి అమలు చేస్తున్న విధానం సన్నకారు రైతులకు కూడా పెద్దగా లబ్ధి చేకూర్చకపోయి ఉండవచ్చు.
వ్యవసాయ దిగుబడులకు తగిన ధర వచ్చే అవకాశం కనిపించని తరుణంలో, తదుపరి పంటకోసం తాను తీసుకోబోయే రుణాన్ని ఎలా చెల్లించాలి అన్నదే రైతుల సమస్య. రైతుల్లో చిన్న విభాగానికి ఇప్పటికే ఉన్న రుణం మాఫీ చేసినప్పటికీ, తదుపరి పంటకోసం కొత్తగా వీరు రుణం తీసుకోవలసిందే. ఇన్ని సంవత్సరాలుగా రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు పొందలేకపోయారని నేను అంగీకరిస్తున్నాను. అందుచేత రుణ మాఫీ అనేది రైతుకు ఎంతో కొంత చెల్లింపు సామర్థ్యాన్ని ఇస్తుందనే చూడాల్సి ఉంటుంది. అయితే రుణమాపీల వెనుక ఉన్న వాస్తవం కేసి కూడా దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని తలుస్తున్నాను. మన ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు మరింత సృజనాత్మకంగా వ్యవహరించి దీర్ఘకాలంలో రైతుల చేతుల్లో నిజ ఆదాయాలు చేకూరేలా చర్యలను సూచించాల్సి ఉంది.
పంజాబ్ విషయం చూడండి. ఇది దేశానికే అన్నపూర్ణ. ఇక్కడ గోధుమ, వరి, మొక్కజొన్న వంటి ఆహార ధాన్యాల సాగు, ఉత్పత్తి 98 శాతం వరకు గ్యారంటీగా జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యధిక శాతం సాగు, దిగుబడితో పంజాబ్ రికార్డు సృష్టిస్తోంది. కానీ ఇంత అభివృద్ధి సాధించిన రైతులు కూడా ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో నాకు ఊహకు అందడం లేదు. పంజాబ్ ఇప్పుడు రైతు ఆత్మహత్యల ప్రధాన కేంద్రంగా మారింది. ప్రధాన కారణం... ఇక్కడి రైతులు కనీస మద్దతు ధర విధానం నుంచి తగిన ఆదాయం పొందకపోవడమే. విస్తృతమైన స్థాయిలో క్రమబద్ధీకరణకు గురైన మండీలు, గ్రామీణ రహదారులు ఉన్నప్పటికీ స్వామినాథన్ సిఫార్సు చేసినట్లుగా పంజాబ్‌లో వ్యవసాయానికి పెట్టిన ఖర్చుపై 50 శాతం లాభాలు కూడా రైతులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయని నాకు ఆశ్చర్యం వేస్తుంది. పంటల సేకరణపై చక్కటి నెట్‌వర్క్ కలిగిన పంజాబ్, హరియాణాలకు ఇది మాత్రమే ఆచరణాత్మక పరిష్కారం, కానీ దేశంలోని ఇతర రాష్ట్రాలకు మాత్రం నేను ఇదివరకే సూచించినట్లుగా రైతుల ఆదాయ కమిషన్‌ను ఏర్పర్చాల్సి ఉంది.
దశాబ్దాలుగా క్షీణించిన కనీస మద్దతు ధర
ఉదాహరణకు, పంజాబ్‌లో స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు రైతులకు సహాయం అందించాలంటే సంవత్సరానికి రూ. 8,237 కోట్లు ఖర్చవుతుంది. కానీ నా అంచనా మేరకు గోధుమ పంట పెట్టుబడి ఖర్చు క్వింటాలుకు రూ. 1,203లు అవుతుంది దీనికి 50 శాతం లాభాన్ని కలుపుకుంటే క్వింటాల్‌కు మొత్తం ఖర్చు రూ.1,805లు మాత్రమే అవుతుంది. క్వింటాలుకు కేంద్రం కనీస మద్దతు ధర కింద రూ.1,625లు చెల్లించింది కాబట్టి క్వింటాలుకు మిగిలిన రూ.180లను మాత్రమే ప్రభుత్వం రైతులకు అదనంగా చెల్లిస్తే చాలు. మరోవిధంగా చెప్పాలంటే, 2016–17 మార్కెటింగ్ సీజన్‌లో పంజాబ్‌లో రైతులు 106.5 లక్షల టన్నుల గోధుమ పండించారు. ఈ లెక్క ప్రకారం పంజాబ్ ప్రభుత్వంపై కేవలం రూ. 1,917 కోట్ల భారం మాత్రమే పడుతుంది.
ఇక వరి విషయంలో, వ్యవసాయ ఉత్పత్తి ఖర్చు, 50 శాతం లాభం కలిపితే కొంత ఎక్కువ మొత్తమే అవుతుంది. క్వింటాల్ వరికి ఈ ప్రాతిపదికన రూ. 1,484లు ఉత్పత్తి ఖర్చుకాగా 50 శాతం లాభాన్ని కలుపుకుంటే వరి క్వింటాల్ ఉత్పత్తి ధర రూ. 2, 226లు అవుతుంది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తే పడే మొత్తం భారం రూ. 6,320 కోట్లు అవుతుంది. గోధుమ, వరి రెండు పంటలకూ పంజాబ్ ప్రభుత్వంపై పడే వార్షిక భారం రూ. 8,237 కోట్లు అవుతుంది.
ప్రభుత్వంపై పడే ఈ రూ. 8,237 కోట్ల భారం అలవిమాలినదని, ప్రభుత్వ వనరులను వృధాపర్చడమేనని మీరనుకుంటే దీనిపై మళ్లీ ఆలోచించాల్సిందే. పంజాబ్ రైతులు గడచిన దశాబ్దాలుగా తమకు న్యాయంగా రావలసిన కనీస మద్దతు ధరకు దూరమైపోయారు. గతంలో బాదల్ ప్రభుత్వం నియమించిన డాక్టర్ ఆర్‌ఎస్ గౌమన్ కమిటీ రిపోర్టు ప్రకారం 1970–2007 మధ్య కాలంలో పంజాబ్ రైతులు కనీస మద్దతు ధరను అతి స్వల్పంగా పొందిన కారణంగా మొత్తం రూ. 62 వేల కోట్లు నష్టపోయారు. కాబట్టి వ్యవసాయంలో ఆర్థిక క్షీణత అనేది ఈనాటిది కాదు. హరిత విప్లవం మొదలైన కాలం నుంచే ఇలా జరుగుతూ వస్తోంది. మరి ఆ రైతులకు ఇది తిరిగి చెల్లించాల్సిన సమయం కాదా? ఇంకా ఎంతకాలం రైతులను రెండో తరగతి పౌరులుగా చూస్తూంటాం? రైతులకు కనీస మద్దతు ధర గురించి మాట్లాడితే చాలు, ఇది వాంఛనీయం కాదంటూ తీవ్రంగా నిరసనలు బయలుదేరతాయి. కనీస మద్దతు ధరను ఎన్నటికీ తక్కువగానే ఉంచాలని, లేకుంటే రిటైల్ ఆహార ధరలు పెరుగుతాయని వాదిస్తుంటారు. అంటే వినియోగదారులకు తక్కువ రేట్లకు ఆహార ధాన్యాలు అందించడం కోసం రైతులు నిత్య దారి ద్య్రంలో మునిగి తేలాల్సిందే అన్నమాట.
ఉద్యోగులు సరే.. రైతుల, కూలీల సంక్షేమం ఎవరి బాధ్యత?
పంజాబ్‌లో మాదకద్రవ్యాల సమస్య కూడా వ్యవసాయం అథఃపతనానికి దారి తీసింది. సంవత్సరాలుగా వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోవడంతో నగరాల్లో పనికి అవకాశాలు లేకపోవడంతో గ్రామీణ యువత డ్రగ్స్ తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. స్వావలంబనతో కూడిన జీవన పరిస్థితుల కల్పన ఒక్కటే ప్రస్తుతం వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చగలదు. పంజాబ్‌లోని 18 లక్షల వ్యవసాయ కుటుంబాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వ్యవసాయం లాభదాయకంగా ఉంటుందని ఈ కుటుంబాలు నమ్మినప్పుడే వ్యవసాయం విషయంలో పంజాబ్ గర్వంగా తలెత్తుతుంది. ఉడ్తా పంజాబ్ ఇమేజ్‌ను ముందుకు తీసుకుపోయి తక్కిన దేశానికి ఒక నమూనాగా నిలబడాలంటే దిద్దుబాటు చర్యలు చేపట్టడానికి పంజాబ్‌కి ఇదే మంచి తరుణం. ఇక పంజాబ్ ప్రభుత్వం విషయానికి వస్తే తన ఉద్యోగులకు ఆదాయ ప్యాకేజ్, అలవెన్సుల పట్ల జాగ్రత్త తీసుకోవడం మాత్రమే కాకుండా, వ్యవసాయదారులు, కూలీల సంరక్షణ బాధ్యత కూడా చేపట్టాలి.
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు hunger55@gmail.com
దేవిందర్‌శర్మ