
మోదీకి ‘నరేంద్రుని’కి చుక్కెదురు
అధికారంలోని బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్-సంఘ పరివార్‌లే బలవంతపు మతమార్పిళ్లకు తెరలేపి, దొంగే ‘దొంగ! దొంగ!’ అని అరిచినట్టుగా.. మతమార్పిళ్ల వ్యతిరేక జాతీయస్థాయి చట్టాన్ని ప్రతిపాదిస్తునాయి. ఈ మతమార్పిళ్ల విషయంలో బెంగాల్ నరేంద్రనాథ్ (స్వామి వివేకానంద)కు, గుజరాత్ నరేంద్రమోదీకి మధ్య భావాలలోనూ, ప్రవర్తనలోనూ ఆకాశానికీ, భూమికీ మధ్య ఉన్నంత తేడా ఉంది. వివేకానందుడు దేశభక్తుడూ, సెక్యులర్ భావదీప్తి గల సమున్నత వ్యక్తి. కాగా, మోదీ సెక్యులర్ తత్వానికి వ్యతిరేకి, ‘పురోభివృద్ధి’ పేరు మాటున మతైక దృష్టితో భారతీయ సమాజం చీలికకు పునాదుల్ని స్థిరపరిచే శక్తి కాబోతున్న వాడు!
‘‘‘స్మృతి’ సాహిత్యం, పురాణాలు పరిమితమైన, మిడిమిడి జ్ఞానం గల వారి కల్పనలు మాత్రమే. అవన్నీ కట్టుకథలు, తప్పుల తడకలతో నిండినవీ, వర్గ ప్రయోజనంతో, అసూయాద్వేషాలతో కూడినవీ’’. - స్వామి వివేకానంద: సంపూర్ణ రచనలు; సంపుటం 6; పేజీ 393-94. ఎంత సాగదీసినా కుక్కతోక వంకర వంకరేనని, ఎన్నటికీ సాఫీగా మారదని తెలుగువారి సామెత! అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంది వచ్చింది గదా అని, దాన్నెలాగైనా, ఎందుకైనా వినియోగించుకోవచ్చని బీజేపీ (ఎన్డీయే), సంఘ్ పరివార్‌లు భావించాయి. దాన్ని ఉపయోగించుకొని ఎన్నికల్లో విజయావకాశాలను పెంచుకోవచ్చని భావించాయి. ఎన్నికల ప్రచారంలో ‘‘అభివృద్ధి’’ ఎజెండాను ఎన్నికల ప్రచారంలో తెగ ‘ఊదర’ కొట్టాయి. అధికారంలోకి వచ్చింది మొదలు, ఆ ‘‘అభివృద్ధి’’ ఎజెండాను అవతల పెట్టి, రోజుకొక తీరులో భారత సమాజాన్ని చీల్చికూర్చునే అజెండాను ముందుకు నెడుతూవస్తున్నాయి! అధికార నిర్వహణలో ఒకరు ప్రత్యక్షంగా పాత్రలు పోషిస్తుంటే, మరొకరు పరోక్ష సారథులుగా వ్యవహరిస్తున్నారు. కానీ ఎజెండా మాత్రం ఒకటే. కాషాయరంగు మాత్రం మారదు!
దొంగే ‘దొంగ! దొంగ!’ అని అరిచినట్టు...
రంగుమార్చకుండానే దిక్కుమార్చి ప్రజాబాహుళ్యాన్ని మోసగించే పార్టీలలో బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ వర్గం ఒకటి. ‘‘మతం వేరైతేను ఏమోయ్? మనసులొకటై మనుషులుంటే జాతియన్నది లేచి పెరుగును’’ అన్న గురజాడ మహాకవి మాటకు బుద్ధీ, జ్ఞానం ఉన్నవాడెవడైనా వెంటనే స్పందించాలి. ముజఫర్‌నగర్, ఆగ్రా, అలీగఢ్ అల్లర్లకు, కల్లోలాలకు కారణమైన బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్-సంఘ్ పరివార్ ముఠాలు అధికారంలో ఉండి తామే స్వయంగా బలవంతపు మతమార్పిళ్లకు తెరలేపాయి. దొంగే ‘దొంగ! దొంగ!’ అని అరిచినట్టుగా ఏమీ ఎరగని ‘నంగనాచి’లా ‘‘మతమార్పిళ్లను శాశ్వతంగా అణచివేయడానికి జాతీ యస్థాయిలో చట్టాన్ని రూపొందించాల’’ని ప్రతిపాదిస్తునాయి. అసలు ఇప్పుడు మతమార్పిళ్లకు సాహసించింది ఎవరో తేల్చకుండానే బలవంతపు మత మార్పిళ్ల గురించి గగ్గోలు చేస్తోంది.
ఇంతకుముందెన్నడూ లేనంత స్థాయిలో కేంద్రంలో అత్యధిక మెజారిటీ సాధించిన తర్వాత ‘‘మోదిత్వ’’ రాజకీయంతో, ‘హిందూత్వ’ నినాదం కింద బీజేపీ ప్రభుత్వం గజ్జెకట్టింది! ఈ ముఠా కింద పనిచేసే వారిలో రాష్ట్రాల గవర్నర్లు ఉన్నారు, ముఖ్యమంత్రులూ ఉన్నారు. వీళ్లకి రాజ్యాంగంతో నిమిత్తం లేదు, చట్టం ముందు అందరూ సమానులేనన్న నిబం ధనతో గాని, మతాతీత లౌకిక (సెక్యులర్) వ్యవస్థ లక్ష్యంతో గాని మమేకత లేదు, రాజ్యాంగంలోని ‘51-ఎ’ అధికరణ అందరికీ నిర్దేశిస్తున్న ప్రాథమిక పౌర బాధ్యతలతో నిమిత్తం లేదు. అందులోనూ దేశంలోని విభిన్న మతాల, వర్గాల, సంప్రదాయ, సుసంపన్న ఉమ్మడి వారసత్వ సంస్కృతీ విలువల్ని పరిరక్షిం చుకోవాలన్న ఆదేశం (51-ఎ-ఎఫ్) పట్ల పట్టింపు లేదు. ప్రజా బాహుళ్యంలో శాస్త్రీయ దృక్పథాన్నీ మానవత్వాన్నీ, జిజ్ఞాసను, సంస్కరణ భావాలను పెంపొం దించాలన్న ఆదేశాన్ని (51-ఎ-హెచ్) పాటించాలన్న ధ్యాస సైతం ఈ ముఠాకు, వారి ప్రతినిధులైన పాలకులకూ బొత్తిగా లేదు.
రాజనీతిజ్ఞత కాదు కుటిల నీతి
దాదాపు 20 కోట్ల మంది ముస్లింలు భారతదేశ జనాభాలో అంతర్భాగమై ఉండగా, ఆ మాటకొస్తే అంత జనాభా ఉన్న దేశమే యూరప్‌లో లేని దశలో... పాత చరిత్రలు వేటినో దుమ్ముదులిపి వర్తమానాన్ని ధ్వంసం చేయడానికి కంకణం కట్టుకోవటం, అటూ ఇటూ కూడా చరిత్ర నమోదు చేసిన వైషమ్య దశలను నెమరువేసుకుంటూ మతమార్పిళ్ల పేరిట కక్ష సాధించాలని చూడటం రాజనీతిజ్ఞత కాదు. 1925లో మతసంస్థగా జన్మనెత్తిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆ రోజే కాదు, ఈ రోజు కూడా మత రాజకీయానికే కట్టుబడి ఉంది. దాని పిల్ల సంస్థగా, క్రమంగా ఒక రాజకీయ సంస్థగా అవత రించి, ఇప్పుడు అధికార స్థానంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, దాని మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌లు నేడు కూడా ఆ విషయాన్ని దాచుకోలేకపోతున్నాయి.
2002లో గుజరాత్‌లో మైనారిటీలపై సాగించిన ఊచకోతను దేశం మరిచిపోక ముందే, ఆ కేసుల్లో సుప్రీంకోర్టు తన తుది తీర్పును ఇంకా ప్రకటించకముందే... బీజేపీ అధికార స్థానాల నుంచి మళ్లీ పాత ఎజెండానే (మతమార్పిళ్ల పేరిట) అందిపుచ్చుకోవటం శతవిధాలా గర్హనీయమైన విషయం. మరోవంక ఒక గవర్నర్ స్థాయి వ్యక్తి మళ్లీ వివాదాస్పద రామ మందిర నిర్మాణం గురించి ప్రస్తావిస్తున్నాడు. దేశంలో దారిద్య్రంలో మగ్గుతున్న అసంఖ్యాక పేద ప్రజానీ కాన్ని బేషరతుగా ఆ దుస్థితి నుంచి బయటపడవేయడానికి మారుగా అన్య మతస్తుల్ని ‘‘హిందూత్వం’’ ముసుగులో బలవంతపు ప్రలోభాలతో మత మార్పిళ్లు చెందించడానికి బీజేపీ పరివార్ సిద్ధమవుతోంది! ‘‘ఆర్‌ఎస్‌ఎస్ మా మాతృసంస్థ కాబట్టి దాని విధానాల నుంచి మేము దూరమయ్యే ప్రసక్తేలేద’’ని నరేంద్రమోదీ మంత్రివర్గంలో సీనియర్ సభ్యుడే బల్లగుద్ది చెబుతున్నాడు! గుజరాత్ ఊచకోతలకు, సొహ్రాబుద్దీన్ దంపతుల ఎన్‌కౌంటర్లకు కారకులైన బీజేపీ నాయకులపై ఉన్న తీవ్రమైన కేసులు ఇంకా ఒక కొలిక్కి రాకుండానే ఈ మతమార్పిళ్లతో దేశ ప్రజలలోని అన్యమతస్తుల్ని అభద్రతా భావానికి గురిచేస్తున్నారు.
భారీ స్థాయిలో ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ ప్రజల్ని బలవంతంగా ‘హిందువులు’గా మార్చే ప్రయత్నంలో భాగంగా బీజేపీలోని ‘హిందూత్వ’ శక్తులకు సందేశాలిస్తున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రధానమంత్రి మోదీ గానీ, అతని కేబినెట్ గానీ, పార్టీగా బీజేపీ గానీ ఈ ఘటనలపై స్పందించడం లేదు. ఇందులో భాగంగానే, ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ‘ధరమ్ జాగరణ్ సమితి’ పేరిట ఉన్న ‘హిందూత్వ’ ముఠా డిసెంబర్ 25న (క్రిస్మస్ పండుగ) ఇంత వరకూ ఎన్నడూ జరగనంత భారీస్థాయిలో ‘మతమార్పిడి శిబిరాన్ని’ నిర్వహించబోవడమంటే... భారతీయ సమాజాన్ని కక్షల కుంపటిగా మార్చడానికి పరివార్ వర్గం సిద్ధమయినట్టేనని భావించక తప్పదు. ‘హిందూత్వం’లోకి మతమార్పిడికి ముస్లింలకైతే తల ఒక్కింటికి రూ.5 లక్షలు, క్రైస్తవులైతే రూ.2 లక్షల చొప్పున అవసరమనీ, ఇది ‘ఖరీదైన’ వ్యవహారం కాబట్టి అంత డబ్బు అవసరమనీ చెబుతూ తేదీ పాడూ లేని కరపత్రాలను, ఉత్తరాలనూ ‘జాగరణ్ సమితి’ అధిపతి రాజేశ్వర్‌సింగ్ అలీగఢ్‌లోని కుటుంబాలకు పంచడం మరో వివేషం.!
వివేకానందుడు, మోదీ భిన్నధ్రువాలు
ఈ మతమార్పిళ్ల విషయంలో బెంగాల్ నరేంద్రనాథ్ (స్వామి వివేకానంద)కు, గుజరాత్ నరేంద్రమోదీకి మధ్య భావాలలోనూ, ప్రవర్తనలోనూ ఆకాశానికీ, భూమికీ మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంది. బెంగాల్ నరేంద్రుడు దేశభక్తుడూ, సెక్యులర్ భావదీప్తి గల సమున్నత వ్యక్తి. కాగా, గుజరాత్ నరేంద్రుడు సెక్యులర్ వ్యతిరేకి, ‘పురోభివృద్ధి’ పేరు చాటున మతైక దృష్టితో భారతీయ సమాజం చీలికకు పునాదుల్ని స్థిరపరిచే శక్తి కాబోతున్నవాడు! మతమార్పిళ్లు ఎందుకు, ఎలా చరిత్రలో జరుగుతాయో శాస్త్రీయంగా నేలతల్లి సాక్షిగా స్వామీ వివేకానం దుడు ఇలా వివరించాడు:
‘‘భారతదేశంలోని నిరుపేద ప్రజా బాహుళ్యంలో అనేక మంది మహమ్మదీ యులుగా ఎందుకు ఉండవలసి వచ్చింది? వాళ్లందరినీ ఎవరో కత్తి చూపి తమ మతంలోకి మార్చుకున్నారని చెప్పడం బుద్ధిలేని మాట. ఎందుకంటే, అంత పెద్ద సంఖ్యలో భారత పేదలు జమిందారుల నుంచీ, భూస్వాముల నుంచీ పురోహిత మతాధిపతుల నుంచి విముక్తి పొందాలని భావించారు. ఫలితంగానే వ్యవసాయకులైన బెంగాల్ సాగుదార్లలో హిందువులకన్నా మహమ్మదీయులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కునారిల్లిపోతున్న అసంఖ్యాక బడుగువర్గాల ప్రజల్ని ఉద్ధరించాలన్న తలంపు ఎవడికైనా వచ్చిందా? కొలది వేల మంది పట్టభద్రులు ఒక జాతికి ప్రతినిధులు కాజాలరు, అలాగే కొలది మంది ధనికులు, సంపన్నులు మాత్రమే భారత జాతికాదు. జనాభాలో 90 శాతం మంది విద్యలేని వారే. వీరిని గురించి ఆలోచిస్తున్న వాడెవడు? ... బోధించాల్సింది విశ్వజనీనమైన మానవతను. భారత ప్రజలు తమ నెత్తికెక్కి అధికారం చలాయించే ‘బాసెస్’ను (అధిష్టానశక్తుల్ని) తోసిరాజంటూ వచ్చారు. మన ధర్మచింతనలో ప్రతీకలకూ (సింబల్స్), ఆచారాలకూ కర్మకాండలకూ చోటు లేదు. ఉపనిషత్తుల సారమంతా అదే సుమా! అంతా ఒక్కటే, అందరూ సమానమే, అదే అద్వైతం. మూఢనమ్మకాల్ని, మూఢవిశ్వాసాల్ని వదిలేయండి. ప్రకృతిలోని అద్వితీయమైన సమ్మేళనాశక్తినీ, సమతుల్యతనూ ఒక్కసారి దర్శించండి. అలాగే అన్ని మతాల సారమూ ఒక్కటే.
ఈ భూమిలో పొదిగి ఉన్న సకల మతాల మహనీయ స్వరసమ్మేళనానికి దోహదం చేస్తున్న వాద్యబృందం నుంచి కావాలని ఒక వాద్య పరికరాన్ని ఎందుకు వేరు చేసి రసాభాస చేస్తావ్?’’ అని ప్రశ్నించాడు వివేకానంద! మతమార్పిళ్ల వల్ల, బహుళ జాతుల, బహుభాషల, విభిన్న మతాల బహురూపులతో కూడిన ఇండియా తన రత్నా లలో భాగమైన ఇతర రత్నాలను కోల్పోవలసివస్తుందని, ఫలితంగా మనదిగా భావిస్తున్న ‘హిందూ’ సమాజం కూడా తన ధర్మ చింతననూ కోల్పోయి శాశ్వత దైన్యంలో కూరుకుపోతుందనీ పేర్కొన్నాడు బెంగాలీ నరేంద్రుడు! అందుకే మనది జ్యోతిషం (ఆస్ట్రాలజీ) కాదు, ఖగోళశాస్త్రం (ఆస్ట్రానమీ) మాత్రమేనని కూడా బోధించాడు!
గుజరాతీ నరేంద్రాదులు ఈ విలక్షణమైన విజ్ఞానదాయక మైన మార్గం నుంచి ఎందుకు దూరం కావలసివచ్చిందో, ఎందుకు సహజ విచ్ఛిన్నకులుగా రూపాంతరం చెందవలసివచ్చిందో ప్రజలు తెలుసుకోగోరు తున్నారు! ఆఖరి మాట - ‘హిందూ’ శబ్దం అపభ్రంశం. పర్షియన్లకు ‘హ’కార ప్రయోగమే తప్ప, ‘స’ కారం పలకదు. అందుకని మన దేశంపైకి దూసుకొచ్చిన పర్షియన్లు ‘సింధు’ నదీ ప్రాంత నాగరికతను ‘హిందు’గా ఉచ్ఛరించడం వల్లనే, అది ‘హిందు’ శబ్దంగా వికార రూపం పొందిందని మహా పండిత రాహుల్ సాంకృత్యయన్ ఏనాడో వివరించాడు!
(వ్యాసకర్త మొబైల్: 98483 18414)
- ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు